నవయువ భారతం ‘మసాన్’
జాతిహితం
భారత జనరంజక సినిమా మారుతున్న మన సమాజపు వైఖరులను, పోకడలను అంత త్వరగా పసిగట్టగలదా? లేదంటే, వాస్తవంగా వాటిని అది ముందుగానే ఊహించి తానే మారుతుందా? ఇదో ఆసక్తికరమైన చర్చనీయాంశం. అయితే భారత సినిమా, నిర్దిష్టంగా చెప్పాలంటే హిందీ సినిమా (నా భాషా పరిధి పరిమితం కాబట్టి) మన సమా జంలో, ఆర్థికతత్వంలో, జీవనశైలులలో, వైఖరుల లోనే కాదు, లైంగిక భావనల్లో సైతం వస్తున్న మార్పులను మరిదేనికన్నా కూడాసుస్పష్టంగా ప్రతిఫలించగలుగుతోందనేది మాత్రం నిస్సందేహం. పండితులు, సామాజిక శాస్త్రవేత్తలు, రాజకీయవేత్తలు కనుగొనడానికి ముందే అది ప్రస్తుతం చిన్న పట్టణాల భారతాన్ని కనిపెట్టిం ది.
సంజయ్ గ్యావన్ తీసిన అద్భుతాతి అద్భుతమైన మసాన్ (ఒంటరిగా ఎగిరిపో) చూసేసరికి సినీలోకానికి చెందని, తేలికగా ప్రభావితమయ్యే సామాన్యమైన నా మతి గతి తప్పి ఉండొచ్చని మీరనొచ్చు. చిన్న పట్టణ భార తం గుండె చప్పుళ్లను మసాన్ పట్టుకున్నట్టుగా నేను చూసిన మరే సినిమా పట్టుకోలేకపోయింది. నా మనస్సుపై అది ప్రగాఢ ముద్రను వేసిందనడం నిస్సందేహం. దాన్ని చూసే ప్రేక్షకులలో చాలా మంది పరిస్థితి కూడా అదే కావచ్చని నా అనుమానం. షాద్ అలీ తీసిన బంటీ ఔర్ బబ్లీతో ఆవిర్భవిం చిన ఈ ధోరణి ఆ తర్వాతి ఏళ్లలో ఓంకార, ఇష్కియా, లవ్, సెక్స్ ఔర్ ధోకా, దేవ్. డి, గ్యాంగ్స్ ఆఫ్ వాసేపూర్లతో కొనసాగి, ఇప్పుడు మసాన్తో పరిణతి చెందినట్టు రూఢీ అయింది.
సాపేక్షికంగా సరదా సినిమాల కోవకు చెందిన శుద్ధ్ దేశీ రొమాన్స్, రాంఝనా, తను వెడ్స్ మను, దాని రెండో భాగం, బ్లాక్ బస్టర్ స్థాయిలోని దబాంగ్, రబ్ నె బనా దీ జోడీ కూడా ఆ ధోరణిలో భాగమే. 1970ల మొదటి వరకు హిందీ సినిమాలో గ్రామీణ భారతం ప్రధాన ధోరణిగా ఉండేది. నిరాశా నిస్పృహలు, ఆగ్రహావేశాలు ప్రవేశించడంతో అది రంగం నుంచి తప్పుకుని, సర్వ విజేతయైన ఆగ్రహభరిత యువకునికి చోటి చ్చింది. కానీ దాదాపు గత దశాబ్దికి పైగా చిన్న పట్టణ భారతం అలనాటి గ్రామీణ భారతమంతటి ప్రస్ఫుటమైన ధోరణిగా ఆవిర్భవించింది.
మారే సమాజంతో మారుతున్న సినిమా
రాజకీయ అర్థశాస్త్ర దృష్టితో ఈ మార్పునకు సంబంధించిన చరిత్రను కొంత వరకు వ్యాఖ్యానిద్దాం. 2001 నాటి దిల్ చాహతా హై ఒక కొత్త మార్పును సూచించింది. నేటి మార్పు దానికి తార్కికమైన కొనసాగింపేనని నిరభ్యంత రంగా చెప్పొచ్చు. అంతకు ముందు వరకు హిందీ సినిమాలు ప్రజాకర్షక రాజ కీయాల కాలాన్ని ప్రతిఫలించేవి. పేదరికాన్ని గొప్పగా కీర్తిస్తూ అవి ‘‘టాటా- బిర్లా’’ తరహా సంపన్నులను అవహేళన చేస్తుండేవి. నిజమైన సంతోషం, వివేకం, నైతికత పేదలకే సొంతమని పదేపదే చెబుతుండేవి. ఫర్హాన్ అక్తర్ తీసిన దిల్ చాహతా హై ఆర్థిక సంస్కరణల తదుపరి సరిగ్గా దశాబ్దికి వచ్చిం ది. నిస్సిగ్గుగాసంపన్నవంతులదిగా చాటుకున్న సినిమా హిట్ కావడం అదే మొదటిసారి.
