
సాక్షి, హైదరాబాద్: పోలీస్ ఉద్యోగాలకు నియామక బోర్డు విడుదల చేసిన పూర్తి స్థాయి నోటిఫికేషన్‌లో రిజర్వేషన్లు, కనీస అర్హత మార్కులు, ఇతర కీలక అంశాలను పేర్కొంది. శుక్రవారం జారీ అయిన నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్, మెయిన్స్ పరీక్షల్లో ఒకే రిజర్వేషన్ కేటగిరీలో ఇద్దరు లేదా అంత కంటే ఎక్కువ మందికి సమాన మార్కులు వస్తే ఆ అభ్యర్థుల పుట్టిన తేదీ పరిగణనలోకి తీసుకోనున్నట్టు వెల్లడించింది. ఈ మేరకు ఎవరు ముందు పుట్టారో వారికి ప్రాధాన్యత ఉంటుందని తెలిపింది. ఇకపోతే మూడు ప్రక్రియల్లో జరుగనున్న ఎంపిక విధానాలను స్పష్టం చేసింది. ముందుగా ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించనున్నారు. ఆబ్జెక్టివ్ టైప్ కింద 200 మార్కులకు ప్రశ్నపత్రం ఉంటుంది. ఇందులో కనీస అర్హతను కేటగిరీల వారీగా విభజించారు.
ఓసీలకు 40 శాతం.. ఎస్సీ, ఎస్టీలకు 30 శాతం
ఓపెన్ కేటగిరీ అభ్యర్థులు కనీస అర్హతగా 40 శాతం మార్కులు సాధించాలి. అదేవిధంగా బీసీలు 35శాతం, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులు 30శాతం కనీస అర్హత మార్కులు సాధిస్తేనే తదుపరి జరిగే ఫిజికల్ మెజర్‌మెంట్, ఫిజికల్ ఎఫిషియెన్సీ పరీక్షలకు అర్హులవుతారని పేర్కొంది. ప్రిలిమ్స్ పరీక్షకు అర్థమెటిక్, రీజనింగ్/మెంటల్ ఎబిలిటీ, జనరల్ స్టడీస్ సిలబస్‌గా ఉంటుంది.
అదేవిధంగా తుది పరీక్షలో సిలబస్‌గా ఇంగ్లిష్ (ఆబ్జెక్టివ్) 200 ప్రశ్నలు–100 మార్కులు, తెలుగు/ఉర్దూ (ఆబ్జెక్టివ్) 200 ప్రశ్నలు–100 మార్కులు, అర్థమెటిక్, రీజనింగ్ 200 ప్రశ్నలు–200 మార్కులు, జనరల్ స్టడీస్ 200 ప్రశ్నలు–200 మార్కులు.. మొత్తం 600 మార్కుల్లో మెరిట్ ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment