premonmadi
-
వరంగల్‌లో ప్రేమోన్మాది ఘాతుకం.. చున్నీతో చేతులు కట్టేసి..
సాక్షి, వరంగల్: అతనికీ, ఆమెకు ఓ పెళ్లిలో పరిచయమైంది. తరచూ ఫోన్లో మాట్లాడుతుండేవాడు. తర్వాత ప్రేమిస్తున్నానని చెప్పాడు. ఆమె నిరాకరించింది. దీంతో ఆగ్రహంతో రగలిపోతున్న ఆ యువకుడు ఆ విద్యార్థిని ఇంట్లోనే ఆమె గొంతుకోసి పరారయ్యాడు. తీవ్రంగా రక్తస్రావం అవుతున్న ఆమెను వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించగా ప్రస్తుతం చికిత్స పొందుతోంది. హనుమకొండ జిల్లాలోని సుబేదారి పోలీస్‌స్టేషన్ పరిధిలో శుక్రవారం ఉదయం జరిగిన ఘటన వివరాలిలా ఉన్నాయి. దూరంగా పెట్టిందని దారుణం వరంగల్ జిల్లా నర్సంపేట మండలంలోని లక్నెపల్లి గ్రామానికి చెందిన పోలంపల్లి రాములు, రేణుకల కుమార్తె (23) కాకతీయ యూనివర్సిటీలో ఎంసీఏ ఫైనలియర్ చదువుతోంది. రాములు కుటుంబం హనుమకొండ గాంధీనగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటోంది. రాము లు వెల్డింగ్ షాపులో దినసరి కూలీగా పనిచేస్తుండగా, రేణుక ఇళ్లల్లో పనిచేస్తోంది. వారి కుమార్తె పోటీ పరీక్షల కోసం గత కొంతకాలంగా హైదరాబాద్‌లో కోచింగ్ తీసుకుంటోంది. ఆమె రెండేళ్ల క్రితం వరంగల్ జిల్లా సంగెం మండలం మొండ్రాయి గ్రామంలో జరిగిన తన మేనమామ కూతురు పెళ్లికి వెళ్లింది. అప్పుడు అక్కడే పక్కింటిలో ఉండే అజార్‌తో పరిచయం ఏర్పడింది. ఒకరి ఫోన్ నంబర్ మరొకరు ఇచ్చిపుచ్చుకున్నారు. ఆ సమయంలో అజార్ ఐటీఐ పూర్తిచేసి కారు డ్రైవర్‌గా పనిచేస్తుండేవాడు. ఫోన్ లో మాట్లాడుకుంటున్న క్రమంలో అజార్ ప్రేమిస్తున్నానని చెప్పడంతో ఆమె తనకు ఇష్టం లేదని చెప్పింది. ఆమెను ఒప్పించడానికి అజార్ చాలా ప్రయత్నించాడు. అయితే కొంత కాలంగా హైదరాబాద్‌లో ఉంటున్న ఆమె అతన్ని పూర్తిగా దూరం పెట్టింది. కాగా శుక్రవారం ఉదయమే ఇంటికి వచ్చిన ఆమె తల్లిదండ్రులిద్దరూ పనికి వెళ్లడంతో ఇంట్లో ఒంటరిగా ఉంది. అప్పటికే స్నేహితుల ద్వారా ఆమె హనుమకొండకు వస్తున్న విషయం తెలుసుకున్న అజార్ ఆమె ఇంటికి వెళ్లాడు. చున్నీతో ముఖాన్ని చుట్టేసి ముందుగానే తనవెంట తెచ్చుకున్న కూరగాయలు కోసే కత్తితో ఆమె గొంతు కోసి పరారయ్యాడు. తీవ్ర గాయంతో అరుచుకుంటూ బయటకు వచ్చిన ఆమెను స్థానికులు 108లో ఎంజీఎంకు తరలించారు. చదవండి👉🏾 ఫేస్బుక్ చాటింగ్.. మార్ఫింగ్ చేసిన వీడియోలతో బ్లాక్ మెయిల్ ప్రాణాపాయం తప్పింది.. ఆస్పత్రిలో ఆ విద్యార్థిని పోలీసులకు వాంగ్మూలం ఇచ్చింది. పెళ్లిలో పరిచ యం అయిన అజార్ ప్రేమించాలం టూ వేధించేవాడని, తను ఇంకో వ్యక్తి తో మాట్లాడుతున్నట్లు అసూయపడి కోపం పెంచుకుని దాడి చేశాడని ఆమె చెప్పినట్లు సుబేదారి ఇన్స్పెక్టర్ రాఘవేందర్ తెలిపారు. అజార్‌ను అరెస్టు చేసి 307, 354, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలిస్తున్నట్లు చెప్పారు. బాధితురాలికి ఆర్ఐసీయూ వార్డులో చికిత్స అందిస్తున్నామని, ప్రాణాపాయస్థితి నుంచి బయట పడిందని ఎంజీఎం సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్లు విద్యార్థినిని పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆదేశించారు. తమిళిసై తీవ్ర విచారం ప్రేమోన్మాది దాడి చేసిన ఘటనపై గవర్నర్ తమిళిసై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్‌తో ఫోన్లో మాట్లాడారు. మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు. కాగా నిందితుడిని కఠినంగా శిక్షించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలన్నారు. చదవండి👉🏾 మల్కాజ్గిరి మహిళ హత్యలో ట్విస్ట్.. -
తను లేని జీవితం వద్దు.. నన్నూ చంపేయండి.!
సాక్షి, చెన్నై: తనకు చేస్తున్న మోసాన్ని భరించలేకే అశ్వినిని హతమార్చినట్టు నిందితుడు అళగేశన్ పోలీసులకు వాంగ్మూలం ఇచ్చాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దని, తననూ హతమార్చాలని లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని పోలీసుల వద్ద ఆవేదన వ్యక్తం చేశాడు. ఇక, అళగేషన్‌ను ఉరి తీయాలని అశ్విని కుటుంబీకులు డిమాండ్ చేస్తున్నారు. చెన్నైలో ప్రేమోన్మాది అళగేషన్(22) ఘాతకానికి శుక్రవారం అశ్విని(18) బలైన విషయం తెలిసిందే. ప్రజలు చితక్కొట్టడంతో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న అళగేషన్ ఆరోగ్యం శనివారం కుదుట పడింది. దీంతో ఉదయాన్నే పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టి అతడి వాంగ్మూలం తీసుకున్నారు. ఆ మేరకు ఆలపాక్కం ధనలక్ష్మి నగర్లో ఉన్నప్పుడు తొలిసారిగా అశ్వినిని చూసినట్టు పేర్కొన్నాడు. కొన్ని నెలలు ఆమె వెంట పడ్డానని, చివరకు తన ప్రేమను తెలియజేయడంతో అంగీకరించిదని తెలిపాడు. రెండేళ్లుగా తాను, అశ్విని ప్రేమించుకుంటున్నామని వివరించారు. ఆమెకు తండ్రి లేడని, తల్లి, సోదరుడు మాత్రమే ఉన్నట్టు చెప్పాడు. అందుకే తాను ఆమెను చదివించేందుకు కష్ట పడుతూ వచ్చానని పేర్కొన్నారు. రెండు లక్షల వరకు ఆమె చదువుల కోసం ఖర్చు పెట్టానని వివరించాడు. అయితే, కాలేజీలో చేరిన అనంతరం తనను ప్రేమించేందుకు తగ్గ అర్హతలు ఉన్నాయా అని అశ్విని ప్రశ్నించడం భరించలేక పోయాయని పేర్కొన్నాడు. ఆమె తల్లి ఒత్తిడి మేరకే అలా చెప్పినట్టు భావించానని, పోలీస్ స్టేషన్లో సైతం ఫిర్యాదు చేయడంతో తీవ్ర మనోవేదనకు గురైనట్టు తెలిపాడు. తనకు దక్కనిది మరొకరికి దక్కకూడదని భావించి ఆమెను హతమార్చిన మరుక్షణం తాను ఆత్మాహుతి చేసుకోవాలన్న లక్ష్యంతోనే కేకేనగర్‌కు వెళ్లడం జరిగిందన్నారు. అయితే, తనను అక్కడి జనం పట్టుకోవడంతో ఆత్మహత్య చేసుకోలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పాడు. ఇప్పుడు తనను చంపేయాలని లేకపోతే ఏదో ఒక రోజు ఆత్మహత్య చేసుకుంటానని వాపోయాడు. అశ్విని లేని జీవితం తనకు వద్దు అని బోరున విలపించాడు. బయటకు వచ్చిన ఫిర్యాదు : గత నెల 16వ తేదీన అశ్విని మధురవాయిల్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు తాజాగా బయట పడింది. తాను అళగేషన్ ప్రేమించుకున్నట్టు వివరించిన అశ్విని, ఇప్పుడు అతడికి ఎలాంటి అర్హతలు లేదు అని, అందుకే దూరం పెట్టినట్టు ఆ ఫిర్యాదులో పేర్కొని ఉండడం గమనార్హం. ఈ సమయంలో పోలీసులు అళగేషన్కు బాగానే దేహశుద్ధి చేశారు. స్థానిక పెద్దల జోక్యంతో అళగేషన్‌ను హెచ్చరించి పంపించారు. అయితే, తనకు జరిగిన అవమానం, తనను మోసం చేసే విధంగా అశ్విని వ్యవహరించడాన్ని భరించ లేక హతమార్చి తీరాలన్న భావనతో వచ్చి తన పంతాన్ని అళగేషన్ నెగ్గించుకున్నాడు. తనకు దూరం అవుతున్న అశ్వినికి బలవంతంగా ఆ ప్రేమోన్మాది తాళి కట్టడం, దానిని ఆమె తెంచి పడేయడం వంటి ఘటనలు కూడా చోటుచేసుకుని ఉండడం గమనార్హం. అళగేశన్‌ను చూసి భయపడి : కళాశాల గేటు వద్ద మిత్రులతో కలిసి బయటకు వచ్చిన అశ్విని సమీపంలో నక్కి ఉన్న అళగేషన్‌ను గుర్తించింది. మిత్రులతో కలిసి వెళ్లి ఉంటే ప్రాణాల్ని దక్కించుకునేదేమో. ఎక్కడ అళగేషన్ తన ముందుకు వస్తాడోనన్న భయంతో పక్కనే ఉన్న మరో వీధి వెంట పరుగులు తీసింది. దీన్ని గుర్తించిన కిరాతకుడు వెంట పడి మరీ ఆమె గొంతులో కత్తిని దించి హతమార్చాడు. ఈ హఠాత్పరిణామాన్ని అక్కడే ఉన్న కొందరు గుర్తించి అడ్డుకునే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. హుటాహుటిన సమీపంలోని ఆస్పత్రికి తరలించేలోపు ఆమె విగతజీవిగా మారింది. అళగేషన్ వేధింపుల నేపథ్యంలో ప్రతిరోజూ తానే అశ్విని ఇంటికి తీసుకొచ్చే వాడిని అని, శుక్రవారం కాస్త ఆలస్యం కావడంతో ఆమెను పోగొట్టుకున్నట్టు ఆమె పెదనాన్న సంపత్ ఆవేదన వ్యక్తంచేశారు. అశ్విని చదువులకు తానేదో లక్షలు ఖర్చు పెట్టినట్టుగా నిందితుడు పేర్కొనడాన్ని ఆమె తల్లి శంకరి ఖండించారు. తాను అనేక ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ కుమార్తెను, కుమారుడ్ని చదివిస్తున్నట్టు వివరించారు. ఆస్పత్రిలో శనివారం పోస్టుమార్టం అనంతరం అశ్విని మృతదేహాన్ని తీసుకునేందుకు కుటుంబీకులు నిరాకరించారు. నిందితుడ్ని ఉరి తీయాలని, అప్పుడే మృతదేహాన్ని తీసుకుంటామని పట్టుబట్టారు. చివరకు పోలీసు ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని బుజ్జగించారు. దీంతో మృతదేహాన్ని తీసుకున్న కుటుంబీకులు అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు. -
చెన్నైలో మృగోన్మాదం
