Private Sector Employees
-
ఫెడరల్ బ్యాంక్ లాభం 52% అప్
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో ప్రైవేట్ రంగ ఫెడరల్ బ్యాంక్ నికర లాభం 52 శాతం (స్టాండెలోన్ ప్రాతిపదికన) పెరిగింది. వడ్డీ రాబడి, ఇతర ఆదాయాలు మెరుగుపడటంతో రూ.704 కోట్లకు చేరింది. గత క్యూ2లో ఇది రూ. 460 కోట్లు. మరోవైపు, ఆదాయం రూ. 3,871 కోట్ల నుంచి రూ. 4,630 కోట్లకు చేరింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన లాభం 50 శాతం పెరిగి రూ. 733 కోట్లకు చేరింది. లాభాలపరంగా చూస్తే బ్యాంకు చరిత్రలోనే ఇది అత్యుత్తమ త్రైమాసికమని సంస్థ ఎండీ శ్యామ్ శ్రీనివాసన్ తెలిపారు. ప్రొవిజన్ కవరేజీ నిష్పత్తి (పీసీఆర్)కి సంబంధించి కేటాయింపులు భారీగా పెంచినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించగలిగామని ఆయన పేర్కొన్నారు. సమీక్షాకాలంలో మొత్తం కేటాయింపులు 12.6 శాతం పెరిగి రూ. 506 కోట్లకు చేరాయి. నికర వడ్డీ ఆదాయం 19.1 శాతం పెరిగి రూ. 1,762 కోట్లుగా నమోదైంది. నికర వడ్డీ మార్జిన్ (నిమ్) 0.10 శాతం పెరిగి 3.30 శాతానికి చేరింది. ఈ ఆర్థిక సంవత్సరంలో నిమ్ 3.27–3.35 శాతంగా ఉండొచ్చని అంచనా వేస్తున్నట్లు శ్రీనివాసన్ తెలిపారు. రుణ వృద్ధిని బట్టి 2023లో అదనపు మూలధనాన్ని సమీకరించుకునే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. ఇక ఇతర ఆదాయం రూ. 492 కోట్ల నుంచి రూ. 610 కోట్లకు పెరిగింది. స్థూల నిరర్థక ఆస్తుల నిష్పత్తి 3.24 శాతం నుంచి 2.46 శాతానికి దిగి వచ్చింది. -
ప్రైవేటు ఉద్యోగులకు తీపి కబురు
న్యూఢిల్లీ: ప్రయివేటు ఉద్యోగులకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. పదవీవిరమణ పొందిన ఉద్యోగులకు చెల్లించాల్సిన గ్రాట్యుటీ పై భారీ పన్ను మినహాయింపును ఇవ్వనుంది. ఇక మీదట ప్రయివేటు ఉద్యోగస్తుల పన్నురహిత గ్రాట్యుయిటీ ఉపసంహరణ పరిమితిని రెట్టింపు చేసింది. తాజానిర్ణయం ప్రకారం త్వరలోనే రూ. 20లక్షల గ్రాట్యుటీ ఉపసంహరణపై పన్నును రద్దు చేయనుంది. ఈ మేరకు గ్రాట్యుటీ చట్టాన్ని సవరించడానికి సంసిద్ధతను వ్యక్తం చేసింది. కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులతో సమానంగా ఈ పరిమితిని రూ. 20లక్షలకు పెంచింది. కార్మిక మంత్రిత్వ శాఖ, కార్మిక సంఘాలు, యజమాను సంస్థలు మధ్య జరిగిన ఒక త్రైపాక్షిక సమావేశంలో ఈ అంశంపై ఏకాభిప్రాయాన్ని సాధించారు. ఈ మేరకు పేమెంట్ ఆఫ్ గ్రాట్యుయిటీ యాక్ట్ సవరణ బిల్లును పార్లమెంటు బడ్జెట్ సమావేశాల ద్వితీయార్థంలో ప్రవేశపెట్టేందుకు నిర్ణయించారు. అయితే అయిదు సంవత్సరాల కనీస సర్వీసు , కనీసం 10మంది ఉద్యోగుల నిబంధనను కూడా తొలగించాలని ఉద్యోగ సంఘాలుడిమాండ్ చేశాయి. ప్రస్తుతం అయిదేళ్ళ ఉపాధి తరువాత పన్ను రహిత గ్రాట్యుయిటీ పరిమితి 10లక్షల వరకు మాత్రమే. సాధారణంగా కనీసం అయిదు సం.