కలకలం రేపిన విద్యార్థి ఆత్మహత్య
కాలేజీ వద్ద విద్యార్థి సంఘాల ఆందోళన
వేధింపులతోనే ఆత్మహత్య: తండ్రి ఆరోపణ
గోల్నాక: నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ప్రణీత్కుమార్రెడ్డి అనే విద్యార్థి ఆత్మహత్య ఘటన తీవ్ర కలకలం సృష్టించింది. విద్యార్థి మృతికి నిరసనగా విద్యార్థి సంఘాలు ధర్నా నిర్వహించాయి. ప్రణీత్ మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఫీజు కోసం కాలేజీ యాజమాన్యం వేధించడంతోనే తన కుమారుడు ప్రాణం తీసుకున్నాడని విద్యార్థి తండ్రి ఆరోపించారు.
కరీంనగర్ జిల్లా హుస్నాబాద్‌కు చెందిన ముత్యాల సంజీవరెడ్డి కుమారుడు ప్రణీత్ కుమార్‌రెడ్డి(17) నల్లకుంటలోని నారాయణ జూనియర్ కళాశాలలో ఇంటర్ ఏంపీసీ (ఐఐటీ) ద్వితీయ సంవత్సరంచదువుతున్నాడు. శుక్రవారం అర్ధరాత్రి కళాశాల హాస్టల్లోని బాత్రూమ్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రణీత్ బాగానే చదివేవాడని, కాగా, అతను గత పది రోజులుగా తనకు చనిపోవాలని ఉందని, భవనం పై నుంచి దూకితే చనిపోతారా? ఏదైనా తాగితే చనిపోతారా? అని అడగడంతో పాటు చదువు విషయంలో ఒత్తిడికి గురవుతున్నట్టు చెప్పేవాడని తోటి విద్యార్థులు తెలిపారు.
సినిమా డెరైక్టర్ కావాలని..?
ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి ప్రణీత్ సినిమా డెరైక్టర్ కావాలనుకున్నట్లు సమాచారం. తనకు సినిమా డెరైక్టర్ కావాలనుందని, ఈ చదువు తనకు ఇష్టం లేదని పలుమార్లు అతను తమతో అన్నాడని తోటి విద్యార్థులు కొందరు తెలిపారు. ఈ విషయం అతను తన కుటుంబ సభ్యులకు కూడా చెప్పాడన్నారు.
వేధింపులే కారణం: తండ్రి
నారాయణ కళాశాల యాజమాన్యం ఫీజుల కోసం తోటి విద్యార్థుల ముందు తన కుమారుడిని వేధించడంతో ఆత్మహత్య చేసుకున్నాడని ప్రణీత్ తండ్రి సంజీవరెడ్డి ఆరోపించారు. ఈ మేరకు అంబర్‌పేట పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
విద్యార్థి సంఘాల ధర్నా
నల్లకుంట: ప్రణీత్కుమార్రెడ్డి ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసి ఏబీవీపీ, టీజీబీపీ, టీఆర్వీపీ, ఎమ్మార్పీఎస్, ఎంఎస్ఎఫ్ తదితర విద్యార్థి సంఘాల నాయకులు, కార్యకర్తలు శనివారం ఉదయం నల్లకుంటలోని నారాయణ కళాశాల ఎదుట ధర్నా నిర్వహించారు. కళాశాల యాజమాన్యం, అధ్యాపకుల వేధింపులే ప్రణీత్ మృతికి కారణమని ఆరోపించారు. కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకుంటున్నాయని, ప్రణీత్ మృతిపై సిట్టింగ్‌జడ్జితో విచారణ జరిపించాలని ఏబీవీపీ సెంట్రల్ జోన్ వర్కింగ్ కమిటీ సభ్యుడు కడియం రాజు డిమాండ్ చేశారు.
విద్యార్థి మృతికి కారణమైన నారాయణ కళాశాల గుర్తింపు రద్దు చేయాలి టీజీవీపీ రాష్ర్ట అధ్యక్షుడు కల్వకుర్తి ఆంజనేయులు ప్రభుత్వాన్ని కోరారు. విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో నారాయణ కళాశాల వద్ద నల్లకుంట పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా, విద్యార్థి ఆత్మహత్య విషయం తెలిసి ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చాడ వెంకట్‌రెడ్డి కళాశాల వద్దకు వచ్చారు.
ర్యాంకుల కోసం వేధించడం సరికాదు: కిషన్‌రెడ్డి
నల్లకుంట: ప్రణీత్ మృతిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని అంబర్‌పేట ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ర్యాంకుల కోసం కార్పొరేట్ కళాశాలలు ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు విరామంలేకుండా చదివిస్తుండటంతో విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ర్యాంకుల కోసం ఇలా విద్యార్థులను వేధించడం తగదన్నారు. ప్రణీత్ మృతిపై ఉన్నతస్థాయి విచారణ జరిపించాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.