ఈ అభి'శోకం' తీరనిది..!
మునుగోడు: ఉన్నత చదువులు చదివి తమకు చేదోడుగా ఉంటాడనుకున్న కొడుకు అకాలమరణంతో ఆ కుటుంబం శోకసముద్రంలో ముని గిపోయింది. దేశంకాని దేశంలో విగత జీవుడైన కుమారుడిని కడసారి చూసుకునేందుకు ఆ తల్లిదండ్రులు తల్లడిల్లిపోతున్నారు. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం కొరటికల్‌కి చెందిన పులిమామిడి నర్సింహారెడ్డి, పద్మల కుమారుడు అభిషేక్‌రెడ్డి(26) అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో శనివారం మరణిం చిన విషయం తెలిసిందే. చిన్నప్పటి నుంచి అభిషేక్‌రెడ్డి చదువులో చురుగ్గా ఉండేవాడు.
నల్లగొండలోని దేవరకొండ రోడ్డులో గల సెయింట్ ఆల్ఫోన్సన్ పాఠశాలలో ఎనిమిదవ తరగతి వరకు చదివించాడు. ఆ తరువాత 9,10 తరగతులను హైదరాబాద్‌లోని బ్రిలి యంట్ పాఠశాలలో చదివించాడు. ఇంటర్ నల్లగొండ అరవిందో జూనియర్ కళాశాలలో చదివాడు. రంగారెడ్డి జిల్లా అబ్దులాపూర్‌మెట్ వద్ద ఉన్న అవంతి కళాశాలలో 2012లో బీటెక్ పూర్తి చేశాడు.
ఉన్న ఏడు ఎకరాల భూమిని విక్రయించి..
తన కుమారుడి విదేశాలకు పంపేందుకు డబ్బులు లేకపోవడంతో నర్సింహారెడ్డి కొరటికల్‌లో ఉన్న ఏడు ఎకరాల భూమిని అమ్మి 2013 ఆగస్టు మాసంలో ఎంఎస్ చదివించేందుకు ఆమెరికాలోని కాలిఫోర్నియాకు పంపాడు. ఈ నెల 29న ఆ కళాశాల నుంచి ఎంఎస్ సర్టిఫికెట్ తీసుకొని తిరిగి హైదరాబాద్‌కు రావాల్సి ఉంది.
ఈ లోపు అక్కడి టూరిజం ప్రాంతాలను చూసేందుకు తన స్నేహితులతో కలసి ఈ నెల 2న కారులో బయలుదేరాడు. ఆ విషయాన్ని తన తల్లిదండ్రులకు చెప్పాడు. కానీ విధి వక్రించింది. అతను ఉన్నత విద్య సర్టిఫికెట్ తీసుకొని స్వదేశానికి రాక ముందే అక్కడే పరలోకానికి వెళ్లాడు. దీంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.
19న మృతదేహం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు
ఉన్నత చదువులకు అమెరికా వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన మా కుమారుడి మృతదేహాన్ని మాకు అప్పగిస్తే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు జరుపుకుంటామని జిల్లా మంత్రి జి.జగదీశ్‌రెడ్డిని వేడుకున్నాం. మా విన్నపాన్ని సావధానంగా విన్న ఆయన సీఎం పేషీలోని పెలైట్ అధికారులను మృతదేహం అప్పగించేందుకు చర్యలు తీసుకోవాలని సూచించారు.
వారు ఈ నెల 19 వరకు మా కుమారుడి మృతదేహాన్ని అప్పగిస్తామని హామీ ఇచ్చారు. కొండంత ఆశతో నా కుమారుడు ఉన్నత చదువులు చదివి అందరికంటే గొప్పగా జీవిస్తాడని, మాకు వృద్ధాప్యంలో అండగా ఉంటాడని ఆశపడ్డాను. అందుకోసం నాకు ఉన్న 7 ఎకరాల భూమిని సైతం అమ్ముకున్నాను. కానీ మమ్మల్ని శాశ్వతంగా వదిలి వెళ్తాడని అనుకోలేదు. నేను కన్న కలలు అన్నీ కల్లలయ్యాయి. - పులిమామిడి నర్సింహారెడ్డి, అభిషేక్ తండ్రి