మోదీ పాలనలో భారత్ భేష్
♦ ఆయనకు నేను పెద్ద అభిమానిని
♦ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు కిమ్ కితాబు
♦ ప్రధానితో సమావేశం... సంపూర్ణ సహకారానికి హామీ
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ పాలనలో భారత్ అద్భుతంగా పయనిస్తోందంటూ ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు జిమ్యాంగ్ కిమ్ కితాబిచ్చారు. మోదీ కార్యశీలి అని, ఆయనకు తాను పెద్ద అభిమానినని చెప్పారు. రెండు రోజల భారత పర్యటనలో భాగంగా చివరి రోజున గురువారం ప్రధాని మోదీతో కిమ్ భేటీ అయ్యారు. సంప్రదాయేతర ఇంధన రంగం, పోషకాహారం, స్మార్ట్ సిటీలు, గంగా నదీ నవీకరణ, నైపుణ్య అభివృద్ధి, స్వచ్ఛభారత్ సహా ప్రభుత్వం చేపట్టిన అన్ని ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు ప్రపంచ బ్యాంకు నుంచి పూర్తి సహాయ సహకారాలుంటాయని హామీ ఇచ్చారు. భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ మాత్రమే కాదని, బ్రెగ్జిట్ పరిణామంలోనూ తట్టుకొని నిలబడగలనని ప్రపంచానికి తెలియజేసిందని కిమ్ చెప్పారు.
‘గొప్ప నేతలు చేయగలిగినట్టుగా మోదీ కూడా ఏదో ఒకటి చేయగలరు. లక్ష్యాలు, వాటికి గడువులను నిర్దేశించడంతోపాటు ఆ లక్ష్యాలకు సిబ్బంది కట్టుబడి ఉండేలా చేయగలగాలి. ఈ విధానమే ఫలితాలను సాధించిపెడుతుందని నిరూపితమైంది. అందుకే నేను మోదీకి పెద్ద అభిమానిని’ అని ప్రధానితో సమావేశం అనంతరం విలేకరులతో కిమ్ చెప్పారు. మోదీ ప్రయత్నాలు ఫలితాలనివ్వడం ప్రారంభమైందని, వ్యాపార నిర్వహణకు భారత్ సులభతరమంటూ ప్రపంచ బ్యాంకు నివేదికలో స్థానాన్ని మెరుగుపరుచుకుందని కిమ్ గుర్తు చేశారు. 2014లో భారత్ 54వ స్థానంలో ఉండగా... 2016లో 35వ స్థానానికి చేరుకుందని కిమ్ తెలిపారు. ‘స్వచ్ఛభారత్’ అద్భుత కార్యక్రమమని ప్రశంసించారు.