propaganda war
-
అద్దంలో చూస్కోండి: బీజేపీ నేతలకు మమత సలహా
కోల్కత్తా: బంగారంలాంటి భారతదేశాన్ని నాశనం చేసిన బీజేపీ.. ఇప్పుడు బెంగాల్‌ను బంగారంలా మారుస్తామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఎద్దేవా చేశారు. తాము అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని బంగారు బెంగాల్‌గా మారుస్తామంటూ బీజేపీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై ఆమె మండిపడ్డారు. ముఖాలు ఒకసారి అద్దంలో చూసుకోవాలని బీజేపీ నాయకులకు సూచించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తుండటంతో పశ్చిమబెంగాల్లో టీఎంసీ, బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో విమర్శల జోరు కొనసాగుతోంది. నువ్వానేనా అన్నట్టూ ఆ రెండు పార్టీల మధ్య యుద్ధ వాతావరణం ఏర్పడింది. తాజాగా శుక్రవారం ఒక్కరోజే బెంగాల్లో టీఎంసీ, బీజేపీలు భారీ ఎత్తున ప్రచార కార్యక్రమాలు నిర్వహించారు. ఈ క్రమంలోనే కోల్‌కత్తాలో నిర్వహించిన ఓ సమావేశంలో మమతా బీజేపీపై దుమ్మెత్తిపోశారు. బీజేపీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేశారు. తృణమూల్ కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయం లేదని, ఆ స్థానాన్ని భర్తీ చేసే సత్తా మరే పార్టీకి లేదని స్పష్టం చేశారు. దేశాన్ని బీజేపీ విక్రయానికి పెట్టిందని మమత ఆరోపించారు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ప్రపంచంలోనే అత్యుత్తమ ప్రజాహిత పాలనను అందిస్తున్నదని పేర్కొన్నారు. బెంగాల్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనుకునే ముందు బీజేపీ నేతలు ఒకసారి అద్దంలో ముఖాలు చూసుకోవాలని హేళన చేశారు. బీజేపీ నాయకులే తిరుగుబాటుదారులని ఆగ్రహం వ్యక్తం చేశారు. గణతంత్ర దినోత్సవం రోజు ఢిల్లీలో చోటుచేసుకున్న పరిణామాలపై, రైతుల ఉద్యమం విషయమై బీజేపీని విమర్శించారు. ఈ విధంగా బెంగాల్లో రాజకీయ యుద్ధం కొనసాగుతోంది. త్వరలోనే అసెంబ్లీ ఎన్నికలు రావడంతో టీఎంసీ, బీజేపీ తీవ్ర స్థాయిలో ప్రచారం చేస్తున్నాయి. మూడోసారి అధికారంలోకి రావాలని టీఎంసీ.. తొలిసారి అధికారంలోకి రావాలని బీజేపీ ఆరాట పడుతోంది. మరీ ఏం జరుగుతుందో వేచి చూడాలి