రాల సర్వీసు న్న ఉద్యోగ విరమణ సమయానికి ఉద్యోగి వేతనం ఆధారంగా దీన్ని నిర్ణయిస్తారు. జీతం, సర్వీసు సంవత్సరాలతో గుణించి లెక్కకడతారు. ఉదాహరణకు ఒక వ్యక్తి తన సేవ చివరలో రూ .20 లక్షల గ్రాట్యుటీ ఉపసంహరించుకోవాలంటే ..10 సంవత్సరాల అనుభవంతో .. అతని లేదా ఆమె ఒక నెల జీతం( మూలవేతనంలో + డీఏ) రూ 3.5 లక్షల కంటే ఎక్కువ వుండాలి. ఈ నేపథ్యంలోనే ఈ చర్య ప్రభుత్వ పన్ను వసూళ్లపై పెద్దగా ప్రభావం చూపదని నిపుణులు చెబుతున్నారు. ఎందుకంటే రూ .20 లక్షల పారితోషికం అందుకునేంత అధిక జీతాలున్న వ్యక్తులు చాలా పరిమితమని పేర్కొన్నారు. అలాగే భారతదేశం లో 10 లక్షల ఆదాయాన్ని ప్రకటించిన వారు మాత్రమే 24 లక్షల మందికాగా, రూ. 50 లక్షల కు పైన ఆదాయాన్ని ప్రకటించిన వారు 1.72 లక్షల మంది మాత్రమే. కాగా 7వ వేతన సంఘం సిఫారసుల మేరకు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పన్నురహిత గ్రాట్యుటీ ఉపసంహరణ ను 20 లక్షలుగా ప్రభుత్వం నిర్ణయించింది. 1997 లో, గ్రాట్యుటీ పన్ను ఉపశమనం 2.5 లక్షల నుంచి రూ 3.5 లక్షల రూపాయల కి పెంచారు. ఆ తరువాత 2010 లో ఈ పరిమితిని రూ .10 లక్షలుగా నిర్ణయించారు. -
ఉద్యోగులకు శుభవార్త!
♦ పెయిడ్స్ లీవ్స్ కోసం పని దినాలు తగ్గించిన ప్రభత్వుం ♦ 240 నుంచి 90 రోజులకు తగ్గిస్తూ నిర్ణయం ♦ వెల్లడించిన కార్మిక శాఖ ముంబై : రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు రంగ ఉద్యోగులకు శుభవార ్త. పెయిడ్ లీవ్స్ కోసం పని దినాలను 240 నుంచి 90 రోజులకు తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను 1948 ఫ్యాక్టరీల చట్టాన్ని సవరించింది. ఈ మేరకు కార్మిక శాఖకు చెందిన అధికారులు ఆదివారం వెల్లడించారు. రాత్రి వేళల్లో మహిళలు పని చేసేందుకు ప్రభుత్వం ఇప్పటికే అంగీకరించింది. ప్రస్తుతం ఫ్యాక్టరీల చట్టం ప్రకారం మహిళలకు సాయంత్రం 7 నుంచి ఉదయం 6 వరకు పని చేయకూడదు. మరోవైపు వ్యాపారాన్ని సులభతరం చేయడానికి ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోందని కార్మిక శాఖ అధికారులు అంటున్నారు. వారంలో అన్ని రోజులు షాపులు తెరిచి ఉంచేందుకు ప్రభుత్వం 1948 ‘షాప్స్ అండ్ ఎస్టాబ్లిష్మెంట్’ చట్టంలో మార్పులు చేసిందని, అయితే ప్రతి ఉద్యోగికి ఒక రోజు సెలవు తప్పనిసరి అని అధికారులు చెబుతున్నారు. ఈ నిర్ణయం వల్ల ఎక్కువ మందిని షాపు యజమానులు నియమించుకుంటారని, ఎక్కువ వ్యాపారం జరుగుతుందని అంటున్నారు. వారంలో అన్ని రోజులు తెరిచి ఉంచేందుకు దుకాణాలు లెసైన్సు పొందాల్సి ఉంటుందని, ఇందుకోసం ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని అన్నారు. దీనికోసం ప్రభుత్వం ఒక తీర్మానం చేసిందని వెల్లడించారు. వారం రోజుల్లో ప్రభుత్వం లెసైన్సు మంజూరు చేయకపోతే డబ్బులు చెల్లించిన రసీదును లెసైన్సుగా పరిగణిస్తామన్నారు. కాగా, వారం రోజులు షాపులు తెరిచి ఉంచడానికి కాంట్రాక్టు లెసైన్సు కూడా అవసరమన్నారు. దరఖాస్తు చేసుకున్న వారంలోపు ఈ లెసైన్సు అందకపోతే ప్రభుత్వానికి చెల్లించిన డబ్బులకు సంబంధించిన రసీదును లెసైన్సుగా పరిగణిస్తామన్నారు. బాయిలర్లకు స్వీయ ధ్రువీకరణ బాయిలర్లు, ఎకనమైసర్లకు స్వీయ ధ్రువీకరణ పథకాన్ని కూడా ప్రారంభించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేస్తోందని కార్మికశాఖ అధికారులు అన్నారు. ఫ్యాక్టరీలలో యంత్రాల తయారీకి స్టీమ్ బాయిలర్లు అవసరమని, బాయిలర్లను ఏడాదికొకసారి, ఎకనమైజర్లను రెండేళ్లకొకసారి పర్యవేక్షించాల్సి ఉంటుందన్నారు. ఇంతకు ముందు వార్షిక తనిఖీ కోసం ఫ్యాక్టరీలు ప్రభుత్వానికి దరఖాస్తు చేసుకోవాల్సి ఉండేద న్నారు. 1000 చ దరపు మీటర్ల కంటే ఎక్కువ వైశాల్యం ఉన్న కంపెనీలు ప్రస్తుతం బాయిలర్ పనులకు సంబంధించి ఇంజినీర్లను నియమించుకుంటున్నాయని, వీరు స్వీయ ధ్రువీకరణ, వార్షిక తనిఖీ చేసి కార్మిక శాఖకు నివేదిక అందిస్తారని తెలిపారు. -
ఆ ఒక్కరోజు... అందరికీ పరీక్షే
►సమగ్ర ఇంటింటి సర్వేపై సర్వత్రా చర్చ ►కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉండాలన్న నిబంధనతో ఆందోళన ►వలస జీవులకు తప్పని కష్టాలు ►సెలవు లేక కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఊగిసలాట ►ఆస్పత్రుల్లో ఉన్నవారు... ►అత్యవసర పనులపై వెళ్లిన వారికీ తిప్పలే! మెదక్: మెతుకుసీమలోని ఏ పల్లెలో చూసినా...ఈనెల 19న నిర్వహించ నున్న సమగ్ర ఇంటింటి సర్వేపై చర్చ కొనసాగుతోంది. ఆ ఒక్క రోజు ఇంట్లోని సభ్యులంతా అందుబాటులో ఉండాలన్న నిబంధన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పురిటిగడ్డలో బుక్కెడు బువ్వ దొరక్క..కన్న వారిని పోషించుకోలేక..బతుకు భారమై వలస బాట పట్టిన నిరుపేదలు..ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు..సెలవులేని కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు.. చిరు ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్లిన శ్రమ జీవుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించాలని...ఎక్కడివారు అక్కడే ప్రయోజనాలు పొందాలన్న లక్ష్యంతో రూపొందించిన మహా సర్వే లక్ష్యం అభినందనీయమే అయినప్పటికీ ఇంట్లోని సభ్యులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటివద్దే ఉండాలన్న షరతు మాత్రం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అదికూడా ఒకేరోజు సర్వే నిర్వహిస్తామని, ఆపై అవకాశం లేదని తేల్చి చెప్పడంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు. వలసపోతే..లెక్కలో లేనట్టేనా? గత కొన్నేళ్లుగా ఆశించిన వర్షాలు లేక కొంతమంది...