private travells
-
ఊరికి పోతే... జేబుకు వాతే!
సాక్షి హైదరాబాద్: ఏటా అదే తంతు. అదే దోపిడీ. పండగొచ్చిందంటే చాలు ప్రయాణికుల జేబులు లూటీ. కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన వందలాది బస్సులు, టూరిస్ట్ క్యాబ్‌లు, మ్యాక్సీ క్యాబ్‌లు, మినీ బస్సులు సంక్రాంతి దోపిడీకి రంగం సిద్ధం చేసుకున్నాయి. డిమాండ్‌కు తగినన్ని రైళ్లు అందుబాటులో లేకపోవడంతో నగర వాసులు ప్రైవేట్ వాహనాలను ఆశ్రయించాల్సివస్తోంది. దీంతో ప్రైవేట్ ట్రావెల్స్ చార్జీలను అమాంతంగా పెంచేసి ‘పండగ’ చేసుకుంటున్నాయి. హైదరాబాద్ నుంచి విజయవాడకు సాధారణ రోజుల్లో రూ.350 వరకు చార్జీ ఉంటే సంక్రాంతి సందర్భంగా రూ.600 నుంచి రూ.700కు పెంచారు. చార్జీలను పెంచొద్దంటూ ఆర్టీఏ అధికారులు సూచిస్తున్నప్పటికీ అమలుకు నోచుకోవడం లేదు. మరోవైపు కాంట్రాక్ట్ క్యారేజీలుగా నమోదైన బస్సులన్నీ స్టేజీ క్యారేజీలుగా తిరుగుతున్నాయి. ఆన్లైన్లో ప్రయాణికులకు టిక్కెట్ బుకింగ్ సదుపాయం కూడా ఉంది. అయినప్పటికీ రవాణా అధికారులు మొక్కుబడి తనిఖీలకు పరిమితమవుతున్నారు. అడ్డగోలుగా.. ఈ నెల 8 నుంచి 16 వరకు పిల్లలకు సెలవులు ప్రకటించడంతో నగరవాసులు సొంత ఊళ్లకు వెళ్లేందుకు ప్రణాళికలను సిద్ధం చేసుకుంటున్నారు. పైగా ఏపీలో సంక్రాంతి వేడుకలకు ఉండే ప్రాధాన్యాన్ని దృష్టిలో ఉంచుకొని కూడా సొంత ఊరుకు వెళ్తున్నారు. దీంతో ఇప్పటికే అన్ని ప్రధాన రైళ్లు పూర్తిగా నిండిపోయాయి. కొద్దిరోజుల క్రితం దక్షిణమధ్య రైల్వే ప్రకటించిన మరో 16 ప్రత్యేక రైళ్లల్లోనూ కేవలం రెండు రోజుల్లో బెర్తులు భర్తీ అయ్యాయి. నిరీక్షణ జాబితాలో పడిగాపులు కాస్తున్న ప్రయాణికులు గత్యంతరం లేక ప్రైవేట్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. రైళ్లు, ఆర్టీసీ బస్సుల తరహాలో ప్రైవేట్‌లోనూ ముందస్తు బుకింగ్‌లకు డిమాండ్ పెరిగింది. ప్రయాణికుల రద్దీ, డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని చార్జీలను అడ్డగోలుగా పెంచారు. హైదరాబాద్ నుంచి వైజాగ్‌కు సాధారణ రోజుల్లో రూ.900 వరకు ఉంటే ఇప్పుడు రూ.1600పైనే తీసుకుంటున్నారని కూకట్‌పల్లికి చెందిన సత్యనారాయణ అనే ప్రయాణికుడు విస్మయం వ్యక్తం చేశారు. నలుగురు కుటుంబ సభ్యులు కలిసి సొంతంగా కారు బుక్ చేసుకొని వెళ్లాలన్నా, కొంతమంది ప్రయాణికులు మినీ బస్సు బుక్ చేసుకోవాలనుకున్నా రూ.10 వేల నుంచి రూ.20వేల వరకు ఖర్చవుతుంది. ‘సంక్రాంతి చాలా పెద్ద పండగ. ఎట్టి పరిస్థితుల్లోనూ ఊరెళ్లాలని ఉంది. కానీ నలుగురం వెళ్లి, తిరిగి రావడానికి చార్జీలే రూ.10 వేలు దాటేటట్లుంది’ అని సైనిక్‌పురి ప్రాంతానికి చెందిన వివేక్ ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీ 4,318 అదనపు బస్సులు.. సంక్రాంతి సందర్భంగా ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని 4,318 బస్సులను అదనంగా నడిపేందుకు ఆర్టీసీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఈ నెల 7 నుంచి 14 వరకు ఈ బస్సులు అందుబాటులో ఉంటాయి. ఏపీలోని దూరప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు 550 బస్సుల్లో రిజర్వేషన్ సదుపాయం కల్పించారు. మహాత్మాగాంధీ, జూబ్లీ, ఉప్పల్, ఎల్బీనగర్, ఆరాంఘర్, ఈసీఐఎల్, కేపీహెచ్‌బీ, ఎస్సార్‌నగర్, అమీర్‌పేట్, టెలిఫోన్ భవన్, దిల్సుఖ్నగర్ తదితర ప్రాంతాల నుంచి ఈ బస్సులు రాకపోకలు సాగిస్తాయి. ఏపీలోని అన్ని ప్రధాన ప్రాంతాలకు ఇవి నడుస్తాయి. -
బెజవాడలో ఆర్టీసీ కార్మికుల భారీ ర్యాలీ
సాక్షి, విజయవాడ : ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలను అడ్డుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ఆర్టీసీ కార్మికులు నడుం బిగించారు. బస్ స్టేషన్ల వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ అక్రమ రవాణాను అరికట్టాలని డిమాండ్ చేస్తూ బెజవాడలో భారీ ర్యాలీ నిర్వహించారు. ప్రైవేట్ ట్రావెల్స్ వల్ల ఆర్టీసీ చాల నష్టపోతుందని కార్మిక సంఘాల నేతలు ఆరోపించారు. అక్రమ రవాణాను అధికారులు అడ్డుకుంటున్నప్పటికీ ఫలితం ఉండటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ రవాణా చేస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ విజయవాడ పోలీస్ కమిషినర్, జిల్లా రవాణా శాఖ అధికారులకు వినతి పత్రాలు అందజేశారు. -
బస్సు డ్రైవర్‌కు గుండెపోటు.. ప్రయాణీకులు..
సాక్షి, టెక్కలి : విధుల్లో ఉన్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు డ్రైవర్ గుండెపోటుతో మృతి చెందాడు. తనకు గుండెపోటు వచ్చినా ఎంతో చాకచక్యంగా బస్సును పొలాల్లోకి తీసుకెళ్లి నిలిపివేసి ప్రయాణీకుల ప్రాణాలు కాపాడాడు. ఈ ఘటన శ్రీకాకుళం జిల్లా టెక్కలి సమీపంలో జాతీయ రహదారిపై జరిగింది. ఖమ్మం నుంచి భువనేశ్వర్ వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టెక్కలి దగ్గరకు వచ్చే సరికి డ్రైవర్‌కు గుండెపోటు వచ్చింది. డ్రైవర్ చాకచక్యంగా వ్యవహరించి బస్సును పొలాల్లోకి దింపి మృతి చెందాడు. ఈ ఘటనలో నలుగురు ప్రయాణీకులకు స్పల్ప గాయాలు కాగా ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారు సురక్షితంగా ఉన్నారు. -
దేశవ్యాప్త సమ్మెకు ఏపీలో రవాణా కార్మికుల మద్దతు
సాక్షి, హైదరాబాద్: కేంద్రం ప్రభుత్వం తీసుకువచ్చిన రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ఆంధ్రప్రదేశ్‌లోని రవాణా రంగంలోని కార్మికులంతా గురువారం సమ్మెకు దిగనున్నారు. ఈ సమ్మెకు అన్ని ప్రధాన కార్మిక సంఘాలు మద్దతు పలికాయి. రవాణా రంగ రాజధాని అయిన విజయవాడలో పెద్ద ఎత్తున రవాణా భద్రతా బిల్లును వ్యతిరేకిస్తూ ప్రైవేటు ట్రావెల్స్, లారీ ఓనర్స్ అసోసియేషన్, ట్యాక్సీ, ఆటోల యూనియన్లు పెద్ద ఎత్తున నిరసన తెలపనున్నాయి. ఆర్టీసీలో ఎంప్లాయిస్ యూనియన్ యాజమాన్యానికి సమ్మె నోటీసిచ్చింది. మే 6 నుంచి ఈయూ ఆర్టీసీ సమ్మెకు పిలుపునివ్వడంతో బస్ డిపోల వద్ద కొద్ది సేపు నిరసన తెలిపేందుకు కార్మికులు సమాయత్తమవుతున్నారు. ఆర్టీసీ కార్మిక సంఘాలు సమ్మెలో పాల్గొని మద్దతు పలకనున్నాయి. దీంతో నేడు ఏపీలో రవాణా రంగం పూర్తిగా స్తంభించనుంది. ఆయా ప్రాంతాలకు వెళ్లిన లారీలు ఎక్కడికక్కడ నిలిపేసి నిరసన తెలియజేయాల్సిందిగా లారీ ఓనర్స్ అసోసియేషన్ పిలుపునిచ్చింది. అయితే రవాణా శాఖ రాకపోకలకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ఏవీ చేయలేదు. మధ్యాహ్నం వరకు సమ్మె ప్రభావం ఉన్నా, సాయంత్రం నుంచి యధావిధిగా రవాణా సౌకర్యాలు ఉంటాయన్న ఆలోచనలో రవాణా అధికారులున్నారు. -
ఈ వేగం..ఏ గమ్యానికి ?
సాక్షి, రాజమండ్రి :అధునాతన వాహనాలను ప్రయాణంలో సౌకర్యానికి కాక వేగానికి ఉపయోగించాలనే ధోరణి పెరగడం వల్లే మృత్యుశకటాలుగా మారుతున్నాయి. ప్రయాణికుల ప్రాణాలను, నిబంధనలను గాలికి వదిలేసి అపరిమిత వేగంతో బస్సులు దూసుకుపోతున్నా పట్టించుకోని నిర్లక్ష్యానికి సాక్ష్యమే పాలమూరు దుర్ఘటన . వేలాదిమంది ప్రాణాలతో రోజూ సాగే ఈ చెలగాటం నిరాటంకంగా సాగిపోతున్నా నియంత్రించాలనే స్పృహ పాలకులకు లేకపోవడం వల్లే ఇటువంటి ప్రమాదాలు తరచు సంభవిస్తున్నాయి. మహబూబ్‌నగర్ వద్ద జరిగిన ఓల్వో బస్సు ప్రమాదం.. ఇప్పుడు ప్రైవేట్ ట్రావెల్స్‌లో ప్రయాణాలు ఎంతవరకూ భద్రం అనే అనుమానాలను రేకెత్తిస్తోంది. టూరిస్టు ట్రావెల్స్ అనుమతుల్లో అధిక శాతం బస్సులు డెయిలీ సర్వీసులుగా నడుస్తున్నాయి. వీటిటిలో పలు రాజకీయ పార్టీల నేతలకు చెందిన కంపెనీలు