సెంథిల్ బాలాజీని పరామర్శిస్తున్న సీఎం స్టాలిన్
సాక్షి, చెన్నై: ‘క్యాష్ ఫర్ జాబ్స్’ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తమిళనాడు విద్యుత్, ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ మంత్రి సెంథిల్ బాలాజీ(47)ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ) కింద ఆయనను అరెస్టు చేసినట్లు అధికారులు వెల్లడించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ మంత్రివర్గంలో ఈ చట్టం కింద అరెస్టయిన తొలి మంత్రి సెంథిల్ కావడం విశేషం.
సుదీర్ఘంగా ప్రశ్నించిన అనంతరం అధికారులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం హైడ్రామా చోటుచేసుకుంది. తనకు అనారోగ్యంగా ఉందని చెప్పడంతో సెంథిల్‌ను సిటీ ప్రభుత్వ ఆసుపత్రిలో ఇంటెన్సివ్ కేర్ యూనిట్(ఐసీయూ)లో చేర్పించారు. ఆసుపత్రికి తరలిస్తున్న సమయంలో సెంథిల్ బాలాజీ బిగ్గరగా రోదిస్తున్న దృశ్యాలు టీవీల్లో ప్రసారమయ్యాయి. గుండెకు సంబంధించిన కరోనరీ యాంజియోగ్రామ్ పరీక్ష వైద్యులు నిర్వహించారు. గుండె నాళంలో మూడు చోట్ల బ్లాక్‌లు ఉన్నట్టు గుర్తించారు. అత్యవసరంగా బైపాస్ సర్జరీకి సిఫారసు చేశారు.
బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్న కేంద్రం: స్టాలిన్
మనీ లాండరింగ్ కేసు దర్యాప్తులో భాగంగా సెంథిల్ బాలాజీ నివాసాలు, కార్యాలయాల్లో అధికారులు మంగళవారం సోదాలు నిర్వహించారు. చెన్నై, కరూర్, ఈరోడ్‌లో ఈ సోదాలు జరిగాయి. తదుపరి విచారణ కోసం ఆయనను అరెస్టు చేసినట్లు సమాచారం. అరెస్టుపై తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తన కేబినెట్ సహచరుడిని పరామర్శించారు. కేంద్ర ప్రభుత్వం బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతోందని ఆరోపించారు.
ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీ
బాలాజీని ఈ నెల 28 దాకా జ్యుడీషియల్ కస్టడీకి తరలిస్తూ సెషన్స్ కోర్టు జడ్జి ఆదేశాలు జారీ చేసింది. తన భర్తను ఎందుకు అరెస్టు చేశారో, ఏ కేసులో అరెస్టు చేశారో చెప్పాలని ఈడీని ప్రశ్నిస్తూ సెంథిల్ బాలాజీ సతీమణి మేఘల హైకోర్టులో అత్యవసర పిటిషన్ వేశారు.
Comments
Please login to add a commentAdd a comment