అందులోని ముగ్గురు మగాళ్లూ సంపన్నులు, గారాబం వల్ల చెడిపోయినవాళ్లు, ఫ్యాన్సీ కార్లు డ్రైవ్ చేస్తూ షాంపేన్ తాగుతూ గడిపే వాళ్లు. వాళ్ల గర్ల్ ఫ్రెండ్స్ కూడా సంపన్నులే. అంతవరకు సాధారణ హిందీ సినిమా అంటే, ఆ ముగ్గురిలో ఒకరు ఆ ఇద్దరి ఇళ్లలో పనిమనిషిగా ఉండే ఓ విధవరాలి కొడుకై ఉండేవాడు. ఆ కొడుకు వంటగదిలోకి వెళ్లి ప్రపంచంలో మరెవరూ ఆమెలా వంట చేయలేరని చెబుతుండేవాడు. కానీ ఫర్హాన్ తీసిన ఈ సినిమా అంత కొట్టవచ్చినట్టుగా సంపదల వైభోగాన్ని ఏమాత్రం క్షమాప ణాభావం లేకుండా చూపడం ‘జాతిహితం’ దాన్ని (‘ఆహా! ఏమి మధు రమైన పేదరికపు పరిమళం!’, సెప్టెంబర్ 1, 2001) గుర్తించడానికి ప్రేరణ అయ్యింది కూడా.
వాస్తవానికి నేను ఆ సినిమా గురించి ఆలోచిస్తుండగానే... పేదరికం నా జన్మహక్కు. అయితే దాన్ని మీరూ పంచుకోవచ్చు అని సూచించే ‘‘పేదరికవాదం’’ అనే వ్యక్తీకరణ మొలకెత్తింది. అందుకని దానిపై ట్రేడ్ మార్క్ హక్కులను సైతం నేను ప్రకటిస్తున్నాను. ఆ సినిమా తర్వాత దశాబ్దికిపైగా ధనవంతులు, ప్రత్యేకించి ఎన్ఆర్ఐల సినిమాలు వచ్చాయి. జిందగీ న మిలేగా దొబారాతో అది బహుశా తారస్థాయినందుకుంది. ఆ ధోరణి స్థానంలో ఇప్పుడు చిన్న పట్టణం కథ ప్రవేశిస్తుండటం మనకు రెండు విషయాలను చెబుతోంది. ఒకటి, మనలాంటి సంచార పాత్రికేయుల్లో కొందరం మాట్లాడుతున్న ఆకాంక్షాభరిత భారత ఆవిర్భావం అనే భావనను హిందీ సినిమా నిర్మాతలు ఎక్కడో దొరకబట్టుకుని ఉండాలి. రెండు, 1991లో మొదలైన ఆ మార్పు ఆ తదుపరి దశాబ్దిలో మనం సంపదలను గౌరవించ డానికి, ఆ సంపదల సృష్టికర్తలను ప్రేమించడానికి తోడ్పడింది. ఇప్పుడు, ఆర్థిక సంస్కరణల 25వ ఏట అది చిన్న పట్టణంలోకి, వేగంగా పట్టణీకరణం ప్రవేశిస్తున్న (రర్బనైజింగ్) గ్రామంలోకి కూడా మెల్లగా వ్యాపిస్తోంది.