ఉన్నాయి. మిగిలిన ట్రావెల్స్ నిర్వాహకులు కూడా ఆయా ప్రాంతాల నేతలతో సత్సంబంధాలు ఉన్నవారు ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ ట్రావెల్స్ నియంత్రణలో అధికారులు పూర్తిగా విఫలం అవుతున్నారు. బెంగళూరు- హైదరాబాద్ మార్గంలోలాగానే విశాఖపట్నం-హైదరాబాద్ మధ్య నడిచే ప్రైవేట్ సర్వీసులు కూడా అంతే స్థాయిలో తిరుగుతాయి. ఇప్పుడు ఈ మార్గంలో కూడా ప్రైవేట్ ప్రయాణాలను నియంత్రించాలని ప్రయాణికులు కోరుతున్నారు. హైదరాబాద్ వెళ్లేవారు ఎక్కువ విశాఖ-హైదరాబాద్ మధ్య రోజూ 75 సర్వీసులు తిరుగుతుండగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మరో 40 సర్వీసులు హైదరాబాద్ వెళుతున్నాయి. విశాఖ నుంచి నేరుగా హైదరాబాద్ వెళ్లేవారు 3 వేల మంది ఉంటారు. ఈ బస్సుల్లో 2 వేల మంది వరకూ తుని, జగ్గంపేట, రాజమండ్రి ప్రాంతవాసులు ఎక్కుతారు. ఇవికాక జిల్లా నుంచి ప్రత్యేకంగా నడిచే ప్రైవేట్ బస్సుల్లో 1600 మంది ప్రయాణికులు నిత్యం హైదరాబాద్ వెళ్తుంటారు. విశాఖ నుంచి బెంగళూరు, చెన్నై సర్వీసుల్లో రోజుకు 80 మంది ప్రయాణాలు సాగిస్తున్నారు. నిబంధనలకు నీళ్లు రాకెట్లా దూసుకుపోయే ఓల్వో బస్సు లతో తక్కువ సమయంలో గమ్యం చేరుకోవచ్చు. ఇందువల్లే పలువురు ఈ బస్సులను ఆశ్రయిస్తున్నారు. అలాగే రైలు, ఆర్టీసీ బస్సుల్లో రిజర్వేషన్ లభించక అత్యవసర ప్రయాణం చేయాల్సిన వారు కూడా ఈ ట్రావెల్స్‌ను ఆశ్రయిస్తున్నారు. బస్సులో చాలినంత మంది ప్రయాణికులు ఉన్నప్పటికీ ఆయా ప్రాంతాల వద్ద కూడళ్లలో ఆపి తక్కువ దూరం ప్రయాణాలు చేసేవారిని ముందు క్యాబిన్లలో కూర్చోబెట్టి తీసుకువెళ్లడం పరిపాటిగా మారుతోంది. దీంతో క్యాబిన్లో డ్రైవర్‌కు ఏకాగ్రత తప్పుతోంది. పేలుడు పదార్థాల రవాణా? ప్రైవేట్ ట్రావెల్ బస్సులు ప్రయాణికులనే కాకుండా అంతకు రెండింతల బరువుండే సరుకుల రవాణాకు అనుకూలంగా ఉంటున్నాయి. బస్సు టాపుమీద, కింద లగేజీ క్యాబిన్లో వివిధ రకాల సరుకులను భారీగా రవాణా చేస్తుంటారు. కొంతమంది ట్రావెల్స్వారు గూడ్స్ ట్రాన్స్పో ర్టును కూడా అనుబంధంగా నిర్వహిస్తున్నాయి. దీపావళి కోసం ఈ సర్వీసుల్లో మందుగుండు సామగ్రి ఎక్కువగా రవాణా అవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో తుని-రాజమండ్రి మధ్య యాసిడ్ పీపాలు, నిషేధిత పదార్థాలు రవాణా చేస్తుండగా పట్టుబడ్డాయి. ఇటువంటి రవాణాపై నియంత్రణ శూన్యం. ఆర్టీసీ మాదిరిగా వీటికి మార్గమధ్యంలో తనిఖీలు లేకపోవడం, ఎవరైనా తనిఖీలు