ఎస్టీల్లో అనైక్యత కాదనలేని వాస్తవం
‘ట్రైబ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా’ సదస్సులో ప్రొ.సరిత్ చౌదరి
సాక్షి, హైదరాబాద్: గిరిజనుల అభ్యున్నతికి కొన్ని దశాబ్దాలుగా దేశంలో అమలుచేసిన విధానాల ద్వారా ఆర్థిక, విద్య, ఆరోగ్య రంగాల్లో కొంత మార్పు వచ్చినా వివిధ రాష్ట్రాల్లోని ఎస్టీల మధ్య అనైక్యత పెరగడం కాదనలేని వాస్తవమని ఇందిరాగాంధీ రాష్ట్రీయ మానవ సంగ్రహాలయ (భోపాల్) డెరైక్టర్ ప్రొ. సరిత్ చౌదరి వ్యాఖ్యానించారు. ఇప్పటివరకు చేపట్టిన పథకాల ద్వారా ఆదిమ గిరిజన తెగలు (పీవీటీజీలు) నివాసముంటున్న గ్రామాల సంఖ్య తగ్గాల్సి ఉండగా, అందుకు భిన్నంగా గతంలో 55 వేలు ఉన్న ఈ సంఖ్య 75 వేలకు పెరిగిందన్నారు. దేశంలోని అనేక ప్రాంతాల్లో ఆదివాసీలు, గిరిజనుల మధ్యే ఇంకా అంతరాలున్నాయని, ఒక తెగను మరో తెగ గుర్తించే పరిస్థితి లేదన్నారు.
గురువారం రామాంతపూర్‌లోని ఆర్నాల్డ్ భవన్లో ఇన్స్టిట్యూట్ ఆఫ్ ద్రావిడియన్ కల్చర్, రిసెర్చ్ (సంస్కృతి) ఆధ్వర్యంలో ‘‘ట్రైబ్స్ ఇన్ కాంటెంపరరీ ఇండియా.. కాన్సెప్ట్స్ అండ్ కాంటెక్స్ట్’’ అనే అంశంపై మూడో జాతీయ సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో సరిత్ చౌదరి కీలకోపన్యాసం చేస్తూ ఒక రాష్ర్టంలో ఎస్టీలుగా గుర్తింపు పొందిన వారిని పొరుగునే ఉన్న మరో రాష్ట్రంలో ఎస్టీలుగా పరిగణించడం లేదన్నారు.
అసోంలో మిషన్ తెగ వారు ఎస్టీలైతే అరుణాచల్ ప్రదేశ్‌లో కాదని, ద్వంద్వత్వమనేది దేశంలో ఇంకా కొనసాగుతోందన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సొసైటీ ఆఫ్ డివైన్ వర్డ్ (ఎస్వీడీ) కన్సల్టర్స్ జనరల్ (రోమ్) మజోలా మిడో ఘి మాట్లాడుతూ దేశంలో ఉండే ప్రజలంతా తమకు మిగతావారితో సమానంగా హక్కులు కలిగి ఉండాలని, గుర్తింపును పొందాలని, వివక్షకు గురికాకూడదని కోరుకుంటారన్నారు.
ఎస్సీలకు అన్యాయం: కంచ ఐలయ్య
గిరిజనుల పట్ల క్రైస్తవమిషనరీలకు నిజంగా సానుభూతి ఉంటే గిరిజన ప్రాంతాల్లో ఇంగ్లిష్‌ను బోధించాలని కంచ ఐలయ్య వ్యాఖ్యానించారు. దేశంలో దళితులు, మహిళలకు గౌరవమనేదే లేదన్నారు. ఎస్సీలకు అన్యాయం జరుగుతోందని, వివక్షకు గురవుతున్నారని చెబుతూ రీసెర్చ్ స్కాలర్ రోహిత్ ఆత్మహత్య ఉదంతాన్ని వివరించారు. ఈ సదస్సుకు సంస్కృతి డెరైక్టర్ డా. జి.లాజర్ అధ్యక్షత వహించగా.. సంస్కృతి చైర్పర్సన్ రెవరెండ్ ఫాదర్ ఆంథోని జోసెఫ్ సందేశమిచ్చారు. కార్యక్రమంలో డా. త్రినాథరావు, జీవన్‌కుమార్ (హ్యూమన్ రైట్స్ ఫోరమ్), థామస్ కావుమ్ కట్టియాల్ పాల్గొన్నారు.