సాక్షి ప్రతినిధి, చెన్నై: ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువతిని ప్రేమోన్మాది కత్తితో పొడిచి హత్య చేసిన ఘటన చెన్నైలో చోటుచేసుకుంది. ఇక్కడి మధురవాయల్‌కు చెందిన అశ్వని(18) స్థానికంగా ఓ కాలేజీలో బీకాం మొదటి సంవత్సరం చదువుతోంది. అదే ప్రాంతానికి చెందిన అళగేశన్(22) అనే యువకుడితో ఆమెకు స్నేహం ఏర్పడింది. కొన్నాళ్లకు తనను తనను ప్రేమించాలని వేధించడం మొదలుపెట్టాడు. ఆమె అంగీకరించకపోవడంతో కోపంతో ఇంట్లోకి చొరబడి తాళి కట్టాడు. యువతి కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అళగేశన్ జైలు పాలయ్యాడు. ఇటీవల బెయిల్‌పై బయటికొచ్చి మళ్లీ వేధించడం మొదలుపెట్టాడు. దీంతో ఆమె తల్లిదండ్రులు బంధువుల ఇంట్లో ఉంచి 10 రోజులు కాలేజీకి పంపలేదు. 8 నుంచి అశ్వనీ కళాశాలకు వస్తోందని తెల్సుకుని శుక్రవారం మధ్యాహ్నం కాలేజీ నుంచి ఇంటికి తిరిగొస్తుండగా కత్తితో ఆమెపై విచక్షణారహితంగా దాడిచేశాడు. వదిలేయమని బతిమాలుతున్నా వినకుండా కత్తితో నిర్దాక్షిణ్యంగా ఆమె గొంతు కోశాడు. దీంతో అశ్వని గిలగిలా కొట్టుకుంటూ ప్రాణాలు కోల్పోయింది. పరారయ్యేందుకు యత్నించిన అళగేశన్‌ను స్థానికులు పట్టుకుని చితకబాదడంతో అతను స్పృహ కోల్పోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న చెన్నై కేకే నగర్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆ ఉన్మాది ఎక్కడ?
♦ ఇంకా దొరకని అక్కాచెల్లెళ్లను హత్యచేసిన నిందితుడు అమిత్‌సింగ్ ♦ పోలీసుల దర్యాప్తులో కానరాని పురోగతి సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట గాయత్రీపురంలో జంట హత్యలు జరిగి వారం కావస్తున్నా నిందితుడు అమిత్ సింగ్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. రోజురోజుకు అత్యాధునిక సాంకేతిక సేవలతో మన ముందుకు వస్తున్న సైబరాబాద్ పోలీసులు...గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని ఈ 21 ఏళ్ల కుర్రాడిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. భారీ చోరీ జరిగితే 24 గంటలు గడవక ముందే దొంగలను పట్టుకున్నామంటూ ప్రెస్మీట్లు పట్టి మరీ చెప్పే సిటీ పోలీసులు...ఇద్దరు యువతులను కర్కశంగా చంపిన అమిత్‌సింగ్ జాడ కనిపెట్టలేకపోవడం విడ్డూరం. ఇది మన పోలీసుల వైఫల్యమనుకోవాలా? లేక అమిత్ తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటున్నాడనుకోవాలా?...ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది. పురోగతి లేదు... అమిత్‌సింగ్ తండ్రి అమర్‌సింగ్, తల్లితో పాటు చెల్లెలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు...మరిన్ని వివరాలు రాబట్టేందుకు స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అమిత్ ఎల్బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్ఛాప్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. హత్య చేసిన తర్వాత ఉప్పల్ నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వెళ్లిన అమిత్ ఢిల్లీలో ఉండే పెద్దమ్మ కూతురి వద్దకు రైల్లో వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేదు. ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి ఎక్కడెక్కడ ఉండే అవకాశముందని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఎనిమిది మంది హైదరాబాద్ పోలీసుల బృందం...ఢిల్లీలో అమిత్‌సింగ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు కూడా కొంత మంది పోలీసులు వెళ్లినా ఫలితం దక్కలేదు. చనిపోయాడా? ‘నన్ను ప్రేమించి వంచించిన శ్రీలేఖతో పాటు అడ్డొచ్చిన యామిని సరస్వతీని కూడా హత్యచేశా. ఇది మీకు చెప్పేందుకు ఫోన్ చేశా. ఇక నేను కూడా చస్తాను నాన్న’ అని చివరిసారిగా తండ్రి అమర్‌సింగ్‌తో అన్నట్టు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే అమిత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న సందేహం కలుగుతోంది. ఒకవేళ అలా జరిగితే ఇప్పటికే మన పోలీసులకు మృతదేహం దొరికిపోయేది. హత్య జరిగి ఆరు రోజులైనా అమిత్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది. గతంలో ఏ మాత్రం నేరచరిత లేని అమిత్ తెలివిగా వ్యవహరించి పోలీసుల కన్నుగప్పి సిటీ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లాడనడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం ఉదయం 8. 40 గంటలకు హత్య చేసిన అమిత్ జాడ ఇప్పటివరకు కచ్చితంగా గుర్తించలేని పోలీసులు...అతడి బ్యాంక్ ఖాతా లావాదేవీలపై కన్నేసినా ఎలాంటి పురోగతి లేదు. అమిత్‌తో చనువుగా ఉండే స్నేహితులందరినీ ప్రశ్నించినా ఏ మాత్రం ప్రయోజనం కనబడటం లేదు. పట్టుకుంటాం... అమిత్‌సింగ్‌ను అరెస్టు చేసి తీరుతామని ఎల్బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది అదే పనిలో ఉన్నారని, సాంకేతికత ఆధారంగా అమిత్ ఎక్కడున్నాడో గుర్తించగలిగామన్నారు. రెండు రోజుల్లో తప్పక అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి భరోసా కరువు.. ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యామిని సరస్వతీ, శ్రీలేఖ తల్లిదండ్రులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రస్తుతం హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు బిడ్డలనూ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్న వీరిని ప్రభుత్వం నుంచి పరామర్శించేవారే కరవయ్యారు. మేమున్నామనే భరోసా ఇచ్చేవారు కానరావడం లేదు. పుష్కరఘాట్లలోను, మొక్కలు నాటుతూ...ఇలా ఎక్కడబడితే అక్కడ కనిపించే మన మంత్రులకు...ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి ఆక్రందనలు మాత్రం వినిపించడంలేదు. చనిపోయినా చూపునిచ్చారు అమిత్ సింగ్ చేతిలో హతమైన శ్రీలేఖ, యామిని సరస్వతీ కళ్లు దానం చేశారు. తాము చనిపోయి ఇతరులకు చూపునిచ్చారు. అటువంటి మంచివారిని పొట్టనబెట్టుకున్న హంతకుడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం బాధనిపిస్తోంది. అయినా మాకు చట్టంపైనా గౌరవముంది. హంతకుడికి కఠిన శిక్ష విధించాలని మృతుల బంధువు లక్ష్మీ ప్రసన్న డిమాండ్ చేశారు.