చేస్తే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర పలుకుబడి ఉన్న నేతలు తక్షణం జోక్యం చేసుకోవడంతో సద్దుమణిగి పోతున్నాయి. రాజకీయ పలుకుబడి వల్లనే ప్రైవేట్ ట్రావెల్స్‌పై నిఘా పెట్టలేకపోతున్నామని రవాణా అధికారులు అంటున్నారు. సిబ్బంది సరిగా ఉండరు చాలా బస్సుల్లో ఒక డ్రైవర్, ఒక క్లీనర్ మాత్రమే ఉంటున్నారు. కొన్ని బస్సుల్లో విశాఖపట్నం నుంచి హైదరాబాద్ వెళ్లి, మళ్లీ సాయంత్రం హైదరాబాద్ నుంచి విశాఖ వెళ్లే వరకూ ఒకే డ్రైవర్ పని చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉదయం బస్సు గమ్యం చేరిన నుంచి తిరిగి రాత్రి బయలుదేరే మధ్యలో ఉన్న సమయాన్ని డ్రైవర్‌కు విశ్రాంతి సమయంగా నిర్వాహకులు చూపుతున్నారు. అయితే 24 గంటల్లో రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే డ్యూటీ సమయం ఉండాల్సి ఉండగా 16 నుంచి 22 గంటలు డ్రైవర్‌తో పనిచేయిస్తున్నారు. అలసిన డ్రైవర్లు రాత్రిళ్లు క్లీనర్లకు బస్సులు అప్పగించేస్తున్నారు. అదుపు చేయలేని వేగం సాధారణంగా ప్రయాణికులను తరలించే బస్సులు 60 నుంచి 80 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం చేయాలి. అందుకు తగ్గట్టుగా బస్సు వేగాన్ని నిరోధించాలి. కానీ జాతీయ రహదారులపై కనీసం 100 నుంచి 120 కిలోమీటర్ల వేగంతో బస్సులు నడుపుతున్నారు. ఈ క్రమంలో అదుపు తప్పితే నియంత్రించే సామర్థ్యం డ్రైవర్‌కు సైతం ఉండడంలేదు. ఆదేశాలు అందగానే తనిఖీలు ప్రైవేట్ బస్సు ప్రమాదాలపై ప్రభుత్వం కమిటీ వేస్తున్నట్టు తెలుస్తోంది. ఆదేశాలు అందిన వెంటనే తనిఖీలు చేస్తాం. మహబూబ్‌నగర్ ప్రమాదానికి వేగంతో పాటు రోడ్డు నిర్మాణం కూడా కారణంగా తెలుస్తోంది. సంఘ టన స్థలం వద్ద రోడ్డు మలుపులో సాంకేతిక ప్రమాణాల ప్రకారం నిర్మాణం జరగలేదని అక్కడి వారు చెబుతున్నారు. మలుపులో వేగంగా వస్తున్న బస్సు అదుపు తప్పి కల్వర్టును ఢీకొని ప్రమాదానికి గురైనట్టు తెలుస్తోంది. - సీహెచ్. హైమారావు, రీజనల్ ట్రాన్స్‌పోర్టు అధికారి, రాజమండ్రి. ఇంజన్, టైర్లు కండిషన్లో ఉండాలి ఓల్వో బస్సులకు సుశిక్షితులైన డ్రైవర్ల వ్యవస్థ ఉండాలి. మా శాఖ బస్సులు గరిష్టంగా వంద కిలోమీటర్ల వేగానికి లాక్ చేసి ఉంటాయి. డ్రైవర్లు కేవలం 80 నుంచి 85 కిలోమీటర్ల వేగంతోనే నడుపుతారు. మహబూబ్‌నగర్ బస్సు ప్రమాదం అధిక వేగం వల్ల జరిగినట్టు తెలుస్తోంది. హైటెక్ బస్సులకు ఇంజన్ కండిషన్‌తో పాటు టైర్ల కండిషన్ కూడా చాలా ముఖ్యం. టైర్లు