అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కార్యకర్తలు, ఆయాలు రొడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండల కార్యాలయాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు.
నెల్లూరు (రవాణా): అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ సోమవారం కార్యకర్తలు, ఆయాలు రొడ్డెక్కారు. జిల్లావ్యాప్తంగా ఆయా మండల కార్యాలయాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించారు. ఈరీతిలోనే మంగళ, బుధవారాల్లో కూడా దీక్షలు చేయాలని కమిటీ పిలుపునిచ్చింది. 13న ఆర్డీఓ కార్యాలయాల ఎదుట ధర్నాలు నిర్వహించాలని నిర్ణయించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం రోజున సీఎం చంద్రబాబు అవమానించారంటూ పలువురు అంగన్‌వాడీలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
కనీసం మహిళల సమస్యలను వినడానికి కూడా తీరికలేదంటూ శాపనార్ధాలు పెట్టారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను కూడా నేరవేర్చరాంటూ పలువురు మహిళలు ఆందోళన వ్యక్తం చేశారు. జిల్లాలో మొత్తం 1,100కు పైగా అంగన్‌వాడీ కేంద్రాలు ఉన్నాయి. ఆయా కేంద్రాల్లో కార్యకర్తలు, ఆయాలు కలిపి సుమారు 7,400 మంది పనిచేస్తున్నారు.
అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరించాలంటూ గత కొన్నేళ్లుగా ఉద్యమాలు, ధర్నాలు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు, సమ్మె ఫలితంగా 2014 ఫిబ్రవరిలో అంగన్‌వాడీల సమస్యలును పరిష్కరిస్తామని అప్పటి ప్రిన్స్‌పల్ సెక్రటరీ హామీ ఇచ్చారు. అంగన్‌వాడీలకు సంబంధించి మొత్తం 7డిమాండ్లను ఆమోదిస్తున్నట్లు హామీ లభించింది. అప్పటినుంచి ఇప్పటివరకు డిమాండ్లు ఆమోదంపై ప్రభుత్వం నుంచి ఎలాంటి జీఓ జారీ చేయలేదు.
డిమాండ్లపై ఆమోదం కూడా లభ్యం
అంగన్‌వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. రిటైర్‌మెంట్ బెనిఫిట్ సౌకర్యాలను వెంటనే కల్పించాలి. అంగన్‌వాడీలకు పింఛన్ సౌకర్యాన్ని అమలుచేయాలి. ఆయా కేంద్రాల్లో కొన్నేళ్లుగా పనిచేస్తున్న కార్యకర్తలు, ఆయాలకు వేతనాన్ని పెంచాలి. కనీస వేతనం రూ. 15వేలుగా నిర్ణయించాలి. అంగన్‌వాడీలకు వేసవిలో మేనెల పొడవునా సెలవులు ప్రకటించాలి. యూనిఫాం నాసిరకంగా ఉండటంతో 2 జతలకు కలిపి రూ. 600లు డబ్బులు కార్యకర్తలకు ఇవ్వాలి. పదవీ విరమణ తర్వాత కార్యకర్తకు రూ. 30వేలు, ఆయాకు రూ.20 వేలు ఇవ్వాలి. వీటిని పరిష్కరిస్తామంటూ గత ప్రభుత్వం ఆమోదం కూడా తెలిపింది.
సీఎం అపాయింట్‌మెంట్ కరువు
రాష్ట్రప్రభుత్వం ఏర్పడి 10 నెలలు అయినా సీఎం అపాయిట్‌మెంట్ దొరకలేదని అంగన్‌వాడీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలంటూ అంగన్‌వాడీ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీఎంకు ఆరుసార్లు అర్జీ పెట్టినా ఆయన నుంచి ఎలాంటి అనుమతి రాలేదంటున్నారు. విధిలేని పరిస్ధితుల్లోనే రోడ్డెక్కాల్సి వస్తుందని చెబుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో కూడా అంగన్‌వాడీల సమస్యలను పరిష్కరిస్తామని ఇచ్చిన హామీని ముఖ్యమంత్రి చంద్రబాబు నిలబెట్టుకోవాలని పలువురు కోరుతున్నారు. దీక్షలకు ప్రభుత్వం స్పందించకుంటే ఈనెల 16న చలో హైదరాబాద్‌కు పిలుపు నేపథ్యంలో అక్కడ అంగన్‌వాడీల తమ సత్తా చూపుతామంటున్నారు.
మహిళా దినోత్సవం రోజున అవమానం...
అంతర్జాతీయ మహిళాదినోత్సవం రోజున మహిళలుగా సమస్యలు చెప్పుకునే పరిస్థితి లేదని పలువురు అంగన్‌వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమస్యలు పరిష్కరించాలని ఫ్లకార్డుల ప్రదర్శిస్తే, మీసంగతి తేలుస్తానంటూ చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై అంగన్‌వాడీలు మండిపడుతున్నారు. మహిళలను ఆవిధంగా అవమానించడం ముఖ్యమంత్రిగా తగదని పలువరు మహిళలు విచారం వ్యక్తం చేస్తున్నారు.
సీఎం అవమానించారు,
మహిళా దినోత్సవం రోజున సీఎం అవమానించడం బాధాకరం, కనీస బాధ్యత లేకుండా సీఎం అలా ప్రవర్తించారు. సమస్యలను పరిష్కరించకుంటే రాష్ట్రవ్యాప్త ఉద్యమాలు చేపడతాం.
- ఎల్.వి.శేషమ్మ, అంగన్‌వాడీల అసోసియేషన్ జిల్లా అధ్యక్షురాలు