లోక్‌సభకు వందల సంఖ్యలో నామినేషన్లు వేస్తాం
ఆర్మూర్, న్యూస్‌లైన్ : నిజామాబాద్ పార్లమెంట్ స్థా నానికి నిర్వహించే ఎన్నికల్లో నియోజకవర్గం పరిధిలో వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తామని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు పేర్కొన్నారు. సోమవారం ఆర్మూ ర్ మండలం మామిడిపల్లిలోని రైతు సేవా కేంద్రంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రతి గ్రామం నుంచి ఒకరు లేదా ఇద్దరు రైతులు, గల్ఫ్ బాధితులు నామినేషన్లు వేయడానికి కార్యాచరణ రూపొందిస్తున్నట్లు తెలిపారు.
పసుపు రైతులు, గల్ఫ్ బాధితుల సమస్యలు పరిష్కరించాలని పలు మార్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రజా ప్రతినిధులు, నాయకుల దృష్టికి తీసుకెళ్లినా వారి నుంచి ఆశించిన స్పందన రావడం లేదన్నారు. ఎన్నికల సమయం కావడంతో వారు ఓట్ల కోసం తమ వద్దకు వస్తున్నందున తమ నిరసన తెలియజేయడంలో భాగంగా పలు నిర్ణయాలు తీసుకుంటున్నామన్నారు.
పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో వందల సంఖ్యలో నామినేషన్లు దాఖలు చేస్తే ఈవీఎం స్థానంలో పెద్ద ఎత్తున బ్యాలెట్ పేపర్ ముద్రించాల్సి ఉంటుందన్నారు. ఈ విషయం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమవుతుందన్నారు. అందుకే రైతులు, గల్ఫ్ బాధితులతో భవిష్యత్ కార్యాచరణ రూపొందించడానికి మంగళవారం ఉదయం 11 గంటలకు పెర్కిట్‌లోని నిమ్మల గార్డెన్స్‌లో సమావేశం నిర్వహించనున్నట్లు చెప్పారు. అధిక సంఖ్యలో రైతులు, గల్ఫ్ బాధితులు వచ్చి తమ సలహాలు, సూచనలు ఇవ్వాలని కోరారు. సమావేశంలో సమన్వయకర్త కొత్తకుర్మ శివకుమార్, ముత్యాల మనోహర్‌రెడ్డి, వెల్ది ప్రసాద్, వెల్ది గౌతం రాజు తదితరులు పాల్గొన్నారు.