మన్యంలో చలిపులి
=మోదమ్మ పాదాలు వద్ద 7 డిగ్రీలు, లంబసింగిలో 9 నమోదు
=అంతటా శీతల గాలులు
=వృద్ధులు, చిన్నారులు విలవిల
పాడేరురూరల్/చింతపల్లి/అరకులోయ,న్యూస్‌లైన్: తుపాను ప్రభావంతో కొద్ది రోజులు తగ్గుముఖం పట్టిన చలి మంగళవారం నుంచి విజృంభిస్తోంది. ఎముకలు కొరికేలా ఉంది. ఏజెన్సీ వాసులు గజగజ వణుకుతున్నారు. ఉదయాన్నే పొలం పనులకు వెళ్లేవారు, పాఠశాలలకు వెళ్లే విద్యార్థులు అవస్థలకు గురవుతున్నారు. వాహనదారులు లైట్లు వేసుకుని ప్రయాణిస్తున్నారు. జిల్లా అంతటా శీతల గాలులు వీస్తున్నాయి. ఒక్కసారిగా వాతావరణం మారిపోయింది.
బుధవారం ఏజెన్సీ పాడేరు ఘాట్‌లోని మోదమాంబ పాదాలు వద్ద 7 డిగ్రీలు, లంబ సింగిలో 9 డిగ్రీలు, మినుములూరులో 10 డిగ్రీలు,చింతపల్లిలో 12 డిగ్రీలు ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. జనవరి నెలాఖరుకు ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రతలు మరింత తగ్గుముఖం పట్టే అవకాశం ఉందని చింతపల్లి ప్రాంతీ య వ్యవసాయ పరిశోధనస్థానం శాస్త్రవేత్త ప్రతీప్‌కుమార్ తెలిపారు. మన్యంలో సాయంత్రం మూడు గంట ల నుంచే చలిగాలులు వీస్తున్నాయి. చిన్నపాటి వర్షం మాదిరి మంచుపడుతోంది. దీనికి చలి తీవ్రత తోడవ్వడంతో ఉదయం 9 గంటల వరకు ఇళ్ల నుంచి బయటకు రాలేని దుస్థితి. గూడేల్లోనివారు రాత్రిళ్లు గజగజ వణికిపోతున్నారు.
నెగడులు, చలిమంటలను ఆశ్రయిస్తున్నారు. వృద్ధులు, చిన్నారుల పరిస్థితి దయనీయంగా ఉంది. ఈ ఏడాది నవంబర్ 10వ తేదీ నుంచే ఏజెన్సీలో చలితీవ్రత అధికమైంది. అప్పటి వరకు 17, 16 డిగ్రీలు నమోదైన ఉష్ణోగ్రతలు నాటి నుంచి తగ్గుముఖం పట్టాయి. కాగా తుపాను ప్రభావంతో ఇటీవల 16 డిగ్రీలకు ఉష్ణోగ్రతలు పెరిగాయి. బుధవారం నుంచి మళ్లీ తగ్గుముఖం పట్టా యి. ఉదయం, సాయంత్రం వేళల్లో ద్విచక్ర వాహనదారులు ప్రయాణానికి భయపడుతున్నారు.