problem solving
-
థెరపిస్టు చాట్‌జీపీటీ
లవ్ బ్రేకప్.. ఒంటరితనం.. ఆఫీసులో కోపిష్టి బాస్ వేధింపులు.. సహోద్యోగులతో ఇబ్బందులు.. జీవితంలో ఏ సమస్య వచ్చినా చెప్పుకోవడానికి, ఓపిగ్గా వినేవారొకరు ఉండాలి. తీరా చెప్పాక జడ్జ్ చేయకుండా ఉంటారా? నిష్పాక్షికంగా పరిష్కార మార్గం సూచిస్తారా? అనుమానమే. ఇలాంటి పరిస్థితుల్లో సాధారణంగా మానసిక వైద్యులను సంప్రదిస్తారు. కానీ ఇప్పుడు ట్రెండు మారుతోంది. ఈ విషయంలో చాట్‌జీపీటీకే జనం ఓటేస్తున్నారు. సమస్యలను వినే మంచి ఫ్రెండ్‌గానే గాక వాటికి పరిష్కారం చూపే కౌన్సిలర్‌గా కూడా భావిస్తున్నారు. లైఫ్ కౌన్సిలర్ 27 ఏళ్ల మనీశ్ ఇంజనీర్. ప్రియురాలితో గొడవైంది. అపార్థాలతో బంధానికి బ్రేక్ పడింది. మానసికంగా అలసిపోయి ఓ సాయం వేళ చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. సమస్యంతా చెప్పాడు. ఏం చేయాలో పాలుపోవడం లేదన్నాడు. చాట్‌జీపీటీ సమాధానం మనోన్ని ఆశ్చర్యపరిచింది. ‘‘మీరు చెప్పింది ఆమె వినకపోవడం మిమ్మల్ని బాధిస్తోంది. అదే విషయం ఆమెకు నేరుగా చెప్పారా?’’అని అడిగింది. అంతటితో ఆగకుండా ప్రేయసికి సందేశం పంపడంలో మనీశ్‌కు సాయపడింది. ఆమెను నిందించకుండా కేవలం అతని ఫీలింగ్స్ మాత్రమే వ్యక్తపరిచే ప్రశాంతమైన, నిజాయితీతో కూడిన నోట్ అది. అందుకున్న ఆ అమ్మాయి మనీశ్ తో మాట్లాడింది. ఇంకేముంది వారి మధ్య దూరం తగ్గిపోయింది. వృత్తి సమస్యల్లో సాయం 26 ఏళ్ల అక్షయ్ శ్రీవాస్తవ కంటెంట్ రైటర్, మీడియా ప్రొఫెషనల్. ఆఫీసుకు వెళ్లిరావడానికే నాలుగ్గంటలు పోతోంది. నిద్ర లేదు. కుటుంబంతో గడపడానికి లేదు. ఫిర్యాదులా కాకుండా ఈ విషయాన్ని బాస్‌తో ఎలా చెప్పాలో తేలక చాట్‌జీపీటీని ఆశ్రయించాడు. వాడాల్సిన పదాలతో సహా చక్కని నిర్మాణాత్మక సలహాలిచ్చింది. అప్పటినుంచి అక్షయ్ క్రమం తప్పకుండా చాట్‌బాట్‌ను ఆశ్రయిస్తున్నాడు. ఆయేషాది మరో సమస్య. ఇన్నాళ్లు సహోద్యోగిగా ఉన్న స్నేహితులకే బాస్ అయింది. సాన్నిహిత్యం కోల్పోకుండా వాళ్లతో ఎలా డీల్ చేయాలని చాట్‌జీపీటీనే అడిగింది. అదిచ్చిన సమాధానం ఎమోషనల్ ఇంటెలిజెన్స్‌లో క్రాష్ కోర్సులా సాయపడింది. బెటర్ కౌన్సిలర్? ఒక్కోసారి కౌన్సిలర్ కంటే మెరుగ్గా చాట్‌జీపీటీ ఇచ్చే సమాధానాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. జీవితంలో చాలా కోల్పోయానని అపిస్తుందనే ప్రశ్నకు.. ‘మార్పు జరిగినప్పుడు అది మామూలే. అభిరుచులను పెంచుకోండి’అని కౌన్సిలర్ చెప్పారు. చాట్‌జీపీటీ మాత్రం, ‘సంతోషపరిచే పనులు చేయండి. చిన్న లక్ష్యాలు పెట్టుకుని చేరుకునే ప్రయత్నం చేయండి’అని సూచించింది. స్నేహితులు అర్థం చేసుకోవడం లేదంటే వారితో ఓపెన్‌గా మాట్లాడమని థెరపిస్టు చెబితే, ‘స్నేహితుల్లో అపార్థాలు మామూలే. వారితో నిజాయితీగా మాట్లాడండి’అని చాట్‌జీపీటీ సూచించింది. పని నచ్చడం లేదంటే ఒత్తిళ్లను గుర్తించి పరిష్కారానికి కొత్తగా ప్రయతి్నంచమని కౌన్సిలర్ చెప్పాడు. చాట్‌జీపీటీ మాత్రం, ‘పనిలో పరిమితులను పెట్టుకోండి. హెచ్ఆర్ లేదా మెంటార్‌తో మాట్లాడండి. మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకోండి’అని సలహా ఇచ్చింది. భాగస్వామితో విభేదాలపై ఓపెన్‌గా మాట్లాడుకుని, సమస్యకు కారణాలేంటో కనిపెట్టి పరిష్కారానికి కలిసి ప్రయతి్నంచండన్న చాట్‌జీపీటీ సూచనే మెరుగ్గా ఉందని నెటిజన్లు మెచ్చుకుంటున్నారు.ప్రత్యామ్నాయం కాబోదు: మానసిక వైద్యులు మానసిక వైద్యం మనదేశంలో కాస్త ఖరీదైన విషయం. జనంలో అవగాహన లేమి కూడా ఉంది. ఆ సమస్యలకు చాలామంది క్రమంగా ఏఐపై ఆధారపడుతున్నారు. అది జడ్జ్ చేయదు. చెబుతుంటే మధ్యలో అడ్డుకోదు. ఏం చెప్పినా, ఎంతసేపు చెప్పినా, ఎప్పుడు చెప్పినా శ్రద్ధగా వింటుంది. అంతే ఓపిగ్గా సమాధానమూ ఇస్తుంది. దాంతో వ్యక్తిగతం నుంచి వృత్తిపరమైన సలహాల దాకా యూత్ చాట్‌జీపీటీపై ఆధారపడుతోంది. కానీ ఈ చాట్‌బాట్ మానసిక ఇబ్బందులకు మొత్తంగా పరిష్కారం చూపలేదంటున్నారు వైద్యులు. ‘‘అది తాత్కాలిక ఉపశమనమిచ్చే ఔట్‌లెట్‌లా పనిచేస్తుందంతే. పూర్తిస్థాయి మానసిక చికిత్స ప్రక్రియకు ప్రత్యామ్నాయం కాబోదు. సహానుభూతి, అంతర్దష్టి, అవగాహన వాటికుండవు’’అంటున్నారు. అంతేగాక ఏఐ థెరపీ బాట్లతో ముప్పు కూడా ఉంటుందని అమెరికన్ సైకలాజికల్ అసోసియేషన్ హెచ్చరించింది. ప్రత్యేకించి వాటిని పిల్లలు వాడటంపై ఆందోళన వ్యక్తం చేసింది. మనుషులను అవి మరింత ఒంటరులను చేస్తాయనీ హెచ్చరించింది. – సాక్షి, నేషనల్ డెస్క్ -
బాధ్యతలు పెంచినా.. జీతాలు పెంచలే!
సాక్షి, హైదరాబాద్: బాలికల విద్యను ప్రోత్సహించేందుకు ఏర్పాటైన కస్తూర్బా గాంధీ విద్యాలయాల్లో (కేజీబీవీల్లో) పనిచేస్తున్న ప్రత్యేకాధికారులు.. తమ సమస్యలను పట్టించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. తమకు అనేక బాధ్యతలు అప్పగించి, వేతనం మాత్రం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ పెద్దల చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగలేదని అంటున్నారు. ఇటీవల కేజీబీవీ సంఘ నేతలు, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం నేతలు దీనిపై సర్కారుకు వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వ బడుల ఉపాధ్యాయుల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నా.. వారితో సమాన గౌరవం లభించడం లేదని అందులో వాపోయారు. కేజీబీవీలను అప్‌గ్రేడ్ చేస్తున్నప్పటికీ అందుకు తగినట్టుగా మౌలిక వసతులు కల్పించడం లేదని.. పట్టించుకోకుంటే చదువుల నాణ్యత పడిపోయే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. గెజిటెడ్ అధికారులు చేయాల్సిన పనులన్నీ ఏళ్ల తరబడి కాంట్రాక్టు కొలువుల్లో ఉన్న తమపై వేయడం న్యాయమేనా అని ప్రశ్నించారు. పెరిగిన విధులు.. పెరగని వేతనం.. బాలికలు మధ్యలోనే చదువు మానేసే పరిస్థితిని మార్చే ఉద్దేశంతో ఉమ్మడి రాష్ట్రంలో 2010–11లో కేజీబీవీలను ఏర్పాటు చేశారు. హాస్టల్‌తోపాటు నాణ్యమైన విద్య అందించేలా చర్యలు తీసుకున్నారు. రాష్ట్రంలో 450 కేజీబీవీలున్నాయి. తొలుత ఆరు, ఏడు తరగతులే ప్రారంభించి.. తర్వాత టెన్త్ వరకూ, 2018–19లో ఇంటర్మీడియట్ వరకూ అప్‌గ్రేడ్ చేశారు. ప్రతీ కేజీబీవీకి ఒక స్పెషల్ ఆఫీసర్ సహా ముగ్గురిని కాంట్రాక్టు పద్ధతిలో నియమించారు. వారికి చాలా ఏళ్లుగా నెలకు రూ.32,500 వేతనమే అందుతోంది. ఇంటర్మీ డియట్ వరకు అప్‌గ్రేడ్ చేయడంతో విధులు పెరిగాయి. నెలకు కేవలం రెండే క్యాజువల్ లీవ్స్ ఉంటాయి. అత్యవసరమై అదనంగా సెలవు పెడితే వేతనంలో కోతపడుతుంది. అనుక్షణం విధుల్లోనే.. స్కూల్, హాస్టల్, ఇంటర్ కాలేజీల నిర్వహణ మొత్తం ప్రత్యేక అధికారి చూసుకోవాలి. కొన్ని జిల్లాల్లో మోడల్ స్కూళ్ల బాధ్యతలను కూడా వీరికే అప్పగించారు. కొత్తగా నిర్మిస్తున్న కేజీబీవీల్లో స్కూల్ ఒకచోట హాస్టల్ మరోచోట ఉంటున్నాయి. దీంతో అన్ని విధులు నిర్వర్తించడం కష్టంగానే ఉందని వారు చెబుతున్నారు. రాత్రి విధులప్పుడు చాలా ఇబ్బందిపడుతున్నామంటున్నారు. ఆ రోజు మధ్యా హ్నం నుంచి మర్నాడు మధ్యాహ్నం వరకూ నిరంతరం డ్యూటీ ఉంటుందని, దీనివల్ల అనారోగ్యం పాలవుతున్నామని వాపోతున్నారు. 2017లో జాబ్‌చార్ట్ ఇచ్చినా అందులో మార్గదర్శకాలు ఇవ్వలేదని.. దీనితో అధికారులు ఇష్టానుసారం బాధ్యతలు అప్పగిస్తున్నారని చెప్తున్నారు. హాస్టల్లో విద్యార్థులను గమనించడం, భోజనం నాణ్యత పరిశీలించడం, కాలేజీలో విద్య నాణ్యత వంటి విధుల్లో ఎక్కడ తేడా వచ్చిన అధికారులు తమనే బలిచేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం తమ పరిస్థితిని సానుభూతితో పరిశీలించాలని కోరుతున్నారు. మానసికంగా కుంగిపోతున్నాం కేవలం చిన్న స్కూళ్ల విధుల కోసమంటూ మమ్మల్ని తీసుకుని తర్వాత రెట్టింపు బాధ్యతలు పెట్టారు. ఏళ్లు గడుస్తున్నా వేతనం పెంచలేదు. టీచర్ల కన్నా ఎక్కువ విధులు నిర్వర్తిస్తున్నాం. ఎంతోమంది విద్యార్థినుల ఉన్నతికి తోడ్పడుతున్నాం. మాకు పని ఒత్తిడి తగ్గించి, వేతనం పెంచితే తప్ప మేం సంతృప్తిగా పనిచేయలేని పరిస్థితి ఉంది. ప్రభుత్వం మా గోడు ఆలకిస్తుందని ఆశిస్తున్నాం. – దోపతి శ్రీలత, రాష్ట్ర కేజీబీవీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షురాలు వారి పరిస్థితి మెరుగుపర్చాలి.. కేజీబీవీ ప్రత్యేక అధికారుల పరిస్థితి దారుణంగా ఉంది. ఈ విషయాన్ని వివరిస్తూ ప్రభుత్వానికి ఇటీవల వినతిపత్రం ఇచ్చాం. బాలికలకు నాణ్యమైన విద్య అందించాలంటే ముందుగా కేజీబీవీ ఉద్యోగుల పరిస్థితిని మెరుగుపర్చాలి. –పి.రాజాభాను చంద్రప్రకాశ్, ప్రభుత్వ హెచ్ఎంల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు -
Munugode Bypoll: మాకు మీ డబ్బొద్దు.. రోడ్లు వేయండి
