ప్రయోగపూర్వక అభ్యాసం అవసరం
♦ ఏఎన్యూ వీసీ ప్రొఫెసర్ సాంబశివరావు
♦ వీవీఐటీలో యువ నైపుణ్య దినోత్సవం
నంబూరు(పెదకాకాని) : పాఠశాల స్థాయి నుండే విద్యార్ధులలో ప్రయోగపూర్వక అభ్యాసం అలవాటు చేయాలని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కెఆర్ఎస్ సాంబశివరావు అన్నారు. నంబూరు వాసిరెడ్డి వెంకటాద్రి ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నందు ప్రపంచ యువ నైపుణ్యాల దినోత్సవాన్ని బుధవారం ఘనంగా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ కళాశాలలను పరిసర ప్రాంతాలలో ఉండే పరిశ్రమలతో అవగాహన కుదుర్చుకొని విద్యార్ధులను పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా ఉండేందుకు సంసిద్ధులను చేయాలన్నారు. యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయటం కోసం ప్రభుత్వం కళాశాల విద్యార్ధులకు వివిధ నైపుణ్యాలలో శిక్షణ ఇచ్చేందుకు విశ్వవిద్యాలయాల ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
కళాశాల ఛైర్మన్ వాసిరెడ్డి విద్యాసాగర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రప్రధమంగా వివిఐటి ఇంజనీరింగ్ కళాశాలలో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేశారని , పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఇస్తున్న శిక్షణను విద్యార్దులు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో వర్సిటీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ ఈ శ్రీనివాసరెడ్డి, కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై మల్లికార్జునరెడ్డి, పాలకవర్గం సభ్యులు, అధ్యాపక అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్ధులు పాల్గొన్నారు.