‘జన్ ధన్’లో 74 శాతం అకౌంట్లు జీరో బ్యాలెన్స్
న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన కింద నవంబర్ 7వ తేదీ నాటికి 7.1 కోట్ల అకౌంట్లు ప్రారంభమయ్యాయి. ఈ అకౌంట్లను మొత్తంగా చూస్తే దాదాపు రూ.5,400 కోట్లు డిపాజిట్ అయ్యాయి. అయితే వేర్వేరుగా అకౌంట్లను చూస్తే 74 శాతం (దాదాపు 5.3 కోట్లు) జీరో బ్యాలెన్స్‌తోనే ఉన్నాయి. సామాజిక కార్యకర్త సుభాష్ అగర్వాల్ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దాఖలు చేసిన ఒక పిటిషన్‌కు సమాధానంగా ఆర్థిక సేవల శాఖ ఈ వివరాలను అందజేసింది.
గ్రామీణ ప్రాంతాల్లో 4.2 కోట్లకుపైగా అకౌంట్లు ప్రారంభమయ్యాయి. పట్టణ ప్రాంతాల్లో ఈ సంఖ్య 2.9 కోట్లు. 1.2 కోట్ల అకౌంట్లతో ఎస్బీఐ మొదటి స్థానంలో ఉంది. తరువాతి స్థానంలో బ్యాంక్ ఆఫ్ బరోడా (38 లక్షలు), కెనరాబ్యాంక్ (37 లక్షలు) ఉన్నాయి. అకౌంట్ ప్రారంభం వల్ల పలు ప్రయోజనాలతోపాటు, 6 నెలలు సంతృప్తికరంగా అకౌంట్ నిర్వహిస్తే రూ.5,000 ఓవర్‌డ్రాఫ్ట్ సదుపాయం కూడా కల్పిస్తున్న సంగతి తెలిసిందే.