అబ్బాయి-అమ్మాయి కొత్త కథ
ఇక మసాన్ వద్దకు తిరిగి వద్దాం. ఆ చిత్ర కథ ఏమిటో చెప్పకుండానే, దానిలో నాకు నచ్చిన ఘట్టం గురించి చెప్పనివ్వండి. దేవీ పాఠక్ వారణాసిలో చితి మంటలు రగులుతుండే ఘాట్లలోని పేద పూజారి కూతురు, విద్యావం తురాలు, ఆకాంక్షాభరితురాలు. దేవి పాత్రలో రిచా చద్దా ఓ రైల్వే స్టేషన్లో బుకింగ్ క్లర్క్‌గా పనిచేస్తుంటుంది. ఆమె బుకింగ్ కిటికీ ముందు నిల్చుని ఓ అబ్బాయి-అమ్మాయి జంట ఏదైనా చోటుకు పోయి, రాత్రికి కలసి గడపాలని రెండు టికెట్లు అడుగుతారు. అది చూసి దేవి బిర్రబిగుసుకుపోతుంది. అస మ్మతి పూర్వకమైన ఆమె కళ్లు మానిటర్‌ను చూసే సరికి 26 ఖాళీ సీట్లు కని పిస్తుంటాయి. కానీ ఆమె వారికి లేవని చెబుతుంది. దేవి పేదరాలే అయినా విద్యావంతురాలు, చిన్న పట్టణ వాసే అయినా ఆకాంక్షాభరితురాలు. కానీ ఓ రెండు గంటలపాటు ఒక బాయ్‌ఫ్రెండ్‌తో తను సన్నిహితంగా గడిపితే, ఆ తర్వాత ఎంతటి అపనిందలు, వేధింపులకు గురికావాల్సి ఉంటుందో ఎరిగి నది. ఇంతే అయితే ఇది పాత కథే కావచ్చు. కానీ ఆమె దాన్ని అంగీకరించ దు. తాను పుట్టి పెరిగిన చోట ఉండే పరిస్థితుల వల్ల తనకు అందని దాన్ని దా దాపు తన వయసువారే అయిన ఆ అబ్బాయి, అమ్మాయిలకు అందనివ్వదు.
కొత్త ధోరణికి శిఖరాయమానం
మన చిన్న పట్టణవాసుల వైఖరులు ఎంత త్వరత్వరగా మారిపోతున్నాయ నేది ఈ కోవకు చెందిన సినిమాలన్నిటిలోనూ పూసల్లో దారంలా కనిపిస్తుం టుంది. వాటిలో మసాన్ శిఖరాయమానమైనది. అసాధారణ స్థాయి సమా చార అనుసంధానం (హైపర్-కనెక్టివిటీ), విద్య - అది విసుగెత్తించే ఇంజనీ రింగ్ లేదా సాంకేతిక కళాశాలలదే అయినాగానీ - మోటారు వాహనాలు, మీడియా తదితరాలన్నీ చిన్న పెద్ద పట్టణాల మధ్య అంతరాలను పూడ్చేస్తు న్నాయి. కుల, సామాజిక అడ్డుగోడలను తునాతునకలు చేస్తున్నాయి. అయితే అదేసమయంలో తరాల మధ్య అంతరాన్ని పెంచుతున్నాయి. బనారస్ లేదా బరెల్లీ, హోషంగాబాద్ లేదా హత్రాస్ పట్టణాల్లో ఎక్కడైనాగానీ అమ్మాయి, అబ్బాయిల మధ్య తొలి పరిచయం ఫేస్బుక్ ద్వారానే.
హార్మోన్లవంటి అంత స్రావాల పరంగా జీవితంలోని అత్యుత్తమమైన ఆ దశలోని వారి ప్రేమాయ ణం పేరు పెట్టి పిలుచుకోవడంతోనే పూర్తిగా సాగుతుంది. అది ఒకరు మరొ కరి ‘‘ఫ్రెండ్’’ అభ్యర్థనను ఆమోదించడంతో మొదలవుతుంది. తల్లిదండ్రు లు, కుటుంబాలు కులం వంటి పెద్ద విషయాలను ఆరా తీసేసరికే సమయం మించిపోతుంది. సాధారణంగా ఆంటీల ఇచ్చకాలు లేదా గుసగుసల నుంచి ఇరవైయేళ్లుపైబడిన అమ్మాయికి తెలిసివచ్చే లైంగికత, పేద ఇళ్లలో సైతం అందుబాటులో ఉంటున్న కంప్యూటర్లలో నీలి చిత్రాలను చూడటం ద్వారా తెలుస్తోంది. అలాంటప్పుడు వారు పెళ్లి లేదా సంబంధాల కోసం వేచి చూసేదానికంటే దాని కోసం అన్వేషణ ప్రారంభించే అవకాశం ఉంది. తర్వా త ‘‘పట్టుబడి’’నప్పుడు... ఏమిటీ దరిద్రగొట్టు పని అని ఆగ్రహంతో ప్రశ్ని స్తే... వాళ్లు అతి తేలిగ్గా, మహానగరాల్లోని తమకంటే సంపన్న గృహాల్లోని తమ సోదరిలవలే తామూ అదేమిటో తెలుసుకోవాలనే ఆసక్తితోనేనని సైతం చెప్పగలరు.
సాంప్రదాయకతను ధ్వంసిస్తున్న ‘స్మార్ట్’ తరం
చౌకగా దొరికే స్మార్ట్ ఫోన్-మోటార్‌సైకిల్-ప్రైవేట్ కళాశాలల సమ్మేళనం పాత ‘‘సంప్రదాయకమైన’’ కుటుంబ సంబంధాలు, ఆశయాలు, లైంగికత లను పూర్తిగా ధ్వంసం చేసేసింది. దీనికి సంబంధించిన మొదటి ప్రకటనను మనం అనురాగ్ కశ్యప్ దేవ్ డి. లో చూశాం. మాహీగిల్ చాపను తీసుకుని సైకిల్‌పై అభయ్ దియోల్తో చెరకు తోట సమాగమం కోసం వెళ్లడం చూసి దిగ్భ్రాంతులమయ్యాం, ఉద్విగ్నతకు సైతం గురయ్యాం. పంజాబ్ లోతట్టు ప్రాంతంలో అంతకుమించిన ఏకాంత ప్రదేశం మరెక్కడ దొరుకుతుంది? అయితే ఆమె మారిన, నూతన భారతనారి. చురుకైన చిత్ర నిర్మాతలు ఈ నూతన పోకడలను ముందుగా గమనించారు. తమ కుటుంబాల్లో, ఇరుగు పొరుగుల్లో తాము నిత్యమూ చూస్తున్నదాన్నే ఆ సినిమాలు అంతగా వ్యక్తీకరి స్తున్నాయి కాబట్టే ప్రేక్షకులు ఇప్పుడు వాటిని ఆమోదిస్తున్నారు.
ఈ ధోరణిని మొదట పసిగట్టి, పాటలుగా మలచినవారు గుల్జార్, జైదీప్ సహానీలే. బంటీ అవుర్ బబ్లీ చిత్ర ప్రారంభ గీతం ‘‘ఛోటే ఛోటే షెహరాం సే...’’ వారు కలసి రాసినదే. ఆ తర్వాత జైదీప్ (చక్ దే ఇండియా, ఖోస్లా కా ఘోస్లా తదితర చిత్రాలకు అద్భుతంగా రాశారు) కెమెరా ముందే ఆ గీతం గురించి చెప్పారు. ఆ సినిమా సారాన్నంతటినీ క్రోడీకరించి అత్యుత్తమంగా వ్యక్తీకరించగలిగే చరణం కోసం తానింకా అన్వేషిస్తుండగా గుల్జార్‌కు ‘‘ఖాలీ బోరే దోహా రోం సే’’ తట్టిందని (తట్టాబుట్టా సర్దుకు మేం చిన్న పట్టణం నుం చి, బోరెక్కించే సోమరి సాయంకాలాల నుంచి తప్పించుకు పారిపోయాం) చెప్పారు. చిత్ర కథను అది చాలా చక్కగా మన ముందుంచింది. నేటి ఈ యువ భారతీయులు తమ తలరాతని సరిపెట్టుకునే బాపతుకారు. భౌతి కంగా కాకున్నా మానసికంగానైనా అందులోంచి బయటపడాలని కోరుకుం టారు. తట్టాబుట్టా సహా లేదా మునుపటి తరానికి చెందిన సామానంతా పారేసైనా వారా పనిచేయాలనుకుంటారు. నగరం ఒకప్పుడు ఉండేంత దూరంగా ఇప్పుడు లేదు. ఢిల్లీ, ముంబై, బెంగళూరులలో పెరిగిన వారితో పోలిస్తే రెండవ శ్రేణి హోదాను అంగీకరించడానికి ఎవరూ సిద్ధంగా లేరు.
