సమాధానం చెప్పించాలి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: జిల్లాను సస్యశ్యామలం చేసే సీతారామ ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని కేంద్రానికి లేఖలు రాసిన ఏపీ సీఎం చంద్రబాబు ఖమ్మం జిల్లా ప్రజలకు సమాధానం చెప్పాలని, తెలంగాణ అభివృద్ధిని కాంక్షించే నాయకులమని చెప్పే కాంగ్రెస్, టీడీపీ నేతలకు ఆయన రాసిన లేఖలను ఉపసంహరింపజేసే దమ్ముందా? ఒకవేళ ఉంటే బుధవారం ఖమ్మంలో జరిగే రాహుల్, చంద్రబాబు పాల్గొనే సభలో చంద్రబాబుతో వాటిని ఉపసంహరింపజేయాలని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు డిమాండ్ చేశారు. నగరంలోని టీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్‌తో కలిసి మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
చంద్రబాబునాయుడు, రాహుల్‌గాంధీ పర్యటనపై తమకు ఎటువంటి అభ్యంతరం లేదని, జిల్లా అభివృద్ధిని అడ్డుకుంటూ.. పోలవరం ప్రాజెక్టుతో ఏమాత్రం సంబంధం లేని గ్రామాలను సైతం అక్రమంగా ఆక్రమించిన వైనాన్ని జిల్లా ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారని, వీటిపై జిల్లా ప్రజలకు చంద్రబాబు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణలో ఏ ప్రాజెక్టు నిర్మించినా.. రైతుకు పట్టెడన్నం పెట్టేందుకు కేసీఆర్ చేస్తున్న ప్రతి పనిని అడ్డుకునేందుకు లేఖాస్త్రాలను సంధించిన చంద్రబాబు ఏ ముఖం పెట్టుకుని ఇక్కడ ఓట్లు అడుగుతారని, తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చీకటి దినంగా బహిరంగంగా ప్రకటించిన బాబుకు తెలంగాణ ప్రజలను ఓటు అడిగే హక్కు ఎక్కడిదని ఆయన ప్రశ్నించారు.
తన రాజకీయ మనుగడ కోసం కాంగ్రెస్‌తో అపవిత్ర పొత్తు పెట్టుకున్నారని, గత ఎన్నికల్లో ఏపీలో అధికారంలోకి రావడం కోసం తెలంగాణ టీడీపీని బీజేపీకి తాకట్టు పెడితే.. వచ్చే ఎన్నికల్లో ఆంధ్ర రాష్ట్రంలో తన అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం మళ్లీ తెలంగాణ టీడీపీని కాంగ్రెస్ పార్టీకి బలిచ్చారని ఆయన చంద్రబాబు వైఖరిపై మండిపడ్డారు. చంద్రబాబు తెలంగాణ రాజకీయాలపై అక్కసు వెళ్లగక్కే వైఖరి ఆక్షేపణీయమని, తెలంగాణ ప్రాజెక్టుల పట్ల, తెలంగాణ ప్రజల పట్ల చంద్రబాబు వైఖరిని సభలో వెల్లడించాలని, సీతారామ ప్రాజెక్టుతో సహా కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టులను అడ్డుకునేందుకు లేఖలు ఎందుకిచ్చారో సమాధానం చెప్పి తీరాలని ఆయన డిమాండ్ చేశారు. టీఆర్ఎస్ను ఒంటరిగా ఎదుర్కొనే ధైర్యం లేక కాంగ్రెస్, టీడీపీ, టీజేఎస్‌లు ఏకమైన తీరు.. వారి స్వార్థ ప్రయోజనాలపై ప్రజలకు ఒక అంచనా ఉందని, వాటిని ప్రజలు గమనిస్తూనే ఉన్నారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు ఇవే చివరి ఎన్నికలన్నారు.
కుటుంబ పాలన గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్‌కు లేదని, ఇందిర, రాజీవ్, సోనియా, రాహుల్‌గాంధీల ప్రవేశం కుటుంబ పాలన కాదా? చివరికి రాష్ట్రంలో మల్లు బ్రదర్స్, కోమటిరెడ్డి బ్రదర్స్, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దంపతులు రాజకీయాల్లో లేరా? అని ప్రశ్నించారు. టీఆర్ఎస్ పార్టీగా తమ ముఖాలతోనే ప్రజలను ఓట్లు అడుగుతున్నామని, కాంగ్రెస్ మాదిరిగా చంద్రబాబు, కోదండరాం ముఖాలను పెట్టుకుని ఓట్లు అడిగే పరిస్థితి తమకు లేదన్నారు. రూ.45వేల కోట్లతో రాష్ట్ర అభివృద్ధికి పాటుపడిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనన్నారు. ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో గోదావరి నదిపై ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయితే.. రాష్ట్రంలో కోటి ఎకరాలు సాగులోకి వస్తే తమ మనుగడ కష్టమని భావించి టీఆర్ఎస్కు ఆ కీర్తి రాకుండా కాంగ్రెస్, టీడీపీ కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. తొమ్మిది నెలల్లో భక్తరామదాసును పూర్తి చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదన్నారు.
ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వడాన్ని టీఆర్ఎస్ ఏనాడూ వ్యతిరేకించలేదని, అయితే కొత్త రాష్ట్రమైన తెలంగాణకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నది తమ డిమాండ్ అని అన్నారు. రాష్ట్రంలో నిర్మిస్తున్న ప్రాజెక్టులను ఆపాలని 104 లేఖలు ఇచ్చారని, దీనినిబట్టే ఆ పార్టీలకు ప్రజాసంక్షేమం పట్ల ఉన్న ఆసక్తి తెలుస్తోందన్నారు. ఖమ్మం తాజా మాజీ ఎమ్మెల్యే పువ్వాడ అజయ్‌కుమార్ మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీగా తాము సంధించిన ప్రశ్నలకు ఖమ్మం సభలో.. రాహుల్ సమక్షంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సమాధానం చెప్పి తీరాలన్నారు. ప్రతిపక్షాల వైఖరి దొంగే దొంగ అన్న చందంగా ఉందని ఆయన విమర్శించారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని చీకటి రోజుగా భావించిన టీడీపీ అధినేత చంద్రబాబుకు తెలంగాణ ప్రజలతో.. వారి ఓట్లతో ఏం పని అని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ ప్రాంతానికి, ఖమ్మం జిల్లాకు అన్యాయం జరిగితే సహించబోమని, లేఖల ఉపసంహరణపై కాంగ్రెస్, టీడీపీల వైఖరిపై వేచి చూస్తామని ఆయన అన్నారు. సమావేశంలో రైతు సమన్వయ సమితి జిల్లా కన్వీనర్ నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.