Preeti Desai
-
రాజకీయాల్లోకి రానేరాను
న్యూఢిల్లీ: ఇది ఎన్నికల కాలం కాబట్టి చాలా మంది బాలీవుడ్ తారలు పోటీలోకి దిగి అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. అభయ్ డియోల్‌కు మాత్రం ఇలాంటి ఆలోచనలు ఏవీ లేవు. పోలింగ్ రోజు బయటికి వచ్చి ఓటేసి రావడమే తనకు తెలుసని అన్నాడు. ‘రాజకీయాల్లోకి వచ్చే ఆలోచన నాకైతే లేదు. తాము మార్పు తేగలమని ఇతర నటులు నమ్మితే ముందుకు సాగవచ్చు. అందులో తప్పేం లేదు. వ్యవస్థను బాగు చేయడానికి ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిందే’ అంటూ అభయ్ మనసులోని మాటను బయటపెట్టాడు. ఈ 38 ఏళ్ల నటుడు సినిమాల్లో చాలా వరకు సామాజిక, రాజకీయ నేపథ్యమున్నవే కావడం విశేషం. షాంఘై సినిమా భూనిర్వాసితుల గురించి చర్చిస్తుంది. చక్రవూ్యహ నక్సలైట్ల సమస్య చుట్టూతిరుగుతుంది. రాంఝనాలో అభయ్ సామ్యవాద భావాలున్న నాయకుడిగా కనిపిస్తాడు. రాజకీయాల్లోకి రాకుండానే తన సినిమాలతో సమాజంలో మార్పులు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని అన్నాడు. ‘నేను నాయకుణ్ని కాదు.. సామాజిక కార్యకర్తనూ కాను. సినిమాల ద్వారా చిన్న ప్రయత్నం చేస్తున్నాను. నా సినిమాలన్ని సమాజాన్ని ప్రతిబింబిస్తాయి’ అని వివరించాడు. అన్నట్టు మనోడు తాజాగా నిర్మాత అవతారం ఎత్తి వన్ బై టూ అనే సినిమా తీశాడు. తన నిజజీవిత ప్రేయసి ప్రీతీదేశాయ్ ఇందులో అభయ్కు జోడీ. దురదృష్టవశాత్తూ వన్ బై టూ పెద్దగా ఆడలేదు. దీని వైఫల్యం కొంచెం బాధగా అనిపించినప్పటికీ, ఇక ముందు కూడా సినిమాలు తీస్తానని చెప్పాడు. నటులు, దర్శకులు, నిర్మాతలకు జయాపజయాలు సహజమని, ఎల్లప్పుడూ వంద శాతం విజయం సాధ్యం కాదని అన్నాడు. ‘నువ్వు ఎన్నిసార్లు కిందపడ్డావనేది ముఖ్యం కాదు.. నువ్వు ఎన్నిసార్లు తిరిగి లేచావనేది ముఖ్యం’ అనే నానుడిని తాను విశ్వసిస్తానని అభయ్ డియోల్ వివరించాడు. -
అదంతా నటనలో భాగమే..!
నటనను కెరీర్‌గా ఎంచుకున్న తర్వాత అన్ని రకాల సన్నివేశాల్లో నటించాల్సి ఉంటుందని, వేటినీ నిజజీవితంలో భాగమనుకోవడానికి వీల్లేదని చెబుతోంది ప్రీతి దేశాయ్. మోడలింగ్ రంగం నుంచి బాలీవుడ్‌లోకి అడుగుపెట్టిన ఈ సుందరి నటుడు అభయ్ డియోల్‌తో ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. అయితే అభయ్ ఇతర హీరోయిన్లతో శృంగార సన్నివేశాల్లో పాల్గొన్న దృశ్యాలను చూస్తే మీకేదైనా అభద్రతాభావం కలుగుతుందా? అని అడిగినప్పుడు ప్రీతి పైవిధంగా సమాధానమిచ్చింది. ఓ వార్తా సంస్థతో ఆమె మంగళవారం మాట్లాడుతూ... ‘అభయ్ విషయంలో నాకెలాంటి అభద్రతాభావం లేదు. ఎందుకంటే శృంగార సన్నివేశాలనేవి సినిమాల్లో ఓ భాగమే. మిగతా సన్నివేశాల్లో నటించినట్లుగానే శృంగార సన్నివేశాల్లో కూడా నటించాల్సి ఉంటుంది. అంతమాత్రాన అభయ్‌ను తప్పుబట్టాల్సిన అవసరం లేదు. అంతెందుకు నా తొలి చిత్రం ‘షోర్ ఇన్ ద సిటీ’ చిత్రంలో కూడా పలు శృంగార సన్నివేశాల్లో నేను నటించాల్సి వచ్చింది. ఇదంతా వృత్తిలో భాగమే. నిజజీవితానికి వాటిని అన్వయించుకోవాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం అంతకంటే లేదు. ఇక అభయ్ గురించి చెప్పుకోవాలంటే చాలా చెప్పుకోవాలి. సినీ పరిశ్రమ అంటే ఏంటో అర్థమయ్యేలా చెప్పింది అభయ్. మేమిద్దరం భిన్నమైన వ్యక్తిత్వాలు కలిగినవారమైనప్పటికీ ఎప్పుడూ భేదాభిప్రాయాలు రాలేదు. ఎవరి అభిరుచులు వారివి. పరస్పరం వాటిని గౌరవించుకుంటాం కూడా. ఏదైనా సందేహముంటే వెంటనే అభయ్‌ను సంప్రదిస్తా. అతని అభిప్రాయమేందో తెలుసుకుంటా. ఇద్దరం సదరు విషయం గురించి మాట్లాడుకుంటాం. అయితే అభయ్ గురించి పరిశ్రమలో చాలా తప్పుడు అభిప్రాయాలు ఉన్నాయి. అతను చాలా అహంకారి అని అంటుంటారు. నిజానికి అలాంటి అహంభావాన్ని నేను గమనించలేదు. కాకపోతే కొత్తవారితో తొందరగా కలిసిపోయే రకం కాదు. ఇక మా పెళ్లి ఇప్పట్లో జరిగే అవకాశం లేదు. కెరీర్‌ను ఇప్పడే ప్రారంభించానని అనుకుంటున్నా. ఇందులో స్థిరపడాలి. ఆ తర్వాతే పెళ్లి గురించి ఆలోచిస్తా’నని చెప్పింది.