వైఎస్సార్సీపీలోనే ముస్లింలకు పెద్దపీట
టీడీపీకి రోజులు దగ్గరపడ్డాయి
రేపటి నుంచి నగరంలో ‘గడప గడపకూ వైఎస్సార్’
వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీం అహమ్మద్
అనంతపురం : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ముస్లింలకు పెద్దపీట వేస్తోందని పార్టీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నదీంఅహమ్మద్ అన్నారు. టీడీపీ ముస్లిం మైనార్టీలను కేవలం ఓటుబ్యాంకుగా వాడుకుంటోందే తప్ప వారి సంక్షేమం గురించి పట్టించుకోవడం లేదన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో శనివారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్ కల్పించి తమ జీవితాల్లో వెలుగులు నింపారని, అదే స్ఫూర్తితో ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముస్లింల సంక్షేమానికి పాటు పడుతున్నారని చెప్పారు. తనను గుర్తించి ఫిబ్రవరిలో ముస్లిం మైనార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించిన ఆయన తాజాగా అనంతపురం అర్బన్ నియోజకవర్గ అదనపు సమన్వయకర్తగా నియమించారని, జీవితాంతం జగన్కు రుణపడి ఉంటానని అన్నారు. తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా పార్టీ అభివృద్ధికి సైనికుడిలా పని చేస్తానన్నారు.
అందులో భాగంగానే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు పార్టీ చేపట్టిన ‘గడప గడపకూ వైఎస్సార్’ కార్యక్రమాన్ని ఈనెల 19 నుంచి నగరంలో ప్రారంభిస్తానన్నారు. దీనిపై పార్టీ జిల్లా అధ్యక్షుడు శంకరనారాయణ, మాజీ ఎంపీ అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే గురునాథరెడ్డితో చర్చించానని, పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు ఆశీర్వదించాలని విజ్ఞప్తి చేశారు. 600లకు పైగా అబద్ధపు హామీలతో అధికారం దక్కించుకున్న చంద్రబాబు ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ విఫలమైందన్నారు. రుణాలు మాఫీ చేస్తానని ఒక అబద్ధం చెప్పి ఉంటే వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చేవారన్నారు. మాటతప్పని, మడమ తిప్పని నాయకుడైన ఆయన సాధ్యం కాని హామీని ఇవ్వలేనని చెప్పారన్నారు. ఇంటికో ఉద్యోగం కల్పిస్తానని చెప్పిన చంద్రబాబు తన కొడుకును దొడ్డిదారిన మంత్రి చేసుకుని ఉపాధి పొందారు తప్ప రాష్ట్రంలో నిరుద్యోగులకు ఒక ఉద్యోగం ఇవ్వలేదని మండిపడ్డారు. ఈ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని హెచ్చరించారు.
సమావేశంలో పార్టీ నాయకులు గోగుల పుల్లయ్య, షఫీ అహ్మద్, ఎంఎస్ఎస్ సాదిక్, ఖాదర్బాషా, గిరి, ఖాజా, జక్రియా అహ్మద్, నిజాముద్దీన్, వాహిద్, జఫ్రుల్లా తదితరులు పాల్గొన్నారు.