స్వీయ విషయాలను ఉదహరించడంలో ప్రమాదాలు ఉన్నాయి. అయినా చెప్పాల్సి వస్తోంది. నా తరం పెరిగినది గ్రామీణ భారతంలో. సంస్కరణల తర్వాతి కాలంలో అది అక్కడి నుంచి ఎంతో దూరం వచ్చేసింది. అప్పట్లో ప్రపంచాన్ని వీక్షించడానికి మీకున్న ఏకైక గవాక్షం షార్ట్వేవ్ రేడి యోనే. ఇక ఇంగ్లిష్ మాట్లాడటంలో శిక్షణంటే బెర్రీ సర్వాధికారి, మెలవిల్లే డె మెల్లో, చక్రపాణిల క్రికెట్ కామెంటరీనే. రవి చతుర్వేది, జస్దేవ్ సింగ్‌ల హిం దీ ఎంత అద్భుతంగా ఉన్నా తల్లిదండ్రులు వారి ఇంగ్లిష్ కామెంటరీనే వినా లని నిర్బంధించేవారు. లేదంటే నిజంగానే దయగలిగిన ఉపాధ్యాయుడు ఎవ రైనా ఢిల్లీకి వెళ్లినప్పుడు జమామసీద్‌కు పక్కనే ఉన్న, అప్పట్లో సుప్రసిద్ధమైన దైన కబాదీ బజార్ (వీధి దుకాణాల మార్కెట్) నుంచి తెచ్చే టైమ్, లైఫ్ పత్రికల పాత కాపీలను... తన అభిమాన పాత్రులకు, ఎక్కువ ఆసక్తిగల విద్యార్థులకు ఇచ్చేవాడు. ఇప్పుడైతే మీరు ఏ చౌక చైనా స్మార్ట్ ఫోన్తోనైనా ఇంగ్లిష్ మాట్లాడటమే కాదు, ప్రపంచంలో దేన్నయినా నేర్చేసుకోవచ్చు. ఇక ఉచ్ఛారణ, శైలి గురించి పట్టించుకోనవసరమే లేదు. ఎందుకంటే మీ బాసో లేక సహచరో, సహచరుడో కూడా బహుశా అంతే దేశీయమైన, స్వీయ చైత న్యరహితమైన భాషనే మాట్లాడుతుంటారు. మీకు నచ్చిన వారెవరికైనా ‘‘ఫ్రెండ్’’ రిక్వెస్ట్‌ను పంపేయొచ్చు.
‘‘నేను ఎవరీకీ ఏమీ రుణపడి లేను’’
నేను అప్పుడప్పుడూ రాస్తుండే ‘రైటింగ్స్ ఆన్ ది వాల్’ నివేదికల పరంపర లోని పలువాటిలో నేను ఈ తరం భారతీయులను ఆకాంక్షాభరిత, ఆశా యుత, అసహనపూరిత, భావజాలానంతర తరంగా, ‘‘వెనకబడి ఉండటా నికి వీల్లేదు’’, ‘‘నేను ఎవరికీ ఏమీ రుణపడి లేను’’ అని భావించే తరంగా సైతం పేర్కొన్నారు. అందుకే రాహుల్ తన నాయనమ్మ గురించి చేసిన ప్రస్తా వనలు వారికి చిర్రెత్తించాయి.
మోదీ గుజరాత్ నమూనా వాగ్దానం ఉత్సా హాన్ని రేకెత్తించింది. అపారమైన తెలివితేటలుగల మన సినిమా నిర్మాతలు నేడు వారిని వెండితెరకి ఎక్కించి మన జీవితాల్లోకి తీసుకొస్తున్నారు. రాహుల్ తన మీద తానే జాలిపడిపోతూ పంపిన సందేశం కంటే నరేంద్ర మోదీయే తమను ముందుకు తీసుకుపోగలిగే అవకాశం ఎక్కువని అనుకున్నారు. దీంతో వారు 2014లో ఎలాంటి వెల్లువను సృష్టించారో మీరే చూశారు. వాళ్లే, ఢిల్లీ ఎన్నికలకు వచ్చేసరికి కొన్ని నెలల క్రితం తాము ఏ పార్టీకి ఓటేశామో కూడా మరచి, సరిగ్గా అందుకు పూర్తి వ్యతిరేక దిశకు మొగ్గడమూ చూశారు. మందిర్, మసీదు, గోవు లేదా కులం, హిందీ మీడియం, ఏం తినాలి, సామా జిక తిరోగమనవాదం తదితర అంశాలను మాట్లాడితే వారిని మీరు బోరెక్కిం చేస్తారు. అది మీకే ప్రమాదం.
శేఖర్ గుప్తా
Twitter@ShekarGupta.