‘అదానీ ఫౌండేషన్..ప్రీతి అదానీ’ ఈ విషయాలు తెలుసా?
సాక్షి,ముంబై: భారతదేశంలో అత్యంత ధనవంతుడు, ప్రపంచంలో మూడవ బిలియనీర్ అదానీ గ్రూప్ చైర్మన్, గౌతమ్ అదానీ అని మనందరికి తెలిసిందే. వ్యాపారవేత్తగా గౌతమ్ అదానీ వివిధ వ్యాపారాల్లో దూకుడు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. 1988లో అదానీ గ్రూప్‌ను స్థాపించిన గౌతమ్ అదానీ ప్రస్తుతం నికర విలువ 12,780 కోట్ల డాలర్లు. కానీ అదానీ ఫౌండేషన్ ఫౌండర్ బిలియనీర్ గౌతమ్ అదానీ భార్య ప్రీతి అదానీ అంటే నమ్ముతారా? ఒక బిలియన్ డాలర్ల నెట్‌వర్త్‌తో ఫౌండేషన్ ద్వారా అనేక దాతృత్వ కార్యక్రమాలతో విజయవంతమైన బిజినెస్ ఉమెన్‌గా ఖ్యాతి గడించారు ప్రీతి. అదానీ కుటుంబం, ఆయన భార్య పిల్లలు లైమ్‌లైట్‌లో ఉండటానికి పెద్దగా ఇష్టపడరట. అందుకే వారి గురించి తెలిసింది చాలా తక్కువే అని చెప్పాలి.
గౌతం, ప్రీతి అదానీ దంపతులకు ఇద్దరు కుమారులు కరణ్, జీత్. ఇక గౌతం అదానీ భార్య ప్రీతి అదానీ విశేషాల గురించి మాట్లాడుకుంటే
డాక్టర్ ప్రీతి అదానీ
ప్రీతి అదానీ 1965లో ముంబైలో జన్మించారు. అహ్మదాబాద్‌లోని ప్రభుత్వ డెంటల్ కాలేజీ నుండి డెంటల్ సర్జరీలో గ్రాడ్యుయేషన్ చేశారు. డెంటల్ డాక్టర్‌గా కరియర్ ప్రారంభించారు. ఆ తరువాత గౌతం అదానీతో వివాహం. 1996లో అదానీ ఫౌండేషన్ అధ్యక్షురాలయ్యారు.
డాక్టర్ ప్రీతి అదానీ- విద్యావేత్త
గుజరాత్లో అక్షరాస్యత రేటును పెంచే లక్ష్యంతో ప్రీతి అదానీ అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. ఆమె నాయకత్వంలో, అదానీ గ్రూప్ CSR (కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ) బడ్జెట్ రూ. 2018-19లో 128 కోట్లు.
అదానీ ఫౌండేషన్
అదానీ ఫౌండేషన్‌ను 1996లో ప్రీతి అదానీ స్థాపించారు. అదానీ ఫౌండేషన్ ప్రారంభించే సమయంలో కేవలం ఇద్దరు సభ్యులు మాత్రమే ఉన్నారు. అయితే అదానీ ఫౌండేషన్ ఇప్పుడు దేశంలోని 18 రాష్ట్రాల్లో విస్తరించి ఉంది. ప్రీతి అదానీ నిరుపేద ప్రజల కోసం దాతృత్వ కార్యక్రమాలలో తన సమయాన్ని వెచ్చిస్తారు. ఆరోగ్యవంతమైన ఆహారంకోసం కిచెన్ గార్డెన్ కార్యక్రమాలను ప్రమోట్ చేయాలంటారు ప్రీతి.