ఆ ఒక్కరోజు... అందరికీ పరీక్షే
►సమగ్ర ఇంటింటి సర్వేపై సర్వత్రా చర్చ
►కుటుంబసభ్యులంతా ఇంట్లో ఉండాలన్న నిబంధనతో ఆందోళన
►వలస జీవులకు తప్పని కష్టాలు
►సెలవు లేక కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగుల ఊగిసలాట
►ఆస్పత్రుల్లో ఉన్నవారు...
►అత్యవసర పనులపై వెళ్లిన వారికీ తిప్పలే!
మెదక్: మెతుకుసీమలోని ఏ పల్లెలో చూసినా...ఈనెల 19న నిర్వహించ నున్న సమగ్ర ఇంటింటి సర్వేపై చర్చ కొనసాగుతోంది. ఆ ఒక్క రోజు ఇంట్లోని సభ్యులంతా అందుబాటులో ఉండాలన్న నిబంధన ప్రజలను ఆందోళనకు గురి చేస్తోంది. పురిటిగడ్డలో బుక్కెడు బువ్వ దొరక్క..కన్న వారిని పోషించుకోలేక..బతుకు భారమై వలస బాట పట్టిన నిరుపేదలు..ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నవారు..సెలవులేని కేంద్ర ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగులు.. చిరు ఉద్యోగాల కోసం ఇతర దేశాలు వెళ్లిన శ్రమ జీవుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది.
ప్రభుత్వ సంక్షేమ పథకాలు దుర్వినియోగం కాకుండా అర్హులైన లబ్ధిదారులకు అందించాలని...ఎక్కడివారు అక్కడే ప్రయోజనాలు పొందాలన్న లక్ష్యంతో రూపొందించిన మహా సర్వే లక్ష్యం అభినందనీయమే అయినప్పటికీ ఇంట్లోని సభ్యులంతా ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంటివద్దే ఉండాలన్న షరతు మాత్రం ప్రజలను కలవరపాటుకు గురిచేస్తోంది. అదికూడా ఒకేరోజు సర్వే నిర్వహిస్తామని, ఆపై అవకాశం లేదని తేల్చి చెప్పడంతో చాలా మంది ఆందోళనకు గురవుతున్నారు.
వలసపోతే..లెక్కలో లేనట్టేనా?
గత కొన్నేళ్లుగా ఆశించిన వర్షాలు లేక కొంతమంది...పిల్లల పెళ్లిళ్లకు..ఇళ్ల నిర్మాణాలకు చేసిన అప్పులు తీర్చే మార్గంలేక పల్లెల్లో చాలా మంది పట్టణాలకు వలసబాట పట్టారు. మెదక్ జిల్లాలో 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం 30,33, 288 మంది జనాభా ఉన్నారు. కనీసం ఇందులో 5 నుంచి 10 శాతం మంది వలసలు, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాల్లో తాత్కాలిక ఆవాసాలు ఏర్పాటు చేసుకున్నారు. ముఖ్యంగా చేనేత కార్మికుల మగ్గాలు మూలన పడటంతో దుబ్బాక, పాపన్నపేట, పెద్దశంకరంపేట, కొల్చారం, నారాయణ్‌ఖేడ్, తదితర మండలాలకు చెందిన చేనేత కార్మికులు చాలా మంది గుజరాత్, మహారాష్ట్రాలకు వలసలు వెళ్లారు.
అలాగే పంటలు పండక ఆర్థికంగా చితికిపోయిన రైతులు కూలీలుగా మారి నిజామాబాద్ జిల్లాలోని గోదూర్, వర్ని, బోధన్ మండలాలకు వందల సంఖ్యలో తరలివెళ్లారు. సిద్దిపేట, మెదక్ మండలం బూర్గుపల్లి, వాడి, రామాయంపేట, పాపన్నపేట తదితర మండలాల నుండి నిరుపేదలు కుటుంబ పోషణకోసం పిల్లా పాపలను వదిలి దుబాయ్, మస్కట్‌లాంటి గల్ప్ దేశాలకు వలసలు వెళ్లారు. అయితే సమగ్ర ఇంటింటి సర్వే ప్రొఫార్మాలో సుమారు 95 కాలమ్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఇంటి పెద్దతోపాటు సభ్యులంతా తప్పసరిగా ఇంటి వద్దనే ఉండాలని అధికారులు చెబుతున్నారు. దీంతో దూర ప్రాంతాల్లో ఉన్నవారు సొంత ఊరికి రావాలంటే అనేక ఇబ్బందులున్నాయన్నంటూ వారి కుటుంబీకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అత్యవసరస్థితిలో ఉన్నవారి పరిస్థితి ఏమిటీ?
వందలాది మంది అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. వారి పరిస్థితి ఏమిటని వారి కుటుంబీకులు ప్రశ్నిస్తున్నారు. అలాగే మీడియా లాంటి సంస్థల్లో, అత్యవసర వైద్య శాఖ, అగ్నిమాపకశాఖ, 108, 104 సంస్థల్లో పనిచేస్తున్న వారికి సెలవు దొరకడం కష్టం. ఇక కేంద్ర ప్రభుత్వానికి చెందిన సంస్థల్లో కూడా చాలా మంది పనిచేస్తున్నారు. ఈనెల 19న నిర్వహించబోయే సర్వే నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించినప్పటికీ , కేంద్ర ప్రభుత్వం ఇంత వరకు సెలవు ప్రకటించలేదు. దీంతో పోస్టాఫీస్, రైల్వే తదితర సంస్థల్లో పనిచేస్తున్న వారు తమ సంగతేంటని ప్రశ్నిస్తున్నారు. గల్ప్ దేశాల్లో ఉన్నవారు ఒక్కరోజు సర్వే కోసం సొంత గ్రామాలకు రావాలంటే సాధ్యమయ్యే పరిస్థితి కాదు.
అసలు ఒక్కరోజే ఎందుకు?
ఒకేరోజు రాష్ట్రమంతా ఒకేసారి సర్వే నిర్వహించడం ద్వారా బోగస్ నమోదులను అరికట్టవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. గతంలో నిర్వహించిన సర్వేలో ఒక్కో వ్యక్తి రెండు, మూడు చోట్ల తమ పేర్లు నమోదు చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఇది కొంత వరకు నిజమే అయినప్పటికీ ప్రజల పరిస్థితిని కూడా సర్కార్ అర్థం చేసుకోవాలని పలువురు కోరుతున్నారు. సర్వేను కనీసం వారం రోజులపాటు కొనసాగించాలంటున్నారు. అవకతవకలకు ఆస్కారం లేకుండా అందుబాటులో ఉన్న సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.