జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’
మొత్తం అర్జీలు : 1,293
సాధారణ ఫిర్యాదులు : 1,203
ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు : 90
కలెక్టరేట్‌లో..
జిల్లాస్థాయి ‘స్పందన’కు అర్జీలు : 653
సాధారణ ఫిర్యాదులు : 603
ఎస్సీ, ఎస్టీల ఫిర్యాదులు : 50
సాక్షి, అనంతపురం అర్బన్: రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆదేశాల మేరకు ప్రజల సమస్యల పరిష్కారానికి జిల్లా వ్యాప్తంగా ‘స్పందన’ పేరుతో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార దినోత్సవానికి విశేష స్పందన లభించింది. గ్రామ స్థాయి నుంచి జిల్లా వరకు నిర్వహించిన కార్యక్రమాల్లో 1,293 మంది అర్జీలు అందజేశారు. జిల్లాస్థాయి ‘స్పందన’ కార్యక్రమం కలెక్టరేట్‌లోని రెవెన్యూ భవన్‌లో నిర్వహించారు. ప్రజల నుంచి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జేసీ ఎస్.డిల్లీరావు, జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డితో పాటు ఇతర అధికారులు అర్జీలు స్వీకరించారు. కలెక్టరేట్‌లో వివిధ సమస్యలపై ప్రజల నుంచి 653 అర్జీలు అందించారు ఫిర్యాదుల స్వీకరణ ప్రక్రియ నిర్ణీత ముగింపు సమయం మధ్యాహ్నం 1.30 గంటల కంటే అదనంగా గంట సమయం నిర్వహించి మధ్యాహ్నం 2.30 గంటలకు ముగించారు.
ప్రభుత్వంపై నమ్మకంతో..
రాష్ట్రంలో నూతనంగా ఏర్పడిన వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం తమ సమస్యలు పరిష్కరిస్తుందనే నమ్మకం ప్రజల్లో స్పష్టంగా కనిపించింది. వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన క్షణం నుంచి ప్రజాసంక్షేమం దిశగా పాలన సాగిస్తున్నారు. ఆయన 30 రోజుల పాలనపై ప్రజలకు పూర్తిగా నమ్మకం ఏర్పడింది. కొత్త ప్రభుత్వంతో తమ సమస్యలు చెప్పుకుంటే పరిష్కారం అవుతాయనే విశ్వాసం కలిగింది. ఈ కారణంగానే మునుపెన్నడూ లేని విధంగా ప్రజలు తమ సమస్యలను విన్నవించుకునేందుకు భారీగా తరలివచ్చారు.
అరగంట ఆలస్యంగా..
జిల్లా కేంద్రంలో ‘స్పందన’ కార్యక్రమం అర గంట ఆలస్యంగా ప్రారంభమైంది. అయితే ముగింపు మాత్రం ఒక గంట అదనంగా నిర్వహించారు. కార్యక్రమం ఉదయం 10 గంటలకు ప్రారంభం కావాల్సి ఉండగా.. 10.30 గంటలకు జేసీ–2 హెచ్.సుబ్బరాజు, డీఆర్‌ఓ ఎం.వి.సుబ్బారెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభమైంది. రాప్తాడు నియోజకవర్గంలో ‘జలశక్తి అభియాన్’ ప్రారంభ కార్యక్రమానికి కలెక్టర్ ఎస్.సత్యనారాయణ, జాయింట్ కలెక్టర్ ఎస్.డిల్లీరావు హాజరయ్యారు. అక్కడ కార్యక్రమం ముగించుకుని ఉదయం 11.30 గంటలకు కలెక్టరేట్ చేరుకున్నారు.
అప్పటికే రెవెన్యూ భవన్ కింది భాగంలో దివ్యాంగులు పెద్ద ఎత్తున చేరుకున్నారు. కలెక్టర్ వారితో మాట్లాడి సమస్యలు తెలుసుకున్నారు. సంబంధిత అధికారులను అక్కడికి పిలిపించి సమస్యలను పరిశీలించి వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒక గంట వరకు సాధారణ ఫిర్యాదులు స్వీకరించారు. మధ్యాహ్నం ఒక గంట నుంచి మధ్యాహ్నం 2.30 గంటల వరకు ఎస్సీ, ఎస్టీ వర్గాల ఫిర్యాదులు తీసుకున్నారు.
పరిష్కార సమయం చూపలేదు..
అర్జీ చేసుకున్న ప్రజలకు ఇచ్చిన రసీదులో సమస్య పరిష్కారానికి సంబంధించి నిర్ణీత సమయం నమోదు చేయలేదు. అర్జీలో స్వీకరించిన తేదీ మాత్రమే ఉంది. పరిష్కార సమయం కూడా నమోదు చేయాలని విధి విధానాల్లో ఉంది. ఈ విషయంపై జేసీ–2 హెచ్.సుబ్బరాజు మాట్లాడుతూ... రాబోయే కార్యక్రమం నుంచి సమస్య పరిష్కార గడువును నమోదు చేయిస్తామన్నారు.
72 గంటల్లోగా పరిష్కారం
గత ప్రభుత్వం తరహాలో ప్రజల ఫిర్యాదులను చెత్తబుట్టల పాలు చేయం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఎంతో ప్రతిష్టాత్మకంగా ‘స్పందన’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు అందించే ఫిర్యాదులకు నెంబర్లను కేటాయించి 72 గంటల్లోగా పరిష్కరించేలా అధికారులను ఆదేశించాం. జిల్లా కేంద్రంలో ఉంటే ప్రతి సోమవారం స్పందన కార్యక్రమానికి హాజరవుతా.
– పెనుకొండ ఆర్డీఓ, కార్యాలయంలో నిర్వహించిన ‘స్పందన’ కార్యక్రమంలో మంత్రి మాలగుండ్ల శంకరనారాయణ
పేదోడిని.. డబ్బు ఇచ్చుకోలేను
మాది బుక్కరాయసముద్రం మండలంలోని చెదల్ల గ్రామం. తాడిపత్రి గ్రామ సర్వే నెం.436–ఏలో 3.80 ఎకరాలు, 436–సీలో 2.16 ఎకరాల భూమి ఉంది. ఈ భూమి నా కుమార్తెల పేరిట పట్టాదారు పాసు పుస్తకాలు చేయించేందుకు మీసేవలో ఆరుసార్లు దరఖాస్తు చేసుకున్నా. ప్రతిసారీ వీఆర్వో గంగన్న దరఖాస్తు తిరస్కరణకు గురైందనే చెబుతున్నాడు. ఇప్పటికే రూ.5వేలు ఇచ్చినా.. మరో రూ.10వేలు ఇవ్వాలంటున్నాడు. పేదోడిని, ఎక్కడి నుంచి తెచ్చిచ్చేది సార్.
– జిల్లా కలెక్టర్ ఎస్.సత్యనారాయణకు రైతు నరసింహారెడ్డి ఫిర్యాదు
– స్పందన: తాడిపత్రి తహసీల్దార్ గోపాల్‌రెడ్డితో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడారు. సాయంత్రంలోగా సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు.
Comments
Please login to add a commentAdd a comment