పేలినప్పుడు, అదుపులేని వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమాదాలు జరుగుతాయి. ఆర్టీసీ గ్యారేజీలో వీటిని ప్రధానంగా పరిశీలి స్తాం. కండిషన్ తనిఖీ చేసి బస్సు డ్రైవర్‌కు అప్పగిస్తాం. - ఆర్వీఎస్ నాగేశ్వరరావు, ఆర్టీసీ చీఫ్ మెకానికల్ ఇంజనీరు అంతా పైపై మెరుపే.. ఓల్వో బస్సులు పైకి మెరిసిపోతుంటాయి. కానీ పాత ఇంజన్లతోనే దూర ప్రాంతాలకు తిరుగుతున్నాయి. రవాణా అధికారులు మామూళ్లకు, పలుకుబడికి తలొగ్గి నో అబ్జెక్షన్ సర్టిఫికెట్టు ఇచ్చేస్తున్నారు. ఒకే పర్మిట్‌పై రెండు మూడు బస్సులు తిరుగుతున్నాయి. పర్మిట్ ఉన్న బస్సు షెడ్‌కు వెళితే, మరో బస్సుకు నెంబరు ప్లేటు మార్చి రోడ్డు ఎక్కిస్తున్నారు. ఇలాంటి అక్రమాలపై తనిఖీలు లేవు. ఈ బస్సులను నడిపేందుకు అవసరమైన శిక్షణ డ్రైవర్లకు ఇవ్వడం లేదు. ప్రయాణికుల వివరాలు, రికార్డులు సక్రమంగా నిర్వహించడంలేదు. ప్రయాణికుల చిరునామా, ఫోన్ నెంబర్లు వంటివి విధిగా ఉండాలనే నిబంధన పాటించడం లేదు. ప్రైవేట్ ట్రావెల్స్‌లో చాలావరకూ బినామీ పేర్లతో టిక్కెట్లు కొని ప్రయాణాలు సాగిస్తుంటారు. ప్రయాణికులకు అదనంగా ఒక లారీ సరుకు రవాణా చేస్తున్నారు. బస్సు ప్రయాణం చేసి వచ్చిన తర్వాత దాని ఇంజన్, నిర్వహణ వ్యవస్థ, బ్రేక్ కండిషన్ వంటివి నిపుణులతో పూర్తిగా తనిఖీ చేయించి ప్రయాణానికి సిద్ధం చేయాలి. కానీ అందుకు తగినంత సమయం ఉండడంలేదు. కేవలం బస్సులు తుడిచి మళ్లీ లైన్లో పెట్టేస్తున్నారు. రాత్రి హైదరాబాద్‌లో బయలుదేరిన బస్సు ఉదయం 8 గంటలకు రాజమండ్రి, మధ్యాహ్నం 11 గంటలకు విశాఖ చేరుకుంటాయి. తిరిగి సాయంత్రం ఐదు గంట లకు అదే బస్సు తిరిగి హైదరాబాద్ బయలుదేరుతుంది. ఏసీ బస్సుల్లో ఇవి ఉండాలి ఏసీ బస్సుల్లో అంతా సీల్ చేసి ఉంటుంది. ఏసీ బయటకు పోకుండా బస్సు బాడీ పొరల మధ్య పోలీయురేధిన్ ఫోం(ఒక విధమైన స్పాంజ్) వంటి పదార్థాన్ని ఉంచుతా రు. ఇది మంటలు వ్యాపించడానికి కారణం అవుతుంది. ఓల్వో బస్సుల్లో అత్యవసర సమయాల్లో అద్దాలు బద్దలు కొట్టేందుకు ఒక ప్లాస్టిక్ సుత్తి అందరికీ అందుబాటులో ఉంచాలి. ఏ బస్సులోనూ ఇది కనిపించదు. ప్రతి బస్సులో మొబైల్ అగ్నిమాపక పరికరం ఉంటుం ది. కానీ దాన్ని డిక్కీలో పడేస్తున్నారు. బస్సు నడిచేటప్పుడు తలుపులు అన్నీ ఆటోమేటిక్ ల్యాక్ చేస్తారు. దీన్ని డ్రైవర్ ఆపరేట్ చేస్తారు. వీటిపై కొందరు డ్రైవర్లకు అవగాహన ఉండడంలేదు. అత్యవసర సమయాల్లో ఇవి ప్రమాదకరంగా మారుతున్నాయి. -
ఆర్టీసీ కార్మికుల సమ్మెతో దోపిడీకి తెరతీసిన ప్రైవేటు ఆపరేటర్లు
చీరాల, న్యూస్‌లైన్ : ప్రైవేటు ట్రావెల్స్ జనాన్ని జలగల్లా పీడిస్తున్నాయి. దీపం ఉండగా ఇల్లు చక్కబెట్టుకోవాలన్న చందాన తయారైంది వాటి తీరు. ఆర్టీసీ బస్సులు లేకపోవడం.. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల తాకిడి ఎక్కవ కావడంతో రోజూ వసూలు చేసే చార్జీల కంటే అధికంగా పెంచేసి సొమ్ము చేసుకుంటున్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో భాగంగా తెలంగాణ రాష్ట్ర ప్రకటనను నిరసిస్తూ ఆర్టీసీ యూనియన్లు ఈ నెల 12వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి వెళ్లాయి. రోజుకు వందల మైళ్లు తిరిగే బస్సులు సమైక్యాంధ్ర సమ్మెతో డిపోలకే పరిమితమయ్యాయి. ఇదే అదనుగా భావించిన ప్రైవేటు ట్రావెల్స్ నిర్వాహకులు ప్రయాణికుల అవసరాలను ఆసరా చేసుకుని చార్జీలను అమాంతం పెంచేశారు. చీరాల నుంచి రోజూ పది ప్రైవేటు ట్రావెల్స్‌కు చెంది న బస్సులు హైదరాబాద్, బెంగళూరు వెళుతుంటాయి. శని, ఆదివారాల్లో ఒక రేటు, మిగి లిన రోజుల్లో మరో రేటు నిర్ణయించి వసూలు చేస్తుంటారు. ప్రైవేటు బస్సుల నిర్వాహకులు ప్రయాణికుల తాకిడి ఎక్కువగా ఉండటంతో రాత్రి వేళ వెళ్లే బస్సుల చార్జీలను రెట్టింపు చేస్తున్నారు. హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు వెళ్లాలంటే రైలు టికెట్లు దొరక్కపోవడంతో కష్టమో నష్టమో భరించి అధిక మొత్తంలో చెల్లిస్తున్నారు. గతంలో ఇంటర్నెట్లో టికెట్లు బుక్ చేసుకునేవారు. నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే ధోరణిలో ప్రైవేటు ట్రావెల్స్ రోజుకొక రేటు ఇంటర్నెట్లో ఉంచడంతో ప్రయాణికులు గందరగోళంలో పడుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, విశాఖపట్నం తదిత ర దూర ప్రాంతాలకు రైళ్లలో టికెట్లు లభించకపోవడంతో ప్రైవేటు ట్రావెల్స్ ఇష్టానుసారం గా ధరలు నిర్ణయిస్తున్నాయి.వినాయకచవితికి దూర ప్రాంతాల నుంచి వచ్చి తిరిగి వెళ్లేందుకు బస్ చార్జీలను ట్రావెల్స్ నిర్వాహకులు భారీ ఎత్తున పెంచేశారు. ట్రావెలర్స్ పెంచిన ధరల చూస్తే ప్రయాణికుల కళ్లు గిర్రున తిరుగుతాయి. ఒక్కో టికెట్ వెయ్యి రూపాయల వరకు పలకడంతో కొంతమంది ప్రయాణాన్ని వాయిదా వేసుకుంటున్నారు. మరో నెలలో రానున్న దసరా, దీపావళి పండుగలకు ఎంత మొత్తంలో చార్జీలు ఉంటాయోనని ప్రయాణికులు ఇప్పటి నుంచే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్య జిల్లా అంతటా ఉంది.