సాక్షి, నల్లగొండ: మునుగోడు ఉప ఎన్నికల వేళ నియోజకవర్గ ప్రజలు తమ సమస్యలను తెరపైకి తెస్తున్నారు. వాటిని పరిష్కరిస్తేనే ఓట్లు వేస్తామంటూ స్పష్టం చేస్తున్నారు. కొన్నిచోట్ల ఈ మేరకు బ్యానర్లు ప్రదర్శిస్తున్నారు. ఓట్ల కోసం గ్రామాల్లో తిరుగుతున్న ప్రధాన రాజకీయ పార్టీలకు తమ డిమాండ్లు తెలియజేస్తున్నారు. బుధవారం కూడా మునుగోడు మండలం కాశవారిగూడెంలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుంది. గత నెలలో చండూరు మండలంలోని పడమటితాళ్ల గ్రామానికి రోడ్డు వేయాలని కోరుతూ గ్రామస్తులు గ్రామం పొలిమేరలో బ్యానర్ కట్టారు. దీంతో ఆ గ్రామస్తులను ప్రసన్నం చేసుకునే ప్రయత్నంలో నాయకులు పడ్డారు. గట్టుప్పల్ మండలంలోని తేరట్పల్లి గ్రామం బ్యాంకు కాలనీలో ఇటీవల ‘ప్రజా ప్రతినిధులకు గమనిక’ అంటూ బోర్డు రూపంలో ఒక బ్యానర్ ఏర్పాటు చేశారు. తమ కాలనీలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు (సీసీరోడ్లు, డ్రైనేజీ, ఇతర సమస్యలు) చేపట్టనందున ప్రజా ప్రతినిధులెవరూ ఓట్లు అడగడానికి ఈ కాలనీలో అడుగు పెట్టకూడదని, తమ సమస్యలను త్వరగా పరిష్కరించేవారే ఓట్లు అడిగేందుకు అర్హులంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. దీంతో వారి సమస్యలను పరిష్కరించేలా సంప్రదింపులు జరుగుతున్నాయి. కాగా బుధవారం కాశవారిగూడెంలో ప్రజలు అలాంటి బ్యానరే ఏర్పాటు చేశారు. ‘మాకు మీరిచ్చే డబ్బులు వద్దు.. మా గూడేనికి రోడ్డు కావాలి..’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేశారు. ‘గ్రామ ప్రగతి మారలేదు. గత 30 సంవత్సరాలుగా ప్రభుత్వాలు, ప్రజా ప్రతిని ధులు, ఎందరో నాయకులు మారినా మా గతుకుల రోడ్డు, కనీస సౌకర్యాలు మార లేదు. అన్ని రాజకీయ పార్టీలకు విన్నపం.. రోడ్డు, మా గ్రామంలో అన్ని సౌకర్యాలు కల్పించే నాయకులకే ఓట్ల కోసం మా కాశవారి గూడెంకు రాగలరు. మాకు తక్షణమే కల్వలపల్లి నుంచి కాశవారి గూడేనికి రోడ్డు వేయాలి. గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలి’ అంటూ బ్యానర్ ఏర్పాటు చేయడంతో నేతలు తలపట్టుకుంటున్నారు. మంగళవారం చౌటుప్పల్ మండలం కోయలగూడెంలో ప్రచారం చేసిన మంత్రి ప్రశాంత్‌రెడ్డి.. టీఆర్ఎస్ అభ్యర్థిని గెలి పిస్తే మీ ఊరికి రోడ్డు వేస్తామని చెప్పగా ఓ ఓటరు.. ‘మీ మా టలు నమ్మం’ అంటూ అడ్డు తగిలారు. దానికి మంత్రి ‘నువ్వు ఆ వర్గమా ఈ వర్గమా?’ అని ప్రశ్నించడంతో ‘ఓ ఓటరుగా అడుగు తున్నా’ అని ఆయన జవాబిచ్చారు. -
తెలుగు పరిశ్రమలో కొత్త మార్గదర్శకాలు
కరోనా తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి (టీఎఫ్‌సీసీ–తెలుగు ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్) ఇటీవల నాలుగు కమిటీలను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. షూటింగ్‌లు నిలిపివేసి, సుదీర్ఘ చర్చలు జరిపిన అనంతరం సెస్టెంబర్ 1 నుంచి చిత్రీకరణ పునః ప్రారంభించుకోవచ్చని తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి ఆధ్వర్యంలో నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. షూటింగ్‌లు కూడా ఆరంభం అయ్యాయి. తాజాగా పారితోషికం, ఓటీటీ, థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్, ఫెడరేషన్‌కు సంబంధించిన కొత్త మార్గదర్శకాలను ప్రకటిస్తూ, టీఎఫ్‌సీసీ ఓ లేఖను విడుదల చేసింది. ఈ మార్గదర్శకాలు సెప్టెంబరు 10 నుంచి అమలులోకి వస్తాయన్నట్లుగా టీఎఫ్సీపీ పేర్కొంది. కాగా ఇండస్ట్రీకి చెందిన ప్రతినిధులతో విస్తృత స్థాయి సమావేశాలు జరిపాకే ఈ కొత్త మార్గదర్శకాలను నిర్ణయించినట్లుగా టీఎఫ్‌సీసీ ఆ లేఖలో స్పష్టం చేసింది. ఆ లేఖలో పేర్కొన్న మార్గదర్శకాలు ఈ విధంగా.... ప్రొడక్షన్‌కు సంబంధించిన గైడ్‌లైన్స్ ► నటీనటులకు, సాంకేతిక నిపుణులకు రోజువారీ వేతనాలు ఉండవు. ► నటీనటులు వారి పారితోషికంలోంచే వ్యక్తిగత సిబ్బంది వేతనాలు చెల్లించుకోవాలి. అలాగే స్థానిక రవాణా, బస, స్పెషల్ ఫుడ్ వంటివి నటీనటులే సమకూర్చుకోవాలి. ఒప్పందాల ప్రకారమే నిర్మాతలు ఆర్టిస్టులకు పారితోషికాలను చెల్లిస్తారు. నటీనటులతో పాటు ప్రధాన సాంకేతిక నిపుణులకూ ఇవే నియమాలు వర్తిస్తాయి. ► సినిమా షూటింగ్ ప్రారంభించడా నికి ముందే పారితోషికాలకు సంబంధించిన ఒప్పందాలు పూర్తవుతాయి. వీటి ప్రకారమే చెల్లింపులు ఉంటాయి. ► కాల్షీట్స్ టైమింగ్, సెట్స్‌లో క్రమశిక్షణకు సంబంధించిన నియమాలు కఠినంగా అమలు చేయబడతాయి. నిర్మాతల సౌకర్యార్థం సినిమాకు సంబంధించిన షూటింగ్ రిపోర్ట్‌ను ఎప్పటికప్పుడు నమోదు చేయాలి. ఓటీటీ : ► ఓ సినిమా ఏ టీవీ చానెల్లో ప్రసారం కానుంది? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్లో స్ట్రీమింగ్ కానుంది? అనే అంశాలను టైటిల్స్‌లో కానీ, సినిమా ప్రదర్శనల్లో కానీ, ప్రమోషన్స్‌లో కానీ బహిర్గతం చేయకూడదు. ► థియేటర్స్‌లో రిలీజైన ఓ సినిమా ఎనిమిది వారాల తర్వాతే ఓటీటీలో స్ట్రీమింగ్ కావాలి. థియేట్రికల్ అండ్ ఎగ్జిబిషన్ ► వీపీఎఫ్ (వర్చ్యువల్ ప్రింట్ ఫీ)కి సంబంధించిన చార్జీల విషయమై డిజిటల్ సర్వీస్ ప్రొవైడర్స్‌తో నేడు జరగాల్సిన సమావేశం 6కి వాయిదా పడింది. ► తెలంగాణలో మల్టీప్లెక్స్‌లకు ఎంత పర్సంటేజ్ ఇస్తున్నారో ఇకపై ఆంధ్రప్రదేశ్‌లోనూ అంతే ఇస్తారు. సినీ కార్మికుల సంఘం: ► కార్మికులకు సంబంధించిన సమస్యలపై తుది చర్చలు జరుగుతున్నాయి. రేట్ కార్డ్స్ ఫైనలైజ్ అయ్యాక వీటి వివరాలు అన్ని నిర్మాణ సంస్థలకు పంపించడం జరుగుతుంది. ప్రొడ్యూసర్స్ గిల్డ్, తెలుగు చలన చిత్ర వాణిజ్య మండలి తీసుకున్న నిర్ణయాల విషయమై ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడు మంచు విష్ణుతో చర్చలు జరిపారని భోగట్టా. కొత్త మార్గదర్శకాలను ‘మా’కి లేఖ రూపంలో పంపారని సమాచారం. నటీనటుల వ్యక్తిగత సిబ్బంది పారితోషికం, సొంత రవాణా ఖర్చులు వంటివాటిపై ‘మా’ సుముఖత వ్యక్తపరిచిందట. కొత్త మార్గదర్శకాలను నటీనటులందరికీ ‘మా’ త్వరలో అధికారికంగా పంపనుందని సమాచారం. ► కొత్త మార్గదర్శకాల్లో రోజువారీ వేతనాల గురించిన అంశం ఒకటి. మామూలుగా క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో పెద్ద రేంజ్ ఉన్నవారు రోజువారీ వేతనాలు తీసుకుంటారు. అయితే ఇకపై వారికి కూడా సినిమాకి ఇంత అని పారితోషికం నిర్ణయించాలనుకుంటున్నారు. మరి.. రోజువారీ వేతనాలు తీసుకునేది ఎవరూ అంటే.. అట్మాస్ఫియర్ కోసం సీన్లో నిలబడేవాళ్లు, అటూ ఇటూ కదులుతూ కనిపించేవాళ్లు, డైలాగ్స్ చెప్పే జూనియర్ ఆర్టిస్టులు .. ఇలా చిన్న స్థాయి కళాకారులు రోజువారీ వేతనాల కిందకు వస్తారు. -
జిల్లా వ్యాప్తంగా భారీ ‘స్పందన’
జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’ మొత్తం అర్జీలు : 1,293 సాధారణ ఫిర్యాదులు : 1,203 ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు : 90 కలెక్టరేట్లో.. జిల్లాస్థాయి ‘స్పందన’కు అర్జీలు : 653 సాధారణ ఫిర్యాదులు : 603 ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు : 50 సాక్షి, అనంతపురం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’ పేరుతో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార దినోత్సవానికి విశేష స్పందన లభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో 1,293 మంది అర్జీలు అందజేశారు. జిల్లాస్థాయి ‘స్పందన’ కార్యక్రమం కలెక్టరేట్లోని రెవెన్యూ భవన్లో నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డితో పాటు ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 653 అర్జీలు అందించారు ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ నిర్ణీత ముగింపు సమయం మధ్యాహ్నం 1.30 గంటల కంటే అదనంగా గంట సమయం నిర్వహించి మధ్యాహ్నం 2.30 గంటలకు ముగించారు. ప్రభుత్వంపై నమ్మకంతో.. రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకం ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. వై.ఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి ప్రజాసంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నారు. ఆయన 30 రోజుల పాలనపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. కొత్త ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనే విశ్వాసం కలిగింది. ఈ కారణంగానే మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చారు. అరగంట ఆలస్యంగా.. జిల్లా కేంద్రంలో ‘స్పందన’ కార్యక్రమం అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ముగింపు మాత్రం ఒక గంట అదనంగా నిర్వహించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 10.30 గంటలకు జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్ఓ ఎం.వి.సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. రాప్తాడు నియోజకవర్గంలో ‘జలశక్తి అభియాన్’ ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు హాజరయ్యారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ చేరుకున్నారు. అప్పటికే రెవెన్యూ భవన్ కింది భాగంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కలెక్టర్ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు సాధారణ ఫిర్యాదులు స్వీకరించారు. మధ్యాహ్నం ఒక గంట నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యాదులు తీసుకున్నారు. పరిష్కార సమయం చూపలేదు.. అర్జీ చేసుకున్న ప్రజలకు ఇచ్చిన రసీదులో సమస్య పరిష్కారానికి సంబంధించి నిర్ణీత సమయం నమోదు చేయలేదు. అర్జీలో స్వీకరించిన తేదీ మాత్రమే ఉంది. పరిష్కార సమయం కూడా నమోదు చేయాలని విధి విధానాల్లో ఉంది. ఈ విషయంపై జేసీ–2 హెచ్.సుబ్బరాజు మాట్లాడుతూ... రాబోయే కార్యక్రమం నుంచి సమస్య పరిష్కార గడువును నమోదు చేయిస్తామన్నారు. 72 గంటల్లోగా పరిష్కారం గత ప్రభుత్వం తరహాలో ప్రజల ఫిర్యాదులను చెత్తబుట్టల పాలు చేయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు అందించే ఫిర్యాదులకు నెంబర్లను కేటాయించి 72 గంటల్లోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించాం. జిల్లా కేంద్రంలో ఉంటే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి హాజరవుతా. – పెనుకొండ ఆర్డీఓ, కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ పేదోడిని.. డబ్బు ఇచ్చుకోలేను మాది బుక్కరాయసముద్రం మండలంలోని చెదల్ల గ్రామం. తాడిపత్రి గ్రామ సర్వే నెం.436–ఏలో 3.80 ఎకరాలు, 436–సీలో 2.16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి నా కుమార్తెల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు చేయించేందుకు మీసేవలో ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రతిసారీ వీఆర్వో గంగన్న దరఖాస్తు తిరస్కరణకు గురైందనే చెబుతున్నాడు. ఇప్పటికే రూ.5వేలు ఇచ్చినా.. మరో రూ.10వేలు ఇవ్వాలంటున్నాడు. పేదోడిని, ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది సార్. – జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు రైతు నరసింహారెడ్డి ఫిర్యాదు – స్పందన: తాడిపత్రి తహసీల్దార్ గోపాల్‌రెడ్డితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. -
ప్రశ్నిస్తే వార్నింగ్..లేదంటే బూతుపురాణం
-
బాల... ఏమిటీ గోల !
- ప్రశ్నిస్తే వార్నింగ్.. లేదంటే బూతుపురాణం - ఇంటింటికీ తెలుగుదేశంలో ఇదీ నేతల తీరు - సమస్యలు చెప్పుకోవాలంటేనే బెంబేలెత్తుతున్న జనం - ఎమ్మెల్యే తీరుతో పాటు తమ్ముళ్ల వైఖరిపై ప్రజల అసంతృప్తి ‘ఇంటింటికీ తెలుగు దేశం’ అంటూ ఎంతో ఆర్భాటంగా జనాల్లోకి వెళ్తున్న టీడీపీ నేతలు రెచ్చిపోతున్నారు. తాము చెప్పిందే వినాలి తప్ప ఎదురు ప్రశ్నించకూడదన్న ధోరణిలో వ్యవహరిస్తున్నారు. కాదూ కూడదని మాట్లాడితే వార్నింగ్‌లు ఇప్పించేస్తున్నారు. లేదంటే బూతుపురాణాన్ని అందుకుంటున్నారు. వారి వైఖరిపై ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. శింగనమల: తెలుగు దేశం పార్టీ నిర్వహిస్తున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని శింగనమల నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ప్రభుత్వవిప్ యామినీబాలతో పాటు తెలుగు తమ్ముళ్లు గత కొద్ది రోజులుగా నిర్వహిస్తున్నారు. ఇక్కడి వరకు బాగానే ఉన్నా ఈ కార్యక్రమంలో ప్రజలు సమస్యలు విన్నవిస్తే వారిని నానా బూతులు తిట్టడం, ప్రశ్నించిన వారిపై తిరిగి పోలీసులను పంపి భయాభ్రాంతులకు గురి చేయడం వంటి వాటిని చేస్తుండటంపై అటు జనాలతో పాటు ఇటు ప్రతిపక్ష పార్టీల నేతలు పెదవి విరుస్తున్నారు. ప్రశ్నిస్తే అంతే...! గార్లదిన్నె మండలం ఇల్లూరు గ్రామంలో రైతులు, ప్రజలు హెచ్ఎల్సీ కాలువకు నీరు వదిలేలా చూడాలంటూ ఇంటింటికీ టీడీపీ కార్యక్రమానికి వచ్చిన ఎమ్మెల్యే యామినీబాల, టీడీపీ నేతలను డిమాండ్ చేశారు. దీంతో ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే యామినీబాల ప్రశ్నించిన జనాలను విమర్శించిన సంగతి తెలిసిందే. మరో టీడీపీ నేత కూడా బూతుపురాణం అందుకోవడం అప్పుడే చర్చనీయాంశమైంది. దీన్ని ఇంకా మరువక ముందే తాజాగా శింగనమల మండలం రఘునాథపురంలో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. రఘునాథపురం గ్రామంలో గురువారం ఇంటింటికీ తెలుగు దేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో భాగంగానే గ్రామానికి చెందిన వృద్ధురాలు సుంకమ్మ ఇంటి దగ్గరకు వెళ్లి ఆమె సమస్యలను ఎమ్మెల్యే యామినీబాలనే స్వయంగా అడిగారు. దీంతో ఆమె నీళ్లు , పింఛన్లపై తమ ఆవేదనను ఆమె వెళ్లగక్కింది. నీళ్లు రాక నానా అవస్థలు పడుతున్నామని వృద్ధురాలు చెబుతుంటే... అంతే ఆవేశం దేనికమ్మా అంటూ ఎమ్మెల్యే ఆమెను వారించింది. అటుపై అక్కడి నుంచి వెళ్లిపోయినా ఆ తర్వాత పోలీసులను పురమాయించి ఆ వృద్ధురాలి కుటుంబాన్ని భయపెట్టే ప్రయత్నం చేశారు. మీ ఇంటికి ఫలానా పథకాలు అందించినా ఎమ్మెల్యేనే ప్రశ్నిస్తారా.. మరోసారి ఇలా మాట్లాడొద్దని గద్దించారు. ఎదురు ప్రశ్నిస్తే మాత్రం ఇబ్బందులు పడకతప్పదని హెచ్చరికలు కూడా జారీ చేశారు. పలుచోట్ల కూడా ఇదే రీతిలో ప్రశ్నిస్తున్న జనాలను భయబ్రాంతులకు గురిచేస్తూ మేము చెప్పిందే వినాలని, లేకుంటే మీరు లబ్ధి పొందిన వివరాలు తెప్పించుకొని , వీటిని రికవరీ చేస్తామని వార్నింగ్‌లు ఇస్తున్నారన్న ఆరోపణలున్నాయి. దీంతో ఇంటింటికీ టీడీపీలో నోరు తెరిచేందుకే జనం బెంబేలెత్తిపోతున్నారు. సమస్యల అడిగితే బెదిరింపులా? - గోపాలు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి, శింగనమల ప్రజా ప్రతినిధులు గ్రామాల్లోకి వచ్చినప్పడు ప్రజలు సమస్యలను పరిష్కరించాలని అడగడం సహజం. అంతమాత్రనికే పోలీసులను పంపి టీడీపీ నేతలు భయపెడుతున్నారు. ఇది ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలా కాదు... ఇంటింటికీ వార్నింగ్‌లు ఇస్తున్నట్లుగా ఉంది. సమస్యలు వినే ఓపిక లేకపోతే ఎలా? - చెన్నకేశవులు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్, శింగనమల టీడీపీ నాయకులకు ప్రజా సమస్యలే వినే ఓపికే లేదు. గ్రామాల్లో ప్రజలు బాధలను చెప్పుకునే ప్రయత్నం చేస్తే వారిని బెంబేలెత్తించడం తగదు. ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ప్రజా సమస్యలను పరిష్కరించకపోతే ఎలా? ఇప్పటికైనా యామినీబాల తన తీరును మార్చుకుంటే మేలు. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మెలోకి...
ఉద్యోగ, కార్మిక సంఘాలకు ఐక్య కార్యాచరణ సమితి పిలుపు హైదరాబాద్: మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు సోమవారం రాష్ట్రవ్యాప్తంగా నిరనసలు చేపట్టనున్నారు. గత కొంతకాలంగా తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వానికి విన్నవించినా స్పందించకపోవడంతో మున్సిపల్ కార్యాలయాల ఎదుట ధర్నాలు, నిరసనలు చేపట్టేందుకు మున్సిపల్ ఉద్యోగ, కార్మిక ఐక్య కార్యాచరణ కమిటీ (జేఏసీ) పిలుపునిచ్చింది. మొత్తం 111 మున్సిపాలిటీల్లో సోమవారం అన్ని కార్మిక సంఘాలు తమ సమస్యల పరిష్కారం కోసం నినదించనున్నాయి. తమ సమస్యలు పరిష్కరించకపోతే జులై 1నుంచి సమ్మె చేస్తామని జూన్ 16న సమ్మె నోటీసు ఇచ్చినా ప్రభుత్వం తాత్సారం చేయడంపై పలు కార్మిక సంఘాలు తీవ్రంగా మండిపడ్డాయి. అన్ని మున్సిపాలిటీల్లో సేవలను స్తంభింపచేయాలని ఆయా సంఘాలు పిలుపునిచ్చాయి. ఉద్యోగులు, కార్మికుల ప్రధాన డిమాండ్లు ఇవే: మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు 10వ వేతన సవరణ కమిటీ సిఫార్సులు వర్తింపచేయాలి. ఈ సవరణ ప్రకారం కనీసం వేతనం రూ.15432 ఇవ్వాలి. ఇంజనీరింగ్ కార్మికులకు స్కిల్డ్, సెమీ స్కిల్డ్ జీతాలు ఇవ్వాలి. ఎన్ఎంఆర్, కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించాలి. పర్మినెంట్ ఉద్యోగులకు జీపీఎఫ్ అకౌంట్లు, హెల్త్ కార్డులు, 010 పద్దు ద్వారా జీతాలు ఇవ్వాలి. స్కూల్ స్వీపర్స్, ఇతర పార్ట్‌టైమర్లకు కనీస వేతనాలు వర్తింపచేయాలి. చర్చలకు ఆహ్వానించిన ప్రభుత్వం మున్సిపల్ కార్మికులు, ఉద్యోగులు నిరసనలు, సమ్మెకు పిలుపునివ్వడంతో పలు కార్మిక సంఘాలను చర్చలకు ఆహ్వానించింది. ఈమేరకు కార్మిక నాయకులకు ఆహ్వానం అందింది. పురపాలక శాఖ మంత్రి డా.పి.నారాయణ ఆధ్వర్యంలో సోమవారం సచివాలయంలో చర్చలు జరగనున్నాయి. "సమస్యలు పరిష్కరించకపోతే యథావిధిగా ప్రకటించినట్టు జులై 1నుంచి సమ్మె చేస్తాం. సమస్యల పరిష్కారానికి ఇప్పటికే అన్ని కార్మిక సంఘాలూ మద్దతు తెలిపాయి. ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో సమస్యలు పరిష్కారమయ్యే వరకూ ఉద్యమిస్తాం. తమ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంగీకరిస్తుందనే ఆశిస్తున్నాం" అని సీఐటీయూ జేఏసీ నాయకులు కె.ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. -
నెట్లోనే అర్జీలు
సీతంపేట: పలు సార్లు అధికారులకు ఫిర్యాదు చేశాం... పాలకులకు విన్నవిం చాం... కార్యాలయాల చుట్టూ ప్రదక్షణలు చేస్తూనే ఉన్నాం... అయినా.. సమస్యకు పరిష్కారం దొరకలేదంటూ వాపోయేవారిని వందల మందిని నిత్యం చూస్తుంటాం. అయితే.. ఇలాంటి సినిమా కష్టాలతో ఇక పని ఉండదు. ఆ పరిస్థితి నుంచి బయటపడే సరికొత్త పోకడలు అందుబాటులోకి వచ్చాయి. నెట్‌ను వినియోగించుకుని సమస్యలపై అర్జీలను అందజేయవచ్చు. ఆన్లైన్లో జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారులతో పాటు పాలకులకు ఫిర్యాదు చేసుకోవచ్చు. సమస్య పరిష్కారం ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవచ్చు. రాష్ట్ర దేశ ప్రజాప్రతినిధులను మొదలుకొని, రాష్ర్టపతి వరకు ఫిర్యాదు చేయొచ్చు. అదెలాగో చూద్దాం. రాష్ట్రపతికి వినతిపత్రం ఇలా... రాష్ట్రపతికి వినతిపత్రం పంపించాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్యూ. ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా.ఎన్ఐసీ.ఇన్. వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. కుడివైపున హెల్ప్‌లైన్ పోర్టల్ కనిపిస్తుంది. దీన్ని క్లిక్ చేస్తే ప్రెసిడెంట్ సెక్రేటేరియేట్ అనే పేజీ తెరుచుకుంటుంది. అక్కడ కనిపించే లోడేజ్ ఎ రిక్వస్ట్ పై క్లిక్ చేస్తే రిజిస్ట్రేషన్ ఫారం వస్తుంది. దాన్ని నింపి గ్రీవెన్స్ డిస్క్రిప్షిన్ బాక్సులో సమస్యను టైప్‌చేసి పీడీఎఫ్ రూపంలో అప్లోడ్ చేయాలి. అనంతరం రిజిస్ట్రేషన్ నంబర్ వస్తుంది. దీన్ని గుర్తించుకుంటే మన సమస్య ఎంతవరకు పరిష్కారమైందో తరువాత తెలుసుకోవచ్చు. ూ గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలంటే.. ఏపీరాజ్‌భవన్ ఎట్‌ద రేట్ ఆఫ్ జిమెయిల్.కామ్‌కు మెయిల్ చేయాలి. ూ ముఖ్యమంత్రికి ఫిర్యాదు చేయాలంటే డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఏపీ.జీవోవి.ఇన్ అనే వెబ్‌సైట్‌ను ఓపెన్ చేయాలి. పేజీ ఓపెన్ కాగేనే ఎడమవైపు దిగువభాగంలో సిటిజన్ ఇంటర్ఫేస్ అనే పోర్టల్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేసి ఈ మెయిల్ ఐడీ నమోదు చేసి ఫిర్యాదు చేయవచ్చు. -
అంగన్వాడీల ఆందోళన
నెల్లూరు (రవాణా): అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కార్యకర్తలు, ఆయాలు రొడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండల కార్యాలయాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈరీతిలోనే మంగళ, బుధవారాల్లో కూడా దీక్షలు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. 13న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు అవమానించారంటూ పలువురు అంగన్వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం మహిళల సమస్యలను వినడానికి కూడా తీరికలేదంటూ శాపనార్ధాలు పెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నేరవేర్చరాంటూ పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 1,100కు పైగా అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలు కలిపి సుమారు 7,400 మంది పనిచేస్తున్నారు. అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ గత కొన్నేళ్లుగా ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు, సమ్మె ఫలితంగా 2014 ఫిబ్రవరిలో అంగన్వాడీల సమస్యలును పరిష్కరిస్తామని అప్పటి ప్రిన్స్‌పల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. అంగన్వాడీలకు సంబంధించి మొత్తం 7డిమాండ్లను ఆమోదిస్తున్నట్లు హామీ లభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు డిమాండ్లు ఆమోదంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓ జారీ చేయలేదు. డిమాండ్లపై ఆమోదం కూడా లభ్యం అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రిటైర్మెంట్ బెనిఫిట్ సౌకర్యాలను వెంటనే కల్పించాలి. అంగన్వాడీలకు పింఛన్ సౌకర్యాన్ని అమలుచేయాలి. ఆయా కేంద్రాల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు వేతనాన్ని పెంచాలి. కనీస వేతనం రూ. 15వేలుగా నిర్ణయించాలి. అంగన్వాడీలకు వేసవిలో మేనెల పొడవునా సెలవులు ప్రకటించాలి. యూనిఫాం నాసిరకంగా ఉండటంతో 2 జతలకు కలిపి రూ. 600లు డబ్బులు కార్యకర్తలకు ఇవ్వాలి. పదవీ విరమణ తర్వాత కార్యకర్తకు రూ. 30వేలు, ఆయాకు రూ.20 వేలు ఇవ్వాలి. వీటిని పరిష్కరిస్తామంటూ గత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది. సీఎం అపాయింట్మెంట్ కరువు రాష్ట్రప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా సీఎం అపాయిట్మెంట్ దొరకలేదని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్వాడీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీఎంకు ఆరుసార్లు అర్జీ పెట్టినా ఆయన నుంచి ఎలాంటి అనుమతి రాలేదంటున్నారు. విధిలేని పరిస్ధితుల్లోనే రోడ్డెక్కాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్వాడీల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. దీక్షలకు ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 16న చలో హైదరాబాద్‌కు పిలుపు నేపథ్యంలో అక్కడ అంగన్వాడీల తమ సత్తా చూపుతామంటున్నారు. మహిళా దినోత్సవం రోజున అవమానం... అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున మహిళలుగా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని పలువురు అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఫ్లకార్డుల ప్రదర్శిస్తే, మీసంగతి తేలుస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంగన్వాడీలు మండిపడుతున్నారు. మహిళలను ఆవిధంగా అవమానించడం ముఖ్యమంత్రిగా తగదని పలువరు మహిళలు విచారం వ్యక్తం చేస్తున్నారు. సీఎం అవమానించారు, మహిళా దినోత్సవం రోజున సీఎం అవమానించడం బాధాకరం, కనీస బాధ్యత లేకుండా సీఎం అలా ప్రవర్తించారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతాం. - ఎల్.వి.శేషమ్మ, అంగన్వాడీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు -
రియల్ రియాలిటీ షోస్
టీవీక్షణం: టీవీ వినోదం కోసమూ, విజ్ఞానం కోసమూ ఉందనుకుంటాం మనం. కానీ అది సమస్యల్ని కూడా పరిష్కరిస్తుందని తెలుసా?! కొన్ని చానెళ్లు సమస్యల్ని దృష్టిలో ఉంచుకుని కొన్ని రియాలిటీ షోలను రూపొందించాయి. ఆ సమస్యలకు పరిష్కారం చూపేందుకు నడుం కట్టాయి. అలాంటి ప్రతి షో విజయం సాధించింది. ఎందుకంటే... సమస్య లేని మనిషి ఉండడు కాబట్టి! సమస్య అంటూ ఉన్న తర్వాత పరిష్కారం కావాలి కాబట్టి! బుల్లితెరపై ‘సత్యమేవ జయతే’ ఓ సంచలనం. సమాజంలోని పలు సమస్యలను వెలికి తీసి, ఆ సమస్య బాధితులందరినీ ఒక వేదిక మీదికి తెచ్చి, సమస్య మూలాల్లోకి వెళ్లి కూలంకషంగా చర్చించి, చివరికి దానికి పరిష్కారాన్ని కూడా చూపిస్తుంది ఈ ప్రోగ్రామ్. అందుకే ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. ఓ గొప్ప విషయం ఏమిటంటే... ఆమిర్‌ఖాన్ తన షో ద్వారా చూపించిన పరిష్కారాలను నాయకులు, అధికారులు అమలు చేస్తున్నారు! ఈ విధంగా సామాజిక సమస్యల మీద ఎలుగెత్తే కార్యక్రమాలు అరుదు. మొదట్లో కొన్ని ఇంగ్లిష్ చానెళ్లు ఇలాంటి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టినా, అవి న్యాయపరమైన సమస్యల చుట్టూనే ఎక్కువ తిరిగాయి. కోర్ట్ రూమ్, ఫేమస్ జ్యూరీ ట్రయల్స్, యువర్ విట్నెస్, గుడ్‌విల్ కోర్ట్ అంటూ పలు రకాల ప్రోగ్రామ్స్ ప్రసారమయ్యాయి. అదే మన దేశంలో అయితే కుటుంబ సమస్యల ఆధారంగా తీసినవే ఎక్కువ. కలర్స్ చానెల్ వారు బాంధవ్యాల మధ్య వచ్చే వైరుధ్యాలను రూపుమాపేందుకు పెట్టిన షో ‘ఆమ్నా సామ్నా’. సమస్యల వెనుక కారణాలను అన్వేషించి, పరిష్కారాలను చూపెట్టేవారు. అవసరమైతే వైద్య, న్యాయ, చట్ట పరమైన సహకారాన్ని కూడా అందించేవారు. జీ తెలుగువారు ప్రసారం చేసిన ‘బతుకు జట్కా బండి’ కూడా ఇటువంటిదే. సుమలత హోస్ట్‌గా వ్యవహరించిన ఈ షో.. తెలుగు రియాలిటీ షోలలో ఓ ప్రత్యేకతను సంతరించుకుంది. సున్నితమైన సమస్యలను సుతిమెత్తగా డీల్ చేసిన విధానం ఆ షోకి అవార్డుల పంటను పండించింది. స్టార్‌ప్లస్‌లో ప్రసారమైన ‘ఆప్కీ కచేరీ’ని కిరణ్‌బేడీ నిర్వహించడంతో... అక్కడికి వెళ్తే సమస్య తీరుతుందన్న విశ్వాసం అందరిలో పెరిగింది. జీ తమిళ్ చానెల్ వారి ‘సొల్వతెల్లమై ఉన్నమై’ కూడా మంచి విజయం సాధించింది. నటి లక్ష్మీ రామకృష్ణన్ పక్షపాతం లేకుండా, నిజానిజాలను అంచనావేస్తూ, న్యాయబద్దంగా షోని నిర్వహించారు. తమ సమస్యల్ని కూడా పరిష్కరించమంటూ రోజుకు దాదాపు రెండు వేలమంది ఆ చానెల్ ఆఫీసుకు ఫోన్ చేసేవారంటే అర్థం చేసుకోవచ్చు... ఆ షో ఎంతగా అందరి మనసులనూ చూరగొందో! అయితే ఈ కార్యక్రమాలు చూసేటప్పుడు ప్రేక్షకులకు చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది... పార్టిసిపెంట్స్ నిజంగా బాధితులేనా లేక కల్పిత పాత్రలా అని! నిజానికి కొన్ని షోలలో బాధితులు నిజమైనవారే అయినా, కొన్నింటిలో మాత్రం విచారణ వెనుక సాగించి, ఆ మొత్తం వ్యవహారాన్నీ నటులతో చిత్రించి, వాటిని ప్రసారం చేస్తుంటారు. బాధితుల గురించి అందరికీ తెలియడం మంచిది కాదన్న ఉద్దేశంతో ఇలా చేయాల్సి వస్తుంది. ఏది ఏమైనా... ఇలాంటి షోల వల్ల ఎందరి సమస్యలకో పరిష్కారం దొరుకుతున్నట్లు అవుతోంది. తాము వేయాల్సిన అడుగు ఏమిటో అర్థమవుతోంది. అందుకే నిజ సమస్యల ఆధారంగా తెరకెక్కిన ప్రతి షో విజయవంతమవుతోంది!