prilims and mians
-
నేడు సివిల్స్ ప్రిలిమ్స్
సాక్షి, అమరావతి: ఐఏఎస్, ఐపీఎస్ తదితర ఆలిండియా సర్వీస్ పోస్టుల భర్తీకి సంబంధించిన సివిల్స్–2020 ప్రిలిమ్స్ పరీక్ష ఆదివారం (నేడు) జరగనుంది. ఉదయం 9.30 గంటల నుంచి పేపర్–1, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి పేపర్–2 ఉంటుంది. కోవిడ్ నేపథ్యంలో పరీక్షలు వాయిదా వేయాలన్న వ్యాజ్యాలను సుప్రీంకోర్టు కొట్టివేసిన నేపథ్యంలో పరీక్షలను యథావిధిగా నిర్వహించేందుకు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాట్లు చేసింది. కోవిడ్ ప్రోటోకాల్ ప్రకారం, సుప్రీంకోర్టు సూచనలను అనుసరించి పరీక్షలు నిర్వహిస్తారు. ► దేశవ్యాప్తంగా 72 పట్టణాల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నారు. రాష్ట్రంలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురంలలో మొత్తం 68 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ► దేశవ్యాప్తంగా సుమారు 8 లక్షల మంది ఈ పరీక్షకు దరఖాస్తుచేయగా ఏపీ నుంచి 30,199 మంది పరీక్ష రాసేందుకు ఆప్షన్ ఇచ్చారు. ► ఏపీలో పరీక్షల నిర్వహణకు నలుగురు సీనియర్ ఐఏఎస్ అధికారులను ప్రత్యేక పరిశీలకులుగా యూపీఎస్సీ నియమించింది. ► అభ్యర్థుల ఈ–అడ్మిట్ కార్డులను యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. ► వీటిని డౌన్లోడ్ చేసుకోవడమే కాకుండా సివిల్స్ తుది ఫలితాలు వెలువడే వరకు కూడా ఈ–అడ్మిట్ కార్డులను భద్రపరచుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ► అభ్యర్థులు పరీక్ష కేంద్రాల వద్ద ఈ–అడ్మిట్ కార్డుతో పాటు అధికారికి ఫొటో గుర్తింపుకార్డును చూపించాలి. రెండింటిలోని ఫొటోలు ఒకేమాదిరిగా ఉండాలి. ► పరీక్ష ప్రారంభానికి పది నిముషాల ముందే ప్రవేశద్వారాలను మూసివేస్తారు. ► పరీక్ష కేంద్రాల్లోకి బాల్‌పాయింట్ పెన్నును అనుమతిస్తారు. చేతి గడియారాలు, స్మార్ట్ఫోన్లు, బ్లూటూత్ ఆధారిత పరికరాలు, ఇతర డిజిటల్ పరికరాలను నిషేధించారు. ► మాస్కులు లేకుంటే పరీక్ష కేంద్రాల్లోకి అనుమతించరు. పారదర్శక సీసాల్లో శానిటైజర్‌ను అనుమతిస్తారు. -
సమాన మార్కులొస్తే... పుట్టిన తేదే కీలకం
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు నియామక బోర్డు విడుదల చేసిన పూర్తి స్థాయి నోటిఫికేషన్లో రిజర్వేషన్లు, కనీస అర్హత మార్కులు, ఇతర కీలక అంశాలను పేర్కొంది. శుక్రవారం జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఒకే రిజర్వేషన్ కేటగిరీలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ఆ అభ్యర్థుల పుట్టిన తేదీ పరిగణనలోకి తీసుకోనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎవరు ముందు పుట్టారో వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇకపోతే మూడు ప్రక్రియల్లో జరుగనున్న ఎంపిక విధానాలను స్పష్టం చేసింది. ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ టైప్ కింద 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో కనీస అర్హతను కేటగిరీల వారీగా విభజించారు. ఓసీలకు 40 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హతగా 40 శాతం మార్కులు సాధించాలి. అదేవిధంగా బీసీలు 35శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 30శాతం కనీస అర్హత మార్కులు సాధిస్తేనే తదుపరి జరిగే ఫిజికల్ మెజర్మెంట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షలకు అర్హులవుతారని పేర్కొంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ సిలబస్‌గా ఉంటుంది. అదేవిధంగా తుది పరీక్షలో సిలబస్‌గా ఇంగ్లిష్ (ఆబ్జెక్టివ్) 200 ప్రశ్నలు–100 మార్కులు, తెలుగు/ఉర్దూ (ఆబ్జెక్టివ్) 200 ప్రశ్నలు–100 మార్కులు, అర్థమెటిక్, రీజనింగ్ 200 ప్రశ్నలు–200 మార్కులు, జనరల్ స్టడీస్ 200 ప్రశ్నలు–200 మార్కులు.. మొత్తం 600 మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు. -
ఇకపై పోలీసు పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్
-
ఇకపై పోలీసు పరీక్షల్లో ప్రిలిమ్స్, మెయిన్స్
పరీక్షలూ ఆబ్జెక్టివ్ తరహాలోనే 5 కిలోమీటర్ల పరుగు రద్దు హైదరాబాద్: ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు అమల్లోకి తీసుకువచ్చిన పోలీసు ఎంపిక ప్రక్రియలో సమూల మార్పులు తీసుకు వస్తున్నారు. ఇందులో భాగంగా ఇకపై పోలీసు ఎంపిక పరీక్షల్లో స్క్రీనింగ్ టెస్ట్‌గా ఉన్న 5 కిలోమీటర్ల పరుగు పందాన్ని తొలగించాలని రాష్ట్ర స్థాయి పోలీసు రిక్రూట్మెంట్ బోర్డు నిర్ణయించింది. దీని స్థానంలో ప్రిలిమ్స్‌ను నిర్వహించనున్నారు. దీంతో పాటు అనేక కీలక సంస్కరణలతో కూడిన ఫైలు హోం శాఖ నుంచి సాధారణ పరిపాలన విభాగానికి చేరింది. వీటిపై ప్రభుత్వానికి ఉన్న సందేహాలను తీర్చడం కోసం ఎంపిక బోర్డు చైర్మన్ అతుల్ సింగ్ మంగళవారం సచివాలయంలో జీఏడీ అధికారులతో భేటీ అయ్యారు. ప్రభుత్వ ఆమోదం లభిస్తే ఇకపై జరిగే అన్ని రిక్రూట్‌మెంట్స్‌ను ఇదే తరహాలో చేపట్టనున్నారు. → రిక్రూట్మెంట్లో స్క్రీనింగ్ పరీక్షగా ఉన్న 5 కిలోమీటర్ల పరుగు అనేక విమర్శలకు తావిస్తోంది. ఇందులో పాల్గొన్న అనేక మంది అభ్యర్థులు గాయపడటం, మరణించడం వంటి అపశ్రుతులు చోటు చేసుకున్నారు. వీటిని పరిగణలోకి తీసుకున్న అధికారులు దీన్ని పూర్తిగా తొలగించాలని నిర్ణయించారు. → ఆబ్జెక్టివ్ తరహాలో ఉండే ప్రిలిమ్స్‌ను స్క్రీనింగ్ పరీక్షగా నిర్వహించిన తర్వాత దేహదారుఢ్య పరీక్షలతో పాటు ఈవెంట్స్ నిర్వహిస్తారు. వీటిలో క్వాలిఫై అయిన వారికి మెయిన్స్ పరీక్ష పెడతారు. ప్రిలిమ్స్, మెయిన్స్ రెండూ ఆబ్జెక్టివ్ తరహాలోనే ఉంటాయి. → కేంద్ర ప్రభుత్వం అమల్లోకి తీసుకు వచ్చిన విధానంతో పాటు రాష్ట్రంలో నెలకొన్న మహిళా అధికారిణుల కొరత నేపథ్యంలో ఇకపై జరిగే పోలీసు రిక్రూట్మెంట్స్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కచ్చితంగా అమలు చేయాలని, ఎంపిక విధానంలోనూ మహిళలకు కొన్ని వెసులుబాట్లు ఇవ్వాలని నిర్ణయించారు. → కేవలం శరీర దారుఢ్యమే కాకుండా మానసిక పరిపక్వత, సమస్యల్లో స్పందించే గుణాలను బేరీజు వేసేలా ఎంపిక ప్రక్రియను మారుస్తున్నారు. ఇటీవల కాలంలో ప్రాచుర్యంలోకి వచ్చిన మానవహక్కులు, మహిళల రక్షణ తదితరాలకు రాతపరీక్షల్లో ప్రాధాన్యం ఇవ్వనున్నారు. సిలబస్‌లో పెద్దగా మార్పులు లేకుండా ఎంపిక విధానాల్లోనే మార్పులు ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. → ఫిజికల్ ఈవెంట్స్‌గా పిలిచే 100 మీటర్లు, 800 మీటర్ల పరుగు, హైజంప్, లాంగ్ జంప్ వంటి పరీక్షల్లోనూ పలు మార్పుచేర్పులు చేయనున్నారు. వీటిలో కొన్నింటిని తొలగించడంతో పాటు మరికొన్ని పరిధి తగ్గించాలని యోచిస్తున్నారు. → ఈ పరీక్షల్లో మానవ ప్రమేయం తగ్గించడం కోసం ఆర్ఎఫ్ఐడీ తరహా టెక్నాలజీలు వాడాలని నిర్ణయించారు. పరుగు మొదలు ప్రతి అంశాన్నీ సాంకేతికంగానే పరిశీలించి క్వాలిఫై అయ్యారా? లేదా? అనేది నిర్థారించనున్నారు. → టెక్నికల్ విభాగాలుగా పిలిచే పోలీసు కమ్యూనికేషన్స్, రవాణా విభాగం, వేలి ముద్రల విభాగాల్లో ఎంపిక ప్రక్రియను సాధారణ, ఆర్డ్మ్ రిజర్వ్ విభాగాల ఎంపిక ప్రక్రియలకు పూర్తి భిన్నంగా డిజైన్ చేస్తున్నారు. ఆయా టెక్నికల్ అంశాల్లో అభ్యర్థులకు ఉన్న సాంకేతిక అర్హతలు, సమకాలీన అంశాలపై ఉన్న పట్టును బేరీజు వేసేలా ఈ విభాగాల ఎంపిక ప్రక్రియ ఉండనుంది. → పోలీసు విభాగంలో డ్రైవర్‌గా ఎంపిక కావడానికి ప్రస్తుతం అభ్యర్థి లెసైన్స్ కలిగి ఉన్నా, లేకపోయినా వయోపరిమితి మాత్రం 18 నుంచి 21 ఏళ్ళుగా ఉంది. దీన్ని సవరించి 21 నుంచి 25 ఏళ్లకు మార్చుతున్నారు.