మద్దతు కాదు గిట్టుబాటు ధర కావాలి
ఏఎన్‌యూ, న్యూస్‌లైన్:
ప్రభుత్వాలు రైతులకు ఇవ్వాల్సింది మద్దతు ధర కాదని, గిట్టుబాటు ధర అని ఆంధ్రప్రదేశ్ రైతాంగ్ సమాఖ్య అధ్యక్షుడు యెర్నేని నాగేంద్రనాథ్ చెప్పారు. వ్యవసాయ ప్రధానమైన దేశంలో ప్రభుత్వాలు వ్యవసాయం కంటే పరిశ్రమలు, సేవారంగాలకు అధిక ప్రాధాన్యతనిస్తున్నాయన్నారు. దేశ ఆహార సమస్యలు తీర్చేందుకు జీవితాంతం శ్రమిస్తున్న రైతుల భద్రతకోసం ఎలాంటి చర్యలు లేకపోవటం విచారకరమన్నారు.
ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆర్థికశాస్త్ర విభాగం ఆధ్వర్యంలో ‘ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయరంగం ఎదుర్కొంటున్న సమస్యలు, సవాళ్లు’ అనే అంశంపై రెండు రోజులపాటు జరుగనున్న జాతీయ సదస్సు శనివారం యూనివర్సిటీలో ప్రారంభమయింది. ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన నాగేంద్రనాథ్ ప్రసంగిస్తూ రాష్ట్రంలో వ్యవసాయరంగం సంక్షోభంలో లేదని, రైతులు మాత్రమే సంక్షోభంలో ఉన్నారన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు తగిన గిట్టుబాటు ధర లభించకపోవటమే దీనికి కారణమన్నారు.
ఐక్యత లేకపోవటం రైతుల పాలిట శాపంగా మారిందన్నారు. రైతాంగ సమస్యలను రాజకీయ పార్టీలు తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూస్తున్నారే తప్ప సమస్యలు పరిష్కరించేందుకు చిత్తశుద్ధితో వ్యవహరించటంలేదని ఆరోపించారు. వ్యవసాయరంగ అభివృద్ధి కోసం ప్రభుత్వాలు పరిశోధనా కేంద్రాలు ఏర్పాటు చేసినా ఆ ఫలాలు రైతులకు దక్కటం లేదని చెప్పారు. వీసీ ఆచార్య కె.వియ్యన్నారావు అధ్యక్షోపన్యాసం చేస్తూ వ్యవసాయరంగంలో వ్యాపార ధృక్పధం ఉన్న సంస్థలు లాభాల బాటలోనే ఉన్నాయని, రైతులు మాత్రం నష్టాలు ఎదుర్కొంటున్నార ని పేర్కొన్నారు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల కంపెనీలు నష్టాలు ఎదుర్కొన్న సందర్బాలు లేవని, రైతులు గిట్టుబాటు ధరలేక నష్టపోయిన సందర్బాలు అనేకం ఉన్నాయని గుర్తుచేశారు.
ఐటీసీ డివిజినల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సంజీవ్ రామ్గ్రాస్ మాట్లాడుతూ వ్యవసాయ రంగాన్ని లాభాసాటిగా నిర్వహిస్తూ ప్రపంచానికే ఆదర్శంగా నిలిచిన ఇజ్రాయేల్ అనుసరిస్తున్న వ్యవసాయ విధానాలను పాటించాల్సిన అవసరం ఉంద న్నారు. సదస్సు డెరైక్టర్ ఆచార్య పి.నరసింహారావు, ఆంధ్రా యూనివర్సిటీ ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు ఆచార్య ఎల్ .కె.మోహనరావు, ఏఎన్‌యూ సోషల్ సెన్సైస్ డీన్ ఆచార్య బి.సాంబశివరావు, బెంగళూరు యూనివర్సిటీ అధ్యాపకులు ఆచార్య రామాంజనేయులు తదితరులు ప్రసంగించారు. అనంతరం అతిథులు సదస్సు సావనీర్‌ను ఆవిష్కరించారు. ఎకనామిక్స్ విభాగ అధ్యాపకులు ఆచార్య ఎం.కోటేశ్వరరావు, మాజీ రిజిస్ట్రార్ ఆచార్య ఎం.వి.ఎన్.శర్మ, ఆచార్య కె.రాజబాబు, ఆచార్య సి.ఎస్.ఎన్.రాజు, డాక్టర్ కె.మధుబాబు తదితరులు పాల్గొన్నారు.