కార్పొరేట్ కాలేజీలో ప్రిన్సిపల్ వీరంగం
విజయవాడ : విజయవాడలోని ఓ కార్పొరేట్ కళాశాల ప్రిన్సిపల్ వీరంగం సృష్టించాడు. దాంతో ఎంసెట్ పరీక్ష రాయాల్సిన విద్యార్థులు ఆస్పత్రి పాలయ్యారు. వివరాల్లోకి వెళితేపెనమలూరు తాడిగడపలోని ఓ కళాశాలలో విద్యార్థులను గదిలో బంధించి ఐరన్ రాడ్తో విద్యార్థులను చితకబాదాడు. ఈ ఘటనలో సుమారు 20మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు.
స్టడీ అవర్లో అరగంట ముందే నిద్ర పోయారనే నెపంతో ప్రిన్సిపల్ ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. విద్యార్థుల కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాంతో నేడు జరగనున్న ఎంసెట్ ప్రవేశ పరీక్షకు విద్యార్థులు హాజరు కాలేని స్థితిలో ఉన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు ప్రిన్సిపల్ దుశ్చర్యపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.