సాక్షి, చెన్నై: ముడుపులు తీసుకున్నారనే ఆరోపణలపై నమోదైన కేసులో తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి వి.సెంథిల్ బాలాజీని అరెస్ట్‌చేసినపుడు ఈడీ ఆయన పట్ల అత్యంత దురుసుగా ప్రవర్తించిందా అనే అనుమానాలను తమిళనాడు రాష్ట్ర మానవ హక్కుల కమిషన్(టీఎన్‌ఎస్‌హెచ్‌ఆర్‌సీ) సభ్యుడొకరు వ్యక్తంచేశారు. అదే జరిగితే ఆ అంశాన్ని టీఎన్‌ఎస్‌హెచ్‌ఆర్‌సీ తప్పక పరిశీలిస్తుందని సంస్థ సభ్యుడు కన్నదాసన్ చెప్పారు.
రవాణా శాఖలో ఉద్యోగాలిప్పిస్తానంటూ పలువురి నుంచి భారీఎత్తున నగదు తీసుకున్నారనే ఆరోపణలపై సెంథిల్‌ను విచారించిన ఈడీ అధికారులు మంగళవారం అర్ధరాత్రి దాటాక అరెస్ట్‌చేశారు. అరెస్ట్‌వేళ సెంథిల్ బిగ్గరగా రోదించడం, వెంటనే ఆస్పత్రిలో చేర్పించి యాంజియోగ్రామ్ చేయించడం, గుండె నాళంలో బ్లాక్‌లను గుర్తించడం విదితమే. అయితే అర్ధరాత్రి అరెస్ట్ సందర్భంగా తన పట్ల ఈడీ అధికారులు దురుసుగా ప్రవర్తించారని తనను ఆస్పత్రికి కలవడానికి వచ్చిన కన్నదాసన్‌కు సెంథిల్ ఫిర్యాదుచేశారు.
‘ ఈడ్చుకెళ్లారని ఆయన చెప్తున్నారు. లాక్కెళ్లినపుడే ఆయన తలకు గాయమైందట. ఈడీ దురుసు ప్రవర్తన అంశాన్ని టీఎన్‌ఎస్‌హెచ్‌ఆర్‌సీ పరిశీలిస్తుంది’ అని కన్నదాసన్ చెప్పారు. కాగా, చెన్నై ఓమందూరార్ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తన భర్తను కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్ర చికిత్సకు అనుమతి ఇవ్వాలని మంత్రి భార్య మేఘల మద్రాస్ హైకోర్టును ఆశ్రయించారు. కావేరి ఆస్పత్రికి తరలించి శస్త్రచికిత్స, వైద్య సేవలకు చర్యలు తీసుకోవాలని కోర్టు ఈడీ అధికారులను ఆదేశించింది.
రెచ్చ గొట్టొద్దు: కేంద్రంపై స్టాలిన్ ఫైర్
ఈడీ దాడులు, మంత్రి అరెస్టు నేపథ్యంలో డీఎంకే చీఫ్, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ట్విట్టర్ ఖాతాలో ఒక వీడియో పోస్ట్‌చేశారు. ‘డీఎంకే వాడిని. రెచ్చగొట్టొద్దు తట్టుకోలేరు’ అని కేంద్రాన్ని హెచ్చరించారు. కరుణానిధి చేసిన హెచ్చరికలను ఉటంకిస్తూ.. ‘డీఎంకే వాళ్లు తిప్పి కొట్టడం మొదలెడితే భరించలేరు. రాజకీయంగా ప్రత్యర్థులను ఎదుర్కొనేందుకు మేం చేయని రాజకీయాలు లేవు. మేం చూడని పోరాటాలు లేవు. ఒకసారి చరిత్రను చూసుకోండి’ అని హెచ్చరించారు. ‘ఇది బెదిరింపు కాదు. హెచ్చరిక’ అని అన్నారు. సెంథిల్ అరెస్ట్‌పై స్పందించారు. ‘ ఈడీ ద్వారానే రాజకీయాలు చేద్దామని బీజేపీ చూస్తోంది. ఈడీని అడ్డుపెట్టుకుని పదేళ్లనాటి పాత కేసులో మానసికంగా, శారీరకంగా సెంథిల్‌ను వేధిస్తున్నారు. ఈడీ అధికారులు పెట్టిన మానసిక ఒత్తిడితోనే ఆయనకు హృద్రోగ సమస్యలొచ్చాయి. 18 గంటలు నిర్బంధించిమరీ ప్రశ్నల పరంపర కొనసాగించారు. ఎవ్వరినీ కలవనివ్వలేదు. దాంతో ఆయన ఆరోగ్యం పూర్తిగా క్షీణించాక ఆస్పత్రికి తరలించారు’ అని ఆరోపించారు.
Comments
Please login to add a commentAdd a comment