సోదరి వివాహేతర సంబంధమే కారణం
- ప్రొద్దుటూరులో ప్రసాద్‌రెడ్డి హత్య కేసు
ప్రొద్దుటూరు క్రైం: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘లైవ్ మర్డర్’ కేసులో విస్తుపోయే వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. వైఎస్సార్ జిల్లా ప్రొద్దుటూరులో మారుతిప్రసాద్‌రెడ్డి హత్యకు.. అతని సోదరి వివాహేతర సంబంధమే ప్రధాన కారణమని డీఎస్పీ భక్తవత్సలం చెప్పారు. ప్రొద్దుటూరులో కోర్టు వాయిదాకు వచ్చిన మారుతి ప్రసాద్‌రెడ్డిని ప్రత్యర్థులు పట్టపగలు నడిరోడ్డుపై వేట కొడవళ్లతో వెంటాడి నరికి చంపిన సంఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితులైన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డిలను పోలీసులు శుక్రవారం సాయంత్రం శ్రీదేవి ఫంక్షన్ హాల్లో మీడియా ముందు హాజరుపరిచారు. డీఎస్పీ భక్తవత్సలం యువకుడి హత్యకు దారితీసిన కారణాలను వివరించారు.
‘‘దేవగుడికి చెందిన బోరెడ్డి మారుతీ ప్రసాద్‌రెడ్డి(34) సోదరి అనూరాధ ప్రొద్దుటూరులో అంగన్వాడీ కార్యకర్తగా పనిచేస్తోంది. శాస్త్రినగర్‌లో ఉంటున్న ఆమెతో అదే ప్రాంతానికి చెందిన చంద్రశేఖర్‌రెడ్డితో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ విషయమై ఆమె, చంద్రశేఖర్‌రెడ్డి భార్య నిర్మల తరచూ గొడవ పడేవారు. ఈ విషయంలో అనూరాధ సోదరుడు మారుతి ప్రసాద్‌రెడ్డి తలదూర్చి నిర్మలను బెదిరించడంతో 2014లో కేసు నమోదైంది. ఏడాది క్రితం నిర్మల కుమారుడు వెంకటతనూజ్ కుమార్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. అయితే మారుతి ప్రసాద్‌రెడ్డే అతన్ని చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించాడన్న అనుమానం నిర్మల కుటుంబసభ్యుల్లో నెలకొంది. అప్పటినుంచి మారుతిప్రసాద్‌రెడ్డిని చంపాలని వారు పథకం పన్నారు.
చంద్రశేఖర్‌రెడ్డి ఇంట్లో ఉన్న సొమ్మంతా మారుతిప్రసాద్‌రెడ్డి ద్వారా అనూరాధకిస్తూ తమ సోదరి నిర్మల కుటుంబాన్ని నిర్లక్ష్యం చేస్తున్నాడని ఆయన బావలైన రఘునాథరెడ్డి, శ్రీనివాసులరెడ్డి అనుకున్నారు. ఇలాగే వదిలేస్తే ఉన్న ఆస్తిని మారుతిప్రసాద్‌రెడ్డి కాజేస్తాడనే ఉద్దేశంతో రెండు నెలలక్రితం అతన్ని చంపాలని పథకం పన్నారు. ఈ విషయం పోలీసులకు తెలిసి.. ఏప్రిల్ 18న రఘునాథరెడ్డి, పట్నం ధరణి, వెంకటరమణలను అరెస్ట్ చేసి రిమాండుకు పంపించారు. వీరు ఈనెల 19న బెయిల్‌పై విడుదల య్యారు. వీరు జైల్లో ఉండగా మారుతిప్రసాద్‌రెడ్డి తన ఇంటికొచ్చి తలుపు తట్టాడని, తనతోపాటు కుటుంబసభ్యులందర్నీ చంపడానికి అతను పథకం పన్నాడని నిర్మల తన సోదరులకు చెప్పడమేగాక మారుతిప్రసాద్‌రెడ్డిని చంపితే మనం ఈ గండం నుంచి గట్టెక్కవచ్చంది. ఈ నేపథ్యంలో 2014లో నమోదైన కేసుకు సంబంధించి కోర్టులో హాజరవడానికి మారుతిప్రసాద్‌రెడ్డి వస్తాడని పసిగట్టిన ప్రత్యర్థులు ముందస్తు పథకం ప్రకారం అతన్ని దారుణంగా నరికిచంపారు’’ అని డీఎస్పీ వివరించారు.
మరో నలుగురి ప్రమేయంపైనా విచారిస్తున్నాం..
హత్య చేశాక నిందితులు పోలీసులకు లొంగిపోయారని డీఎస్పీ తెలిపారు. వారి నుంచి రెండు వేటకొడవళ్లు, మోటర్‌బైకు, రక్తపు గుడ్డలు స్వాధీనం చేసుకున్నా మని వివరించారు. ఇందులో మరో నలుగురి పాత్ర ఉన్నట్లు విచారణలో తేలిందన్నారు. సీఐ ఓబులేసు, ఎస్ఐలు కృష్ణంరాజునాయక్, శివశంకర్, చంద్రశేఖర్‌లు పాల్గొన్నారు.
(నడిరోడ్డుపై దారుణహత్య)