చిన్నారిని చితకబాదిన రిటైర్డ ఉద్యోగి
హిందూపురం: చదువుకోలేదన్న నెపంతో చిన్నారిని ఓ రిటైర్డ ఆర్మీ ఉద్యోగి చితకబాదిన సంఘటన హిందూపురం పట్టణం సడ్లపల్లిలో శుక్రవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. చిన్నారి తల్లి రాధ అలియాస్ తొల్ల సంగీతకు ఐదేళ్ల చిన్నారి తారుణ్య ఉంది. ఈమె సడ్లపల్లిలోని ఓ గార్మెంట్ షాప్లో పనిచేస్తోంది. చిన్నారిని అక్కడే నివాసముంటున్న రిటైర్డ ఆర్మీ ఉద్యోగి తిప్పేస్వామి ఇంట్లో వదిలి పెట్టి వెళ్లింది. ఆ ఉద్యోగికి ఇద్దరు భార్యల విషయంలో గొడవైంది. ఈ క్రమంలో అసహనంగా ఉన్న తిప్పేస్వామి అక్కడే ఉన్న చిన్నారి చదువుకోలేదనే నెపంతో బెల్టుతో చితకబాదాడు. ఈ విషయాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేసి గాయపడిన చిన్నారి తారుణ్యను ఆసుపత్రికి తరలించారు.
ఈ విషయం తెలుసుకున్న తిప్పేస్వామి పరారయ్యాడు. ఘటనపై తారుణ్య తల్లి రాధను విచారించామని, తిప్పేస్వామి నివాసముంటున్న ప్రాంతంలోనే ఆమె కాపురముండటంతో ఘటన జరిగిందని, టూటౌన్ సీఐ మధుభూషన్ తెలిపారు. తల్లి అశ్రద్ధ కారణంగానే చిన్నారికి ఈ పరిస్థితి వచ్చిందన్నారు. తారుణ్యను ఐసీడీఎస్ అధికారులకు అప్పజెప్పారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.