వేటు వేయాల్సిందే!
పార్టీ ఫిరాయించిన మేయర్‌పై అనర్హత వేటుకు డిమాండ్
కలెక్టర్‌కు మెమొరాండం ఇచ్చిన ఎమ్మెల్యేలు
18న ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు
అవసరమైతే కోర్టును ఆశ్రయిస్తాం
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొంది మేయర్ పీఠాన్ని అధిరోహించిన అబ్దుల్ అజీజ్ పార్టీ ఫిరాయించడంపై ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. మేయర్‌పై వెంటనే అనర్హత వేటు వేయాలని కోరుతూ గురువారం నగర, రూరల్ ఎమ్మెల్యేలు జిల్లా కలెక్టరుకు మెమొరాండం అందజేశారు. ఎన్నికల ప్రిసైడింగ్ అధికారి అయిన కలెక్టరు శ్రీకాంత్‌కు ఎమ్మెల్యేలు అనిల్‌కుమార్‌యాదవ్, కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిలతో పాటు పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్, డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకనాథ్లు మెమొరాండం అందజేశారు.
ఫ్యాన్ గుర్తుపై గెలిచిన అబ్దుల్ అజీజ్‌తో పాటు మరో 12 మంది కార్పొరేటర్లు ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరిన విషయాన్ని తెలిపారు. దీంతో వీరిపై పార్టీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు. దీనికి కలెక్టరు సానుకూలంగా స్పందించారు. కలెక్టరేట్ వెలుపల నగర ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌యాదవ్ మాట్లాడుతూ మేయరుతో పాటు 12 మంది కార్పొరేటర్లపై యాంటీ డిఫెక్షన్ లాను బనాయించి అనర్హత వేటు వేయాలని, తదుపరి ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు.
తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉంటూ కార్పొరేటర్లు, జెడ్పీటీసీలను తమ వైపునకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. పార్టీ ఫిరాయించిన కావలి మున్సిపల్ చైర్‌పర్సన్‌పై అనర్హత వేటుపడినట్లు తెలిపారు. ఎన్నికల కమిషన్‌ను కలిసి ఫిర్యాదు చేస్తామని, 20 రోజుల్లో తగిన చర్యలు తీసుకోకపోతే కోర్టును ఆశ్రయిస్తామని తెలిపారు. మోసంతో కైవసం చేసుకున్న మున్సిపాలిటీలు తిరిగి వైఎస్ఆర్సీపీకి దక్కుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఫిరాయింపునకు పాల్పడిన కార్పొరేటర్లు తాము ఎంత పెద్ద తప్పుచేశామో అని ఆవేదన చెందాల్సిన పరిస్థితి తలెత్తుతుందని అన్నారు.
ఇప్పటికైనా వారు వైఎస్ఆర్సీపీ కండువాలు కప్పుకోవాలని సూచించారు. ఎవరో ఏదో చెప్పారని, అమాయకంగా పార్టీ ఫిరాయించిన వారు తగిన మూల్యం చెల్లించాల్సి ఉంటుందన్నారు. కావలి చైర్‌పర్సన్‌పై అనర్హత వేటు వేయడాన్ని ప్రస్తావిస్తూ, నెల్లూరులో కూడా ఆ సంఘటన పునరావృతం కాకుండా ఉండాలంటే, వెళ్లిన వారు తిరిగిరావాలని సూచించారు. సోమవారం ఎన్నికల కమిషన్‌ను కలుసుకుని, ఫిర్యాదు చేయనున్నట్లు తెలిపారు.
పార్టీ జిల్లా అధ్యక్షుడు మేరిగ మురళీధర్ మాట్లాడుతూ ప్రిసైడింగ్ అధికారి తగిన చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు. త్వరలో పార్టీ ఫిరాయించిన జెడ్పీటీసీలపైన కూడా ఫిర్యాదు చేస్తామని అన్నారు. కార్పొరేటర్లలో నిబద్ధత ఉండాలని సూచించారు. దీనిపై కోర్టుకు వెళ్లడానికి కూడా సిద్ధంగా ఉన్నామన్నారు. డిప్యూటీ మేయరు ముక్కాల ద్వారకనాథ్ మాట్లాడుతూ అన్ని మునిసిపల్ స్థానాలు కూడా దక్కించుకుంటామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు రూప్‌కుమార్ యాదవ్, బొబ్బల శ్రీనివాసులు, ప్రశాంత్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.