Prohibition and Excise
-
ఈడీ అరెస్ట్ వేళ సెంథిల్ తలకు గాయం?
సాక్షి, చెన్నై: ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్ట్చేసినపుడు ఈడీ ఆయన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిందా అనే అనుమానాలను తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(టీఎన్ఎస్హెచ్ఆర్సీ) సభ్యుడొకరు వ్యక్తంచేశారు. అదే జరిగితే ఆ అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ తప్పక పరిశీలిస్తుందని సంస్థ సభ్యుడు కన్నదాసన్ చెప్పారు. రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారనే ఆరోపణలపై సెంథిల్‌ను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్‌చేశారు. అరెస్ట్వేళ సెంథిల్ బిగ్గరగా రోదించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి యాంజియోగ్రామ్ చేయించడం, గుండె నాళంలో బ్లాక్‌లను గుర్తించడం విదితమే. అయితే అర్ధరాత్రి అరెస్ట్ సందర్భంగా తన పట్ల ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తించారని తనను ఆస్పత్రికి కలవడానికి వచ్చిన కన్నదాసన్‌కు సెంథిల్ ఫిర్యాదుచేశారు. ‘ ఈడ్చుకెళ్లారని ఆయన చెప్తున్నారు. లాక్కెళ్లినపుడే ఆయన తలకు గాయమైందట. ఈడీ దురుసు ప్రవర్తన అంశాన్ని టీఎన్ఎస్హెచ్ఆర్సీ పరిశీలిస్తుంది’ అని కన్నదాసన్ చెప్పారు. కాగా, చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలని మంత్రి భార్య మేఘల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స, వైద్య సేవలకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది. రెచ్చ గొట్టొద్దు: కేంద్రంపై స్టాలిన్ ఫైర్ ఈడీ దాడులు, మంత్రి అరెస్టు నేపథ్యంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘డీఎంకే వాడిని. రెచ్చగొట్టొద్దు తట్టుకోలేరు’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. కరుణానిధి చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ.. ‘డీఎంకే వాళ్లు తిప్పి కొట్టడం మొదలెడితే భరించలేరు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మేం చేయని రాజకీయాలు లేవు. మేం చూడని పోరాటాలు లేవు. ఒకసారి చరిత్రను చూసుకోండి’ అని హెచ్చరించారు. ‘ఇది బెదిరింపు కాదు. హెచ్చరిక’ అని అన్నారు. సెంథిల్ అరెస్ట్‌పై స్పందించారు. ‘ ఈడీ ద్వారానే రాజకీయాలు చేద్దామని బీజేపీ చూస్తోంది. ఈడీని అడ్డుపెట్టుకుని పదేళ్లనాటి పాత కేసులో మానసికంగా, శారీరకంగా సెంథిల్‌ను వేధిస్తున్నారు. ఈడీ అధికారులు పెట్టిన మానసిక ఒత్తిడితోనే ఆయనకు హృద్రోగ సమస్యలొచ్చాయి. 18 గంటలు నిర్బంధించిమరీ ప్రశ్నల పరంపర కొనసాగించారు. ఎవ్వరినీ కలవనివ్వలేదు. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించాక ఆస్పత్రికి తరలించారు’ అని ఆరోపించారు. -
తమిళ మంత్రి అరెస్టు
సాక్షి, చెన్నై: ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం. సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో సెంథిల్‌ను సిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేర్పించారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో సెంథిల్ బాలాజీ బిగ్గరగా రోదిస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. గుండెకు సంబంధించిన కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష వైద్యులు నిర్వహించారు. గుండె నాళంలో మూడు చోట్ల బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీకి సిఫారసు చేశారు. బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రం: స్టాలిన్ మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సెంథిల్ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. చెన్నై, కరూర్, ఈరోడ్‌లో ఈ సోదాలు జరిగాయి. తదుపరి విచారణ కోసం ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టుపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కేబినెట్ సహచరుడిని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీ బాలాజీని ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది. తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని ఈడీని ప్రశ్నిస్తూ సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు. -
గంజాయి సరఫరా చేస్తున్న వ్యక్తుల అరెస్టు
గన్‌ఫౌండ్రీ: ధూల్‌పేట్ పరిసర ప్రాంతాల్లో గంజాయి సరఫరా చేస్తున్న ఐదుగురు వ్యక్తులను మంగళవారం ధూల్‌పేట్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి నుంచి 3.045 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ధూల్‌పేట్ అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఎన్. అంజిరెడ్డి తెలిపిన వివరాల ప్రకారం... అప్పర్ ధూల్‌పేట్‌లోని యతీమ్‌ఖానా, బలరాంగల్లీలో గంజాయి అమ్ముతున్న కమినిభాయి, మంజుభాయి అనే ఇద్దరు మహిళలను అదుపులోకి తీసుకొని వారి నుంచి 1.1 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నామన్నారు. వారిచ్చిన సమాచారం ఆధారంగా శంకర్‌సింగ్ నివాసంపై దాడులు నిర్వహించి 120 గంజాయి ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా వీరికి గంజాయి సరఫరా చేస్తున్న జుమ్మెరాత్‌బజార్‌కు చెందిన ముఖేష్‌సింగ్ పరారీలో ఉన్నాడని, ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. మరో ఘటనలో... జంగూరుబస్తీకి చెందిన మహేష్‌సింగ్, రూపేష్‌సింగ్ గత కొన్ని రోజులుగా స్థానికంగా గంజాయిని అమ్ముతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందగా వారి నివాసాలపై దాడులు నిర్వహించి 115 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరికి గంజాయిని సరఫరా చేస్తున్న దీపక్‌సింగ్ పరారీలో ఉన్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దాడుల్లో ధూల్‌పేట్ ఎక్సైజ్ ఇన్స్పెక్టర్లు కె. సైదిరెడ్డి, ఎండీ జైఉద్ధీన్, ఎస్సైలు జశ్వంత్‌నాయుడు, గోపాల్, యాదయ్య, కృష్ణలతో పాటు ఇతర సిబ్బంది పాల్గొన్నారు. -
‘బెల్ట్’ తీశారు..
కర్నూలు: బెల్ట్ దుకాణాల నిర్మూలనపై ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు పూర్తిస్థాయిలో దృష్టి సారించారు. ఏ ప్రాంతంలో బెల్ట్ దుకాణాలు ఉంటే ఆ ప్రాంత అధికారులపై కఠిన చర్యలు తప్పవని ఆ శాఖ కమిషనర్ ఎస్.ఎస్.రావత్ హెచ్చరించిన నేపథ్యంలో రెండు రోజులుగా జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో బెల్టు షాపులపై స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు దాడులు నిర్వహించారు. అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ హెప్సిబా రాణి ఆదేశాల మేరకు స్పెషల్ టాస్క్‌ఫోర్స్ కర్నూలు యూనిట్ సిబ్బంది శుక్రవారం నందికొట్కూరు, కర్నూలు, పత్తికొండ, కోడుమూరు ఎక్సైజ్ స్టేషన్ల పరిధిలో విస్తృతంగా దాడులు నిర్వహించి 65 లీటర్ల నాటుసారా, 95 లిక్కర్ బాటిళ్లు, 5 బీర్లు సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నందికొట్కూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని లక్ష్మాపురంలో సోదాలు నిర్వహించి బెల్ట్ దుకాణం నిర్వాహకుడు ఈడిగ లక్ష్మన్న గౌడ్, కర్నూలు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని నీలిషికారి గాయత్రి నుంచి 10 లీటర్ల నాటుసారా, బుధవారపేటలోని బోయ లక్ష్మీదేవి, బోయ సుంకులమ్మ, బోయ రాజుల నుంచి ఒక్కొక్కరి వద్ద 15 లీటర్ల చొప్పున నాటు సారా స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. పత్తికొండ స్టేషన్ పరిధిలోని హెచ్.కైరవాడి లో బెల్ట్ షాపు నిర్వాహకుడు కటిక హుసేన్ నుంచి 22 మద్యం క్వార్టర్ బాటిళ్లు, కోడుమూరు స్టేషన్ పరిధిలోని సంగాల గ్రామంలో బోయ రాముడు వద్ద 40 క్వార్టర్ బాటిళ్లు, పలుకుదొడ్డి గ్రామంలో ఈడిగ మద్దిలేటి నుంచి 18 క్వార్టర్ బాటిళ్లు, 8 బీర్లను స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడుల్లో స్పెషల్ టాస్క్‌ఫోర్స్ అధికారులు రాముడు, సుధాకర్‌రెడ్డి, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, కానిస్టేబుళ్లు నారాయణ, కృష్ణారెడ్డి, రాజశేఖర్, ప్రదీప్‌కుమార్ పాల్గొన్నారు. -
పట్టువదలం..పోరు విడవం
= ఉద్యమ విస్తరణ = రంగంలోకి కొత్త జేఏసీలు = తాజాగా ప్రైవేటు విద్యాసంస్థల జేఏసీ ఏర్పాటు = ఎక్సైజ్ లో మొదలైన సహాయ నిరాకరణ = విజయవాడ వీధుల్లో నినదించిన విద్యార్థినులు సాక్షి, విజయవాడ : సమైక్య ఉద్యమం రోజురోజుకూ విస్తరిస్తోంది. కొత్త పుంతలు తొక్కుతూ ప్రజల్లో సమైక్య స్ఫూర్తి నింపుతోంది. మొన్నటికిమొన్న ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ అధికారులు తమ ఉద్యోగులతో కలుపుకొని జేఏసీ ఏర్పాటుచేశారు. అదేరోజు నీటిపారుదల శాఖ ఇంజినీర్లు కూడా జేఏసీగా ఏర్పడ్డారు. వారు కార్యాచరణ ప్రణాళిక కూడా సిద్ధం చేసి రంగంలోకి దిగారు. తాజాగా శుక్రవారం మరో జేఏసీ రంగంలోకి వచ్చింది. ప్రైవేటు విద్యాసంస్థల యాజమాన్యాలు, అధ్యాపకులు, విద్యార్థులతో ఆ జేఏసీ విజయవాడలో పురుడుపోసుకుంది. సుమారు కోటిమంది వరకు విద్యార్థులు వారి నాయకత్వంలో ఉన్నారు. ఈ నెల 19 నుంచి విద్యార్థులు, అధ్యాపకులతో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని నిర్ణయించారు. ఉద్యమం శుక్రవారం కూడా ఉధృతంగా సాగింది. ప్రొహిబిషన్ ఎక్సైజ్‌శాఖ అధికారులు, ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో సహాయ నిరాకర ణ ఉద్యమం ప్రారంభమైంది. ఎక్కడికక్కడ సహాయ నిరాకరణ కార్యక్రమాలు చేపట్టారు. అనేకచోట్ల అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలు ధరించారు. కొన్నిచోట్ల ధర్నాలు చేశారు. విజయవాడలో విద్యార్థి జేఏసీ నాయకుడు దేవినేని అవినాష్ నాయకత్వంలో విద్యార్థినులు ప్రదర్శన నిర్వహించారు. సమైక్యాంధ్రకు మద్దతుగా జగ్గయ్యపేటలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. దీక్షలకు వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్ సామినేని ఉదయభాను మద్దతు తెలిపారు. జేఏసీ నాయకులు పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. సమ్మెలో ఉన్న ఆర్టీసీ ఉద్యోగులకు జేఏసీ నాయకులు నిత్యావసర సరకులు అందజేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా కొండపల్లిలో ఉపాధ్యాయులు నిర్వహిస్తున్న రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఇక్కడ రిక్షా కార్మికులు నిరసన వ్యక్తం చేస్తూ రిక్షాలతో వలయం ఏర్పాటుచేశారు. కైకలూరు వైఎస్సార్ సీపీ కార్యాలయం వద్ద పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కొనసాగుతున్న దీక్షలు 66వ రోజుకు చేరుకున్నాయి. కైకలూరు తాలూకా సెంటర్లో ఎన్జీవో దీక్షలు 59వ రోజుకు చేరాయి. వారికి మద్దతుగా కైకలూరు పట్టణ ప్రైవేటు ఎలక్ట్రికల్ వర్కర్స్ యూనియన్ రిలే దీక్షలు చే పట్టారు. కలిదిండిలో భాస్కరరావుపేట గ్రామస్తులు రిలే దీక్షలు చేశారు. మండవల్లిలో జేఏసీ ఆధ్వర్యంలో 11 మంది మాజీ సర్పంచ్‌లు రిలే దీక్షలు చేశారు. ముదినేపల్లిలో మండల సమైక్యాంధ్ర పరిరక్షణ సంఘం ఆధ్వర్యంలో జరుగుతున్న రిలే దీక్షలు 26వ రోజుకు చేరుకున్నాయి. గుడివాడలో ఎన్జీవోల జేఏసీ, మున్సిపల్ ఉద్యోగుల దీక్షలు కొనసాగుతున్నాయి. పామర్రులో విద్యార్థులు మానవహారం నిర్వహించి ర్యాలీ చేశారు. ఎమ్మెల్యే డీవైదాస్ కార్యాలయం వద్దకు వెళ్లి విభజనకు వ్యతిరేకంగా ప్రసంగించాలని ఆయన్ని కోరారు. పెనుగంచిప్రోలులో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 50వ రోజుకు చేరుకున్నాయి. దీక్షలో విశ్రాంత ఉద్యోగులు కూర్చున్నారు. వత్సవాయిలో జేఏసీ ఆధ్వర్యంలో చేపట్టిన రిలే దీక్షలు 45వ రోజుకు చేరాయి. జేఏసీ ఆధ్వర్యంలో దివిసీమలో చేపట్టిన దీక్షలు కొనసాగుతున్నాయి. చల్లపల్లిలో చేపట్టిన దీక్షలు 63వ రోజుకు చేరాయి. న్యాయవాదుల ఆధ్వర్యంలో చైతన్యయాత్ర... అవనిగడ్డ కోర్టుకు చెందిన న్యాయవాదులు సమైక్యాంధ్ర చైతన్యయాత్రను చల్లపల్లి మండలంలో నిర్వహించారు. అవనిగడ్డలో చేపట్టిన దీక్షలు 51వ రోజుకు చేరాయి. చేనేత కార్మికులు దీక్షా శిబిరం వద్ద నూలు వడుకుతూ నిరసన దీక్షలు చేశారు. మోపిదేవిలో బొబ్బర్లంక దళితవాడకు చెందిన రైతులు దీక్ష చేపట్టారు. ఘంటసాల, నాగాయలంక, కోడూరులో దీక్షలు కొనసాగుతున్నాయి. తిరువూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలే నిరాహారదీక్షలు 10వ రోజుకు చేరాయి. నియోజకవర్గ సమన్వయకర్త బండ్రపల్లి వల్లభాయ్ ఆధ్వర్యంలో బోసుసెంటర్లో ఏర్పాటుచేసిన శిబిరంలో పలువురు నాయకులు రిలేదీక్షలు చేపట్టారు. వైఎస్సార్సీపీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యురాలు పిడపర్తి లక్ష్మీకుమారి ఆధ్వర్యంలో రిలేదీక్షలు నిర్వహించారు. తిరువూరులో జేఏసీ నాయకులు స్థానిక శాసనసభ్యురాలు దిరిశం పద్మజ్యోతి నివాసం వద్ద ధర్నా చేశారు. నూజివీడులో జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 65వ రోజుకు చేరాయి. చిన్నగాంధీబొమ్మ సెంటరులోని రిలేదీక్ష శిబిరంలో ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జంక్షన్ రోడ్డులో నిర్వహిస్తున్న రిలేదీక్షలు 46వ రోజుకు చేరాయి. ఈ దీక్షలను వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త మేకా ప్రతాప్ ప్రారంభించారు.