పిల్లల పెళ్లిళ్లకు..ఇళ్ల నిర్మాణాలకు చేసిన అప్పులు తీర్చే మార్గంలేక పల్లెల్లో చాలా మంది పట్టణాలకు వలసబాట పట్టారు. మెదక్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 30,33, 288 మంది జనాభా ఉన్నారు. కనీసం ఇందులో 5 నుంచి 10 శాతం మంది వలసలు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల మగ్గాలు మూలన పడటంతో దుబ్బాక, పాపన్నపేట, పెద్దశంకరంపేట, కొల్చారం, నారాయణ్‌ఖేడ్, తదితర మండలాలకు చెందిన చేనేత కార్మికులు చాలా మంది గుజరాత్, మహారాష్ట్రాలకు వలసలు వెళ్లారు. అలాగే పంటలు పండక ఆర్థికంగా చితికిపోయిన రైతులు కూలీలుగా మారి నిజామాబాద్ జిల్లాలోని గోదూర్, వర్ని, బోధన్ మండలాలకు వందల సంఖ్యలో తరలివెళ్లారు. సిద్దిపేట, మెదక్ మండలం బూర్గుపల్లి, వాడి, రామాయంపేట, పాపన్నపేట తదితర మండలాల నుండి నిరుపేదలు కుటుంబ పోషణకోసం పిల్లా పాపలను వదిలి దుబాయ్, మస్కట్‌లాంటి గల్ప్ దేశాలకు వలసలు వెళ్లారు. అయితే సమగ్ర ఇంటింటి సర్వే ప్రొఫార్మాలో సుమారు 95 కాలమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పెద్దతోపాటు సభ్యులంతా తప్పసరిగా ఇంటి వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఊరికి రావాలంటే అనేక ఇబ్బందులున్నాయన్నంటూ వారి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అత్యవసరస్థితిలో ఉన్నవారి పరిస్థితి ఏమిటీ? వందలాది మంది అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఏమిటని వారి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే మీడియా లాంటి సంస్థల్లో, అత్యవసర వైద్య శాఖ, అగ్నిమాపకశాఖ, 108, 104 సంస్థల్లో పనిచేస్తున్న వారికి సెలవు దొరకడం కష్టం. ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు. ఈనెల 19న నిర్వహించబోయే సర్వే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ , కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు సెలవు ప్రకటించలేదు. దీంతో పోస్టాఫీస్, రైల్వే తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గల్ప్ దేశాల్లో ఉన్నవారు ఒక్కరోజు సర్వే కోసం సొంత గ్రామాలకు రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు. అసలు ఒక్కరోజే ఎందుకు? ఒకేరోజు రాష్ట్రమంతా ఒకేసారి సర్వే నిర్వహించడం ద్వారా బోగస్ నమోదులను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో నిర్వహించిన సర్వేలో ఒక్కో వ్యక్తి రెండు, మూడు చోట్ల తమ పేర్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది కొంత వరకు నిజమే అయినప్పటికీ ప్రజల పరిస్థితిని కూడా సర్కార్ అర్థం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. సర్వేను కనీసం వారం రోజులపాటు కొనసాగించాలంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.