సునీల్ ఆరోరా నియామకంపై విమర్శలు
న్యూఢిల్లీ: ఎయిర్టెల్ మాజీ చైర్మన్, కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ రిటైర్డ్ కార్యదర్శి సునీల్ అరోరాను ప్రసార భారతి సలహాదారుగా కేంద్రం నియమించడం పట్ల విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎక్కువ విమర్శలు వస్తున్నాయి. ఎందుకంటే నీరా రాడియా టేపుల కుంభకోణంలో ఆయన పేరు ఎక్కువగా వినిపించడమే కారణం. రతన్ టాటా, తరుణ్ దాస్‌లకు ఎయిర్‌లైన్స్ పరిశ్రమకు సంబంధించిన కావాల్సిన సమాచారాన్ని చేరవేసేందుకు నీరా రాడియాతో అరోరా మాట్లాడిన అంశాలు రాడియా టేపుల్లో రికార్డయి ఉన్నాయి.
1980వ బ్యాచ్, రాజస్థాన్ క్యాడర్‌కు చెందిన ఐఏఎస్ అధికారి సునీల్ అరోరాను కేంద్ర ప్రభుత్వ ప్రసారాల సంస్థ ‘ప్రసార భారతి’కి సలహాదారుగా నియమించబోతున్నట్లుగా ముందుగానే వార్తలు వెలువడ్డాయి. ఆ వార్తలను నిజయం చేస్తూ ఇప్పుడు ఖరారు ఉత్తర్వులు కూడా వెలువడ్డాయి. అరోరాను ఎందుకు నియమించాల్సి వచ్చిందో పీఎంవో వివరణ ఇవ్వాలంటూ కొందరు డిమాండ్ చేయగా, దాదా, తమరంటే తమకెంతో గౌరవమని, అలాంటిప్పుడు ఆరోరా మళ్లీ సలహాదారుగా ఎలా తీసుకొచ్చారని మరి కొందరు ప్రశ్నించారు. ఇంతవరకు వచ్చిన వ్యక్తి ప్రసార భారతిలో ఎంతవరకైనా ఎదగగలరంటూ ఇంకొందరు వ్యాఖ్యానించారు.