‘ప్రగతి పర్యావరణ శత్రువు కాదు!’
న్యూఢిల్లీ: అభివృద్ధి చెందుతున్న దేశాలు పర్యావరణానికి శత్రువులు కాదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ స్పష్టం చేశారు. ఈ విషయాన్ని అభివృద్ధి చెందిన దేశాలు గుర్తించాలన్నారు. అలాగే, ప్రగతి, వికాసం అనేవి పర్యావరణానికి ప్రతికూలం అనే భావన నుంచి బయటపడాలని ఆ దేశాలకు సూచించారు. పర్యావరణ శాస్త్రాలకు సంబంధించి ప్రపంచవ్యాప్తంగా పాఠశాలల్లో ఒకే సిలబస్ ఉండాలన్నారు. దానివల్ల వాతావరణ మార్పును ఎదుర్కొనేందుకు వారిలో ఉమ్మడి లక్ష్యాలు ఏర్పడతాయని వివరించారు.
వాతావరణ మార్పునకు సంబంధించి అభివృద్ధి చెందుతున్న సారూప్య మనస్క దేశాల(ఎల్ఎండీసీ) ప్రతినిధుల బృందాల తో మోదీ మంగళవారం భేటీ అయ్యారు. త్వరలో పారిస్లో జరగనున్న వాతావరణ మార్పు సదస్సు సన్నాహకాల్లో భాగంగా జరిగిన సమావేశంలో పాల్గొనేందుకు ఆ ప్రతినిధుల బృందాలు భారత్ వచ్చాయి. వాతావరణ మార్పుపై పోరులో భారత్ ఎల్ఎండీసీతో కలిసి నడుస్తుందని మోదీ ఈ సందర్భంగా వారికి హామీ ఇచ్చారు.
ప్రగతి పర్యావరణ శత్రువన్న భావనను ప్రచారం చేస్తున్న వారిని కలసికట్టుగా సమర్థంగా ఎదుర్కోవాల్సి ఉందన్నారు. అలాంటివారు అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనూ ఉన్నారన్నారు. అభివృద్ధి చెందిన దేశాలు కాలుష్య ఉద్గారాలను తగ్గించే ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చెందుతున్న దేశాలతో పంచుకోవడానికి, అవసరమైన ఆర్థిక సాయం అందించేందుకు కట్టుబడి ఉండాలని పేర్కొన్నారు.