ప్రభుత్వ రంగ బ్యాంక్ చీఫ్లుగా ‘ప్రైవేటు’ ఎగ్జిక్యూటివ్‌లు!
న్యూఢిల్లీ: ఐదు ప్రభుత్వ రంగ బ్యాంకుల మేనేజింగ్ డెరైక్టర్, సీఈఓల ఎంపికకు ఆర్థిక మంత్రిత్వశాఖ దరఖాస్తులను ఆహ్వానించింది. ఈ బ్యాంకుల్లో పంజాబ్ నేషనల్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, కెనరా బ్యాంక్, ఐడీబీఐ బ్యాంక్‌లు ఉన్నాయి. మూడు సంవత్సరాల నిర్దిష్ట కాలపరిమితికి ఈ దరఖాస్తులను ఆహ్వానించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. రెగ్యులర్ పబ్లిక్ సెక్టార్ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు ప్రైవేటు బ్యాంకర్లూ ఈ పోస్టులకు దరఖాస్తులు చేసుకోవచ్చు.
ఇలాంటి నిర్ణయం తీసుకోవడం (ప్రైవేటు బ్యాంకర్ల నుంచీ దరఖాస్తుల ఆహ్వానం) ప్రభుత్వ బ్యాంకింగ్ చరిత్రలోనే ఇదే తొలిసారి. మార్చి 21వ తేదీ లోపు దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అప్లికేషన్లు పెట్టుకునే వారు కనీసం 15 సంవత్సరాలు బ్యాంకింగ్ రంగంలో పనిచేసిఉండాలి. బోర్డ్ స్థాయిలో మూడేళ్లు పనిచేసి ఉండాలి. ప్రకటన తేదీ నాటికి 45-55 మధ్య వయసు వారై ఉండాలి.