విజయకాంత్‌కు జరిమానా
సాక్షి, చెన్నై: డీఎండీకే వర్గాల్ని పరువు నష్టం దావాలు వెంటాడుతున్నాయి. మంగళవారం ఆ పార్టీ అధినేత, ఆయన భార్య విజయకాంత్, ప్రేమలత మద్రాసు హైకోర్టు ప్రధాన బెంచ్ ఆగ్రహానికి గురి కావాల్సి వచ్చింది. రూ.24 వేలు జరిమానా విధించడంతో పాటుగా తమ పిటిషన్లను సుప్రీం కోర్టుకు మార్చేం దుకు 15 రోజుల గడువును కోర్టు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్ని అన్నాడీఎంకేతో కలిసి ఎదుర్కొని ప్రధాన ప్రతిపక్షం హోదాను డీఎండీకే దక్కించుకున్న విషయం తెలిసిందే. అయితే, అధికార పక్షంతో కన్నా, ప్రజల పక్షాన నిలబడుతామంటూ ప్రధాన ప్రతిపక్షంలో ఉన్న విజయకాంత్, ఆయన సేనలు అసెంబ్లీ వేదికగా జబ్బలు చరిచి కేసుల్లో ఇరుక్కోవాల్సి వచ్చింది.
అధికార పక్షానికి వ్యతిరేకంగాతీవ్ర విమర్శలు ఆరోపణలు గుప్పించే పనిలో విజయకాంత్, ఆయన సతీమణి ప్రేమలత, ఆ పార్టీ ఎమ్మెల్యేలు నిమగ్నమయ్యారు. దీంతో డీఎండీకే వర్గాలపై అధికార పక్షం కన్నెర్ర చేసింది. విజయకాంత్‌పై రాష్ర్టంలోని అన్ని జిల్లా కోర్టుల్లోనూ పరువు నష్టం దావాలు దాఖలయ్యాయి. అలాగే, ఆయన సతీమణి ప్రేమలత, మరో ముగ్గురు ఎమ్మెల్యేలపై అనేక కోర్టుల్లో దావాలు కొనసాగుతున్నాయి. ఈ కేసుల విచారణలు డీఎండీకే వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి. కోర్టులు వారెంట్లు దాఖలు చేసిన సందర్భాలు అనేకం. చివరకు ఈ కేసులో విసిగి వేసారిన విజయకాంత్ అండ్ బృందం మద్రాసు హైకోర్టును ఆశ్రయించింది.
కోర్టుకు : తమ మీదున్న కేసుల విచారణలు నిలుపుదల చేయాలని, మాజీ సీఎం, మంత్రుల తరపున ప్రభుత్వ న్యాయవాదులు దాఖలు చేసిన ఈ దావాలను పరిగణనలోకి తీసుకోకూడదని తమ పిటిషన్లో సూచించారు. రాజకీయ నాయకులు చేసే విమర్శలు, ఆరోపణల వ్యవహారంలో ప్రభుత్వ న్యాయవాదులు ఇలాంటి దావాలు దాఖలు చేసే విషయంలో కొన్ని మార్గదర్శకాల్ని అనుసరించే విధంగా చర్యలు తీసుకోవాలి, తదితర పలు రకాల సూచనలతో పన్నెండు పిటిషన్లను దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణ ప్రధాన న్యాయమూర్తి సంజయ్ కిషన్ కౌల్, న్యాయమూర్తి సుందరేషన్ నేతృత్వంలోని బెంచ్ ముందు విచారణ జరుగుతున్నది. ఈ పరిస్థితుల్లో గత నెల బీజేపీ నేత సుబ్రమణ్యస్వామిపై రాష్ట్ర ప్రభుత్వం పరువు నష్టం దావా దాఖలు చేయడం, ఆయన సుప్రీం కోర్టును ఆశ్రయించి స్టే తెచ్చుకోవడాన్ని డీఎండీకే వర్గాలు పరిగణనలోకి తీసుకున్నాయి.
గత నెల తాము దాఖలు చేసుకున్న పిటిషన్ విచారణకు వచ్చిన సందర్భంగా ఈ పిటిషన్లను సుప్రీం కోర్టుకు మార్చబోతున్నామని సూచించారు. సుబ్రమణ్య స్వామి పిటిషన్‌ను గుర్తు చేస్తూ విజయకాంత్ తరపున న్యాయ వాదులు వాదన విన్పించారు. దీంతో సుప్రీం కోర్టును ఆశ్రయించుకునేందుకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ఆగ్రహం- జరిమానా: సుప్రీం కోర్టును ఆశ్రయించుకోమని అనుమతి ఇచ్చి నెల రోజులకు పైగా యినా, విజయకాంత్ తరపు న్యాయవాదులు అందుకు తగ్గ చర్యలు చేపట్టడంలో విఫలమయ్యారు. ఆ పిటిషన్ల స్థితిగతులపై మంగళవారం సంజయ్ కిషన్ కౌల్, సుందరేషన్ నేతృత్వంలోని ప్రధాన బెంచ్ పరిశీలన జరిపింది.
అయితే, సుప్రీం కోర్టును ఆశ్రయించడంలో కాలయాపనపై విజయకాంత్ తరపున న్యాయవాదులు తమ వాదనను బెంచ్ ముందు ఉంచారు. తమ కక్షిదారులు చేసిన ఆరోపణలు, విమర్శలు కొన్ని తమిళంలో ఉన్న దృష్ట్యా, వాటిని ఆంగ్లంలో అనువాదం చేయడంలో జాప్యం నెలకొందని, తమకు కొంత సమయం కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. దీంతో బెంచ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. ఇప్పటికే నెల రోజులకు పైగా సమయం ఇచ్చామని మండి పడింది. కోర్టు సమయాన్ని వృథా చేసే విధంగా వ్యవహరిస్తే తీవ్రంగా స్పందించాల్సి ఉంటుందని హెచ్చరించింది. సుప్రీం కోర్టును ఆశ్రయించడంలో జాప్యం చేయడంతోపాటుగా కోర్టు సమయాన్ని వృథా చేసినందుకు గాను, విజయకాంత్, ప్రేమలతతో పాటుగా దాఖలైన 12 పిటిషన్లకు జరిమానా విధిస్తున్నామని ప్రకటించారు. ఒక్కో పిటిషన్‌కు రూ.రెండు వేలు చొప్పున పన్నెండు పిటిషన్లకు రూ. 24 వేలు జరిమానాను చెల్లించాలని ఆదేశించారు. పదిహేను రోజుల్లో సుప్రీం కోర్టును ఆశ్రయించని పక్షంలో ఈ పన్నెండు పిటిషన్లను విచారణ యోగ్యం కాదని స్పష్టంచేస్తూ తిరస్కరించాల్సి ఉంటుందని న్యాయమూర్తులు హెచ్చరించారు.