ప్రొద్దుటూరు వాసి సౌదీ అరేబియాలో మృతి
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని కేసన్న సత్రం వీధికి చెందిన షేక్ మహబూబ్‌బాష అలియాస్ ఆజాద్ (42) మంగళవారం సౌదీ అరేబియాలో గుండెపోటుతో మృతి చెందాడు. అతనికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. బతుకుదెరువు కోసం సౌదీకి వెళ్లిన అతను ఉన్నట్టుండి మృత్యుపాలు కావడంతో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. ఆజాద్ పట్టణంలోని గాంధీ రోడ్డులో సెల్పాయింట్ నిర్వహించే వాడు. అతనికి 14 ఏళ్ల క్రితం జమ్మలమడుగుకు చెందిన ఫరీదాతో వివాహం అయింది. వారికి రింషా, సోనియా అనే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. రింషా 10వ తరగతి చదువుతుండగా, రెండో కుమార్తె 8వ తరగతి చదువుతోంది.
సెల్‌పాయింట్‌లో అంతంత మాత్రమే ఆదాయం రావడంతో రెండేళ్ల క్రితం సౌదీ అరేబియాలోని రియాజ్‌కు ‘ఆజాద్ విసా’పై వెళ్లాడు. ఆరేడు నెలల పాటు పని చేసినప్పటికీ అక్కడ పని చేయించుకున్న కఫిల్ జీతం ఇవ్వలేదు. దీంతో ఆజాద్ ఇటీవలే కఫిల్‌పై అక్కడి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు.
బాకీలు అధికంగా ఉండటంతో ఏమి చేయాలో పాలుపోని ఆజాద్.. కఫిల్ వద్ద నుంచి పక్కకు వచ్చి ఓ సంస్థలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. సాధారణంగా సౌదీలో ఉంటున్న వ్యక్తులు తరచూ సెల్ఫోన్లలో మాట్లాడుతుంటారు. అయితే ఆజాద్ మాత్రం ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో నెలకు ఒకటి రెండు సార్లు మాత్రమే ఇంటికి ఫోన్ చేసి భార్యా పిల్లలతో సంభాషించే వాడు.
గుండెపోటుతో కుప్పకూలిన ఆజాద్
ఈ క్రమంలో మంగళవారం ఉదయం విధులకు వెళ్లిన ఆజాద్ ఉన్నట్టుండి కుప్పకూలిపోయాడు. అక్కడున్న సహచరులు వెంటనే చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు పరిశీలించి నిర్ధారించారు. విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. సన్నిహితులు, బంధువులు పెద్ద ఎత్తున ప్రొద్దుటూరులోని ఆజాద్ ఇంటికి చేరుకుని భార్యా పిల్లలను ఓదార్చ సాగారు.
మృతదేహాన్నిఇండియాకు తరలించాలంటే సుమారు రూ.3 లక్షలు దాకా ఖర్చవుతుందని సౌదీలో ఉన్న వ్యక్తులు ఇంటికి ఫోన్ చేశారు. అయితే అంత పెద్ద మొత్తాన్ని చెల్లించే స్థోమత లేని వారికి ఏమి చేయాలో పాలుపోలేదు. కడసారి చూపైనా దక్కేందుకు మృతదేహాన్ని ఇండియాకు తీసుకు రావాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఆజాద్ మృతదేహం ఎప్పుడు ఇంటికి వస్తుందోనని కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు.