ఆ ఉన్మాది ఎక్కడ? | Where is the maniac? | Sakshi
Sakshi News home page

ఆ ఉన్మాది ఎక్కడ?

Published Sun, Jul 19 2015 11:53 PM | Last Updated on Wed, Mar 28 2018 11:08 AM

ఆ ఉన్మాది ఎక్కడ? - Sakshi

ఆ ఉన్మాది ఎక్కడ?

♦ ఇంకా దొరకని అక్కాచెల్లెళ్లను హత్యచేసిన నిందితుడు అమిత్‌సింగ్
♦ పోలీసుల దర్యాప్తులో కానరాని పురోగతి
 
 సాక్షి, హైదరాబాద్ : కొత్తపేట గాయత్రీపురంలో జంట హత్యలు జరిగి వారం కావస్తున్నా నిందితుడు అమిత్ సింగ్ ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు.  రోజురోజుకు అత్యాధునిక సాంకేతిక సేవలతో మన ముందుకు వస్తున్న సైబరాబాద్ పోలీసులు...గతంలో ఎలాంటి నేరచరిత్ర లేని ఈ 21 ఏళ్ల కుర్రాడిని మాత్రం పట్టుకోలేకపోతున్నారు. భారీ చోరీ జరిగితే 24 గంటలు గడవక ముందే దొంగలను పట్టుకున్నామంటూ ప్రెస్‌మీట్‌లు పట్టి మరీ చెప్పే సిటీ పోలీసులు...ఇద్దరు యువతులను కర్కశంగా చంపిన అమిత్‌సింగ్ జాడ కనిపెట్టలేకపోవడం విడ్డూరం. ఇది మన పోలీసుల వైఫల్యమనుకోవాలా? లేక అమిత్ తెలివిగా వ్యవహరించి తప్పించుకుంటున్నాడనుకోవాలా?...ఈ ప్రశ్నలకు పోలీసులే సమాధానం చెప్పాల్సి ఉంది.

 పురోగతి లేదు...
 అమిత్‌సింగ్ తండ్రి అమర్‌సింగ్, తల్లితో పాటు చెల్లెలను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులు...మరిన్ని వివరాలు రాబట్టేందుకు స్నేహితులను కూడా ఇంటరాగేట్ చేస్తున్నారు. అమిత్ ఎల్‌బీనగర్ నుంచి ఉప్పల్ వెళ్లే మార్గంలో మూసీ నది వద్ద చివరగా ఫోన్‌కాల్ మాట్లాడి స్విచ్ఛాప్ చేసినట్టు గుర్తించిన పోలీసులు ఆ పరిసర ప్రాంతాల్లోనూ తీవ్రంగా గాలించినా ఎలాంటి ఫలితం కనిపించడం లేదు. హత్య చేసిన తర్వాత ఉప్పల్ నుంచి నేరుగా సికింద్రాబాద్‌కు వెళ్లిన అమిత్ ఢిల్లీలో ఉండే పెద్దమ్మ కూతురి వద్దకు రైల్‌లో వెళ్లి ఉండవచ్చనే అనుమానంతో రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించినా ఫలితం లేదు.

ఇప్పటికే నాలుగు బృందాలుగా విడిపోయి ఎక్కడెక్కడ ఉండే అవకాశముందని భావిస్తున్నారో ఆయా ప్రాంతాల్లో వేట కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పటికే ఓ కేసు నిమిత్తం ఢిల్లీలో ఉన్న ఎనిమిది మంది హైదరాబాద్ పోలీసుల బృందం...ఢిల్లీలో అమిత్‌సింగ్ ఆచూకీ కోసం వెతుకుతున్నారు. ఉత్తరప్రదేశ్‌కు కూడా కొంత మంది పోలీసులు వెళ్లినా ఫలితం దక్కలేదు.

 చనిపోయాడా?
 ‘నన్ను ప్రేమించి వంచించిన శ్రీలేఖతో పాటు అడ్డొచ్చిన యామిని సరస్వతీని కూడా హత్యచేశా. ఇది మీకు చెప్పేందుకు ఫోన్ చేశా. ఇక నేను కూడా చస్తాను నాన్న’ అని చివరిసారిగా తండ్రి అమర్‌సింగ్‌తో అన్నట్టు ఉన్న సమాచారాన్ని బట్టి చూస్తే అమిత్ ఆత్మహత్య చేసుకున్నాడా? అన్న సందేహం కలుగుతోంది.  ఒకవేళ అలా జరిగితే ఇప్పటికే మన పోలీసులకు మృతదేహం దొరికిపోయేది.  హత్య జరిగి ఆరు రోజులైనా అమిత్ సజీవంగా కానీ, నిర్జీవంగా కానీ దొరకకపోవడం పోలీసుల పనితీరును ప్రశ్నించేలా చేస్తోంది.

గతంలో ఏ మాత్రం నేరచరిత లేని అమిత్ తెలివిగా వ్యవహరించి పోలీసుల కన్నుగప్పి సిటీ దాటి ఇతర రాష్ట్రాలకు వెళ్లాడనడానికి పోలీసుల వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. మంగళవారం ఉదయం 8. 40 గంటలకు హత్య చేసిన అమిత్ జాడ ఇప్పటివరకు కచ్చితంగా గుర్తించలేని పోలీసులు...అతడి బ్యాంక్ ఖాతా లావాదేవీలపై కన్నేసినా ఎలాంటి పురోగతి లేదు. అమిత్‌తో చనువుగా ఉండే స్నేహితులందరినీ ప్రశ్నించినా ఏ మాత్రం ప్రయోజనం కనబడటం లేదు.

 పట్టుకుంటాం...
 అమిత్‌సింగ్‌ను అరెస్టు చేసి తీరుతామని ఎల్‌బీనగర్ డీసీపీ తఫ్సీర్ ఇక్బాల్ అన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది అదే పనిలో ఉన్నారని, సాంకేతికత ఆధారంగా అమిత్ ఎక్కడున్నాడో గుర్తించగలిగామన్నారు.  రెండు రోజుల్లో తప్పక అదుపులోకి తీసుకుంటామని ధీమా వ్యక్తం చేశారు.
 
 ప్రభుత్వం నుంచి భరోసా కరువు..
 ప్రేమోన్మాది చేతిలో దారుణ హత్యకు గురైన యామిని సరస్వతీ, శ్రీలేఖ తల్లిదండ్రులు ఇంకా ఆ షాక్ నుంచి తేరుకోలేదు. ప్రస్తుతం హస్తినాపురంలోని బంధువుల ఇంట్లో ఉంటున్నారు. ఇద్దరు బిడ్డలనూ కోల్పోయి అచేతన స్థితిలో ఉన్న వీరిని ప్రభుత్వం నుంచి పరామర్శించేవారే కరవయ్యారు. మేమున్నామనే భరోసా ఇచ్చేవారు కానరావడం లేదు. పుష్కరఘాట్లలోను, మొక్కలు నాటుతూ...ఇలా ఎక్కడబడితే అక్కడ కనిపించే మన మంత్రులకు...ఇద్దరు బిడ్డలను కోల్పోయిన ఓ తల్లి ఆక్రందనలు మాత్రం వినిపించడంలేదు.
 
 చనిపోయినా చూపునిచ్చారు
 అమిత్ సింగ్ చేతిలో హతమైన శ్రీలేఖ, యామిని సరస్వతీ కళ్లు దానం చేశారు. తాము చనిపోయి ఇతరులకు చూపునిచ్చారు. అటువంటి మంచివారిని పొట్టనబెట్టుకున్న హంతకుడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం బాధనిపిస్తోంది. అయినా మాకు చట్టంపైనా గౌరవముంది. హంతకుడికి కఠిన శిక్ష విధించాలని మృతుల బంధువు లక్ష్మీ ప్రసన్న డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement