Premature death
-
వీటితో అకాల మరణానికి చెక్..
లండన్ : గింజ ధాన్యాలు, సీడ్స్ తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యం కాపాడుకోవచ్చని..అకాల మరణం ముప్పును ఇవి దాదాపు సగం తగ్గిస్తాయని తాజా అథ్యయనం వెల్లడించింది. ఫిన్‌ల్యాండ్‌లో పరిశోధకులు 2500 మంది పురుషుల ఆరోగ్యాన్ని 22 ఏళ్ల పాటు పర్యవేక్షించడం ద్వారా ఈ వివరాలు రాబట్టారు. వీరిలో బాదం వంటి గింజ ధాన్యాలు, వెజిటబుల్ ఆయిల్, ఒమెగా 6 పుష్కలంగా ఉన్న ఆహారం తీసుకున్న వారు నివారించదగ్గ వ్యాధుల కారణంగా అకాల మృత్యువాతన పడటం 43 శాతం తక్కువగా ఉన్నట్టు గుర్తించారు. గింజధాన్యాల్లో ఉండే లినోలిక్ యాసిడ్ క్యాన్సర్ కారక వాపులకు దారితీస్తుందనే ఆందోళనలకూ తమ పరిశోధనలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని పరిశోధకులు వెల్లడించారు. రక్తంలో ఎంత ఎక్కువగా లినోలిక్ యాసిడ్ స్ధాయి ఉంటే అకాల మృత్యువు రిస్క్ అంత తక్కువగా ఉన్నట్టు తాము గుర్తించామని చెప్పారు. రక్తంలో కొలెస్ర్టాల్ స్ధాయిలను మెరుగ్గా నిర్వహించడంలో ఒమెగా 6 ఆమ్లాలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మరోవైపు ఒమెగా 6 స్ధాయిలకు, క్యాన్సర్ కారక మృతులకు మధ్య నిర్థిష్టంగా ఎలాంటి సంబంధం లేదని ఈ అథ్యయనంలో వెల్లడైంది. -
ఈ అభి'శోకం' తీరనిది..!
మునుగోడు: ఉన్నత చదువులు చదివి తమకు చేదోడుగా ఉంటాడనుకున్న కొడుకు అకాలమరణంతో ఆ కుటుంబం శోకసముద్రంలో ముని గిపోయింది. దేశంకాని దేశంలో విగత జీవుడైన కుమారుడిని కడసారి చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్కి చెందిన పులిమామిడి నర్సింహారెడ్డి, పద్మల కుమారుడు అభిషేక్‌రెడ్డి(26) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం మరణిం చిన విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి అభిషేక్‌రెడ్డి చదువులో చురుగ్గా ఉండేవాడు. నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల సెయింట్ ఆల్ఫోన్సన్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదివించాడు. ఆ తరువాత 9,10 తరగతులను హైదరాబాద్‌లోని బ్రిలి యంట్ పాఠశాలలో చదివించాడు. ఇంటర్ నల్లగొండ అరవిందో జూనియర్ కళాశాలలో చదివాడు. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ వద్ద ఉన్న అవంతి కళాశాలలో 2012లో బీటెక్ పూర్తి చేశాడు. ఉన్న ఏడు ఎకరాల భూమిని విక్రయించి.. తన కుమారుడి విదేశాలకు పంపేందుకు డబ్బులు లేకపోవడంతో నర్సింహారెడ్డి కొరటికల్‌లో ఉన్న ఏడు ఎకరాల భూమిని అమ్మి 2013 ఆగస్టు మాసంలో ఎంఎస్ చదివించేందుకు ఆమెరికాలోని కాలిఫోర్నియాకు పంపాడు. ఈ నెల 29న ఆ కళాశాల నుంచి ఎంఎస్ సర్టిఫికెట్ తీసుకొని తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది. ఈ లోపు అక్కడి టూరిజం ప్రాంతాలను చూసేందుకు తన స్నేహితులతో కలసి ఈ నెల 2న కారులో బయలుదేరాడు. ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ విధి వక్రించింది. అతను ఉన్నత విద్య సర్టిఫికెట్ తీసుకొని స్వదేశానికి రాక ముందే అక్కడే పరలోకానికి వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 19న మృతదేహం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మా కుమారుడి మృతదేహాన్ని మాకు అప్పగిస్తే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరుపుకుంటామని జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని వేడుకున్నాం. మా విన్నపాన్ని సావధానంగా విన్న ఆయన సీఎం పేషీలోని పెలైట్ అధికారులను మృతదేహం అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు. వారు ఈ నెల 19 వరకు మా కుమారుడి మృతదేహాన్ని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కొండంత ఆశతో నా కుమారుడు ఉన్నత చదువులు చదివి అందరికంటే గొప్పగా జీవిస్తాడని, మాకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని ఆశపడ్డాను. అందుకోసం నాకు ఉన్న 7 ఎకరాల భూమిని సైతం అమ్ముకున్నాను. కానీ మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్తాడని అనుకోలేదు. నేను కన్న కలలు అన్నీ కల్లలయ్యాయి. - పులిమామిడి నర్సింహారెడ్డి, అభిషేక్ తండ్రి -
మరణంలోనూ తోడుగా..
మనసున మనసై ప్రేమించుకున్నారు.. బతుకున బతుకై జీవించారు.. కడదాకా తోడుండాలన్న పెళ్లినాటి ప్రమాణాలను నిజం చేస్తూ కొద్ది సమయం తేడాతో ప్రాణాలు విడిచారు.. ఇది ఇద్దరు అనురాగమూర్తుల ప్రేమ బంధం.. వారిది ఆదర్శప్రాయమైన అపురూప దాంపత్యం. అందుకే భర్త లేడన్న కఠోర వాస్తవాన్ని జీర్ణించుకోలేకపోయిందామె. నీ వెంటే నేనంటూ అనంత లోకాలకు పయనమైంది. ప్రముఖ వైద్యుడు పైడిరాజు, ఉపాధ్యాయిని మేరీరాణిల మరణం జిల్లావాసుల మనసులను కదిలించింది. - ప్రేమతో ఒక్కటై... తుది పయనంలోనూ తోడు నీడగా... - అనకాపల్లిలో దంపతుల అకాల మరణం - గుండెపోటుతో డాక్టర్ పైడిరాజు... - షాక్‌తో భార్య రాణి అమరలోకాలకు... అనకాపల్లి: ఆంధ్ర వైద్య కళాశాలలో ఫోరెన్సిక్ విభాగాధిపతి డాక్టర్ పైడిరాజు (54), మునగపాక జెడ్పీ ఉన్నత పాఠశాలలో టీచర్‌గా పనిచేస్తున్న మేరీ రాణి (53) ముప్ఫై ఐదేళ్ల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. తమ సేవలతో సంఘం లో మంచిపేరు తెచ్చుకున్నారు. పరిపూ ర్ణ జీవితం అనుభవించి, ఒకేసారి తను వు చాలించారు. మంగళవారం అర్ధరాత్రి భర్త అకాల మరణాన్ని తట్టుకోలేక మేరీ రాణి అస్వస్థతకు లోనయ్యారు. కుటుంబ సభ్యులు హడావుడిలో ఉండగానే నిశ్శబ్దంగా తుది శ్వాస విడిచారు. ఈ రెండు విషాదాలను తట్టుకోలేక వారి పిల్లలు, బంధువులు, స్నేహితులు, సహాధ్యాయులు, శిష్యులు కన్నీరు మున్నీరయ్యారు. కడసారి వీడ్కోలు పలికేందుకు వేలాదిగా తరలివచ్చారు.అనకాపల్లి నర్సింగరావుపేటలో కాపురం ఉంటున్న డాక్టర్ పైడిరాజు బుధవారం రాత్రి 11.45 నిమిషాలకు గుండెపోటుతో కన్నుమూశా రు. మధుమేహ రోగి అయిన మేరీ రా ణి తీవ్ర ఆయాసానికి గురవ్వడంతో.. కుదుటపడేందుకు ఇంజక్షన్ చేసి పడుకోబెట్టారు. భర్త మరణంతో ఆమె ఒత్తిడికి గురవుతుందని భావించి.. అటువైపు తిప్పి గోడపక్కన ఆమెను పడుకోబెట్టారు. పైడిరాజు మృతదేహాన్ని రాత్రి రెండున్నర గంటల సమయంలో బయటకు తీసుకువస్తున్నప్పుడు ఆమెను లే పేందుకు ప్రయత్నించిన కుటుంబ సభ్యు లు షాక్ తిన్నారు. ఆమె తుది శ్వాస విడిచారని తెలుసుకొని గొల్లుమన్నారు. మాటలకందని అనురాగం వీరికి కుమారుడు ప్రదీప్, కుమార్తె పద్మిని సంతానం. ప్రదీప్ ఎంబీబీఎస్ చేసి, తండ్రి నిర్వహిస్తున్న నర్సింగ్‌హోమ్‌లోనే వైద్య సేవలందిస్తున్నారు. పైడిరాజు, రాణిల సొంత ఊరు అనకాపల్లి పట్టణమే. విశాఖలోని ఆంధ్ర మెడికల్ కళాశాలలో పనిచేస్తున్న పైడిరాజు ఇటీవల అసిస్టెంట్ ప్రొఫెసర్ నుంచి అసోసియేట్‌గా పదోన్నతి పొందారు. ఫోరెన్సిక్ మెడికల్ విభాగాధిపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించారు. అనారోగ్యంతో పైడిరాజు వారం రోజులుగా సెలవులో ఉండగా మంగళవారం రాత్రి ఈ ఘోరం జరిగింది. 1977లో వైద్యునిగా విధుల్లో చేరిన పైడిరాజు శ్రీకాకుళం జిల్లా సీతమ్మపేటలో డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పటల్ సర్వీసెస్ గా, పాడేరు ఆస్పత్రిలో, అనకాపల్లి ప్రభుత్వ ఆస్పత్రిలో సేవలందించారు. పలు జర్నల్స్‌లో రచనలు చేశారు. మరణించిన నవజాత శిశువుల ఎముకల ద్వారా వారి వయస్సును నిర్ధారించడం, ఆత్మహత్యలుగా చిత్రీకరించిన కేసులను హత్యలుగా గుర్తించడం ఆయన ప్రత్యేకత. ఆ కేస్‌స్టడీలను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ రీసెర్చింగ్ హెల్త్ సొసైటీ ప్రచురించింది. సౌత్ ఇండియన్ మెడికో లీగల్ అసోసియేషన్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్‌లో సభ్యత్వం కలిగిన వ్యక్తిగా పైడిరాజుకు గుర్తింపు ఉంది. రాణి మునగపాక మండల పరిషత్ స్కూల్లో స్కూల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నారు. పేద విద్యార్థులకు ఉచితంగా పుస్తకాలు అందించి, హాస్టల్ ఫీజు, ఇతర ఫీజులను చెల్లించి సేవలందించే రాణి అంటే ఆమె పనిచేసిన పాఠశాలలోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఎంతో అభిమానం. పైడిరాజు, రాణి లు మరణించారని తెలుసుకున్న వారి సన్నిహితులు, స్నేహితులు, బంధువులు వేలాదిమంది నర్సింగరావుపేటలోని స్వగృహానికి తరలివచ్చారు. పైడిరాజు దంపతులకు బుధవారం మ ద్యాహ్నం అంతిమయాత్ర నిర్వహించా రు. వీరి పార్థివ దేహాలను సందర్శించి న వారిలో ఎమ్మెల్యే పీలా గోవింద సత్యనారాయణ, దాడి వీరభద్రరావు, పెదబాబు, దంతులూరి దిలీప్‌కుమార్, కొణతాల జగన్, కొణతాల మురళీకృష్ణ ఉన్నారు. డాక్టర్లు, టీచర్లు, పట్టణ ప్రముఖులు, చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చిన పరిచయస్తులు అంతిమయాత్రలో పాల్గొన్నారు. -
మంచి మిత్రుడిని కోల్పోయాం..
ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించిన మోహన్‌బాబు తిరుపతి (మంగళం): ‘‘తిరుపతి నెహ్రూ మున్సిపల్ హైస్కూల్లో ఇద్దరం చదువుకున్నాం.. స్టేజీలపై నాటకాలు వేశాం.. సినిమాల్లో నటించాం. ఎక్కడ ఎప్పుడు కలసినా చిన్ననాటి విషయాలను గుర్తు చేసుకుని నవ్వుకునేవాళ్లం. అలాంటి మంచి మిత్రుడిని కోల్పోయాం’’అని ప్రముఖ సినీనటుడు మంచు మోహన్‌బాబు ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం తిరుపతి ఎమ్మెల్యే ఎం.వెంకటరమణ నివాసానికి చేరుకుని ఆయన చిత్రపటానికి పూలతో నివాళులర్పించారు. అనంతరం వెంకటరమణ సతీమణి సుగుణ, అల్లుడు సంజయ్, కుమార్తెలను మోహన్‌బాబు పరామర్శించారు. శత్రువునైనా ఆప్యాయంగా పలకరించే గొప్ప వ్యక్తిత్వం ఉన్న మంచి మనిషిని కోల్పోవడం బాధాకరమని, పోయిన వ్యక్తిని తీసుకురాలేమని, అతని ఆశయాల కోసం మీరు మనోధైర్యాన్ని కోల్పోకూడదని వారికి ధైర్యం చెప్పారు. అనంతరం మోహన్‌బాబు విలేకరులతో మాట్లాడుతూ తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ అకాల మరణం చెందిన సమయంలో తాను అందుబాటులో లేని కారణంగా అంత్యక్రియలకు రాలేకపోయానని తెలిపారు. అయితే ఆయన మృతి తిరుపతి ప్రజలకు తీరనిలోటని ఆవేదన వ్యక్తం చేశారు. తమిళ డెరైక్టర్ బాలచందర్ మృతి సినీ రంగానికి తీరనిలోటన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని దేవున్ని కోరుకున్నానన్నారు. -
ముండేకు ఆదిలాబాద్ వాసుల నివాళి
గుడిహత్నూర్ (ఆదిలాబాద్), న్యూస్‌లైన్ : మహా రాష్ట్ర మాజీ ఉప ముఖ్యమంత్రి, కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గోపీనాథ్ ముండే అకాల మరణం మండల వాసులను దిగ్భాంత్రికి గురిచేసింది. ఆయనకు వేర్వేరు చోట్ల శ్రద్ధాంజలి ఘటించారు. మండలంలో ఆయన బంధువులు చాలా మంది ఉండడంతో వారంతా ఆయన మరణాన్ని తట్టుకోలేకపోయారు. గతంలో ఇదే సాన్నిహిత్యంతో ఉప ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుడిహత్నూర్‌ను ఆయన సందర్శించారు. దీంతో ఇక్కడి నాయకులకు సుపరిచితుడిగా ఉండిపోయారు. మంగళవారం ఆయన అకాల మృతి చెందడంతో మండలవాసులు తీవ్ర దిగ్భాంత్రికి లోనయ్యారు. స్థానిక బంధువులు, నాయకులు జాతీయ రహదారి 44లోని చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. మహారాష్ట్ర ప్రజల ప్రియనేత తమ సన్నిహితుడు గోపీనాథ్ ముండే లేని లోటును ఎవరూ తీర్చలేరని జెడ్పీటీసీ కేశవ్ గిత్తే, గణేశ్ ముండే అన్నారు. లియాఖత్ అలీఖాన్, రాజారాం, బీజేపీ జిల్లా నాయకుడు డా.లక్ష్మణ్ కేంద్రే, టీఆర్ఎస్ నాయకులు వామన్ గిత్తే, వైజునాథ్ కేంద్రే, గిత్తే మదన్ సేట్, ఎంపీటీసీ సత్యరాజ్, సర్పంచ్ ప్రతాప్, ఇద్రిస్‌ఖాన్, కాంగ్రెస్ నాయకులు బేర దేవన్న. రవూఫ్‌ఖాన్‌లతో పాటు డా.నారాయణ్ ఫడ్ తదితరులు పాల్గొన్నారు. మహానేతను కోల్పోయాం గోపీనాథ్ ముండే మృతికి నివాళిగా గుడిహత్నూర్‌లో రాత్రి 8 గంటల ప్రాంతంలో స్థానిక శివాలయం నుంచి, బస్టాండ్ వరకు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. సంజీవ్ ముండే, రావణ్ ముండే, మాధవ్ కేంద్రే, నీలకంఠ్ అప్పా, గణేష్ ముండే, త్రియంబక్ ముండే, రవింద్రనాథ్ ముండే, రాహుల్ ముండే, దీపక్ ముండే, వెంకటీ ముండే, జ్ఞానేశ్వర్, దిలీప్ ముండే పాల్గొన్నారు. గోపీనాథ్ స్వగ్రామానికి పయనం కేంద్ర మంత్రి గోపీనాథ్ ముండే అంత్యక్రియల్లో పాల్గొనడానికి మండలంలోని ఆయన బంధువులు ఆయన స్వగ్రామమైన మహారాష్ట్రలోని భీడ్ జిల్లా పరళీ తాలుకాలోని నాత్రా గ్రామానికి బయల్దేరారు. కడసారి చూపుకైనా నోచుకోవాలని మండల వంజరి కులస్తులు, నాయకులు మంగళవారం రాత్రి నాత్రాకు వెళ్లారు.