సీబీఐ విచారణ జరిపించాలి
అనంతలో వైఎస్సార్సీపీ నేతల హత్యలపై పెద్దిరెడ్డి డిమాండ్
త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామన్న భూమా
ప్రసాదరెడ్డికి కన్నీటి వీడ్కోలు
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ప్రసాదరెడ్డి హత్యతో పాటు ఇటీవల అనంతపురంలో వైఎస్సార్సీపీ నేతల హత్యలపై ప్రభుత్వం సీబీఐ విచారణ జరిపించాలని పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. తమ పార్టీలోని చురుకైన నేతలు, కార్యకర్తలను ఏరిపారేయాలనే లక్ష్యంతోనే ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వ్యవహరిస్తున్నారన్నారు. గతంలో సీఎంగా చంద్రబాబు ఉన్నప్పుడు జరిగిన హత్యారాజకీయాలు పునరావృతం అవుతున్నాయని మండిపడ్డారు.
బుధవారం హత్యకు గురైన రాప్తాడు వైఎస్సార్సీపీ నేత భూమిరెడ్డి శివప్రసాదరెడ్డ్డి అంత్యక్రియలు ఆయన స్వగ్రామం ప్రసన్నాయపల్లిలో గురువారం ముగిశాయి. ప్రసాదరెడ్డి మృతదేహాన్ని కడసారి చూసేందుకు పార్టీ నేతలు, కార్యకర్తలు, గ్రామస్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. ప్రసాదరెడ్డి పార్థివదేహానికి పార్టీ నేతలు పుష్పాంజలి ఘటించారు.
ఆయనతో తమకున్న సాన్నిహిత్యాన్ని గుర్తుచేసుకుని కంటతడిపెట్టారు. పరామర్శించేందుకు వచ్చిన నేతలు, బంధువులను చూసి ప్రసాదరెడ్డి భార్య సావిత్రి, కుటుంబసభ్యులు బోరున విలపించారు. ఎమ్మెల్యేలు విశ్వేశ్వరరెడ్డి, అత్తార్‌చాంద్‌బాషాతో పాటు పార్టీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అనంత వెంకట్రామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడి ్డ తదితరులు ప్రసాదరెడ్డి నివాసం వద్ద ఆయన భౌతికకాయానికి నివాళులర్పించారు.
అంత్యక్రియలకు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు, వైఎస్సార్ జిల్లా ఎమ్మెల్యేలు హాజరయ్యారు. పుంగనూరు, పీలేరు, మదనపల్లి, పలమనేరు, పూతలపట్టు, రాయచోటి ఎమ్మెల్యేలు.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, దేశాయి తిప్పారెడ్డి, అమర్నాథ్రెడ్డి, సునీల్, గడికోట శ్రీకాంత్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్‌రెడ్డి తదితరులు ప్రసాదరెడ్డి సమాధి వద్ద నివాళులర్పించారు. తర్వాత అనంతపురంలోని ప్రసాదరెడ్డి నివాసానికి వెళ్లి కుటుంబసభ్యులను పరామర్శించారు. భయపడవద్దని.. పార్టీ అండగా ఉంటుందని.. మీకు ధైర్యం చెప్పేందుకే జగన్ తమను పంపారని చెప్పారు. చంద్రబాబు రాజకీయ జీవితం మొత్తం నెత్తుటిమరకలమయమని భూమన విమర్శించారు. ప్రసాదరెడ్డి హత్యపై సీబీఐతో నిష్పాక్షికంగా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సర్కారు హత్యాకాండపై త్వరలోనే గవర్నర్‌ను కలుస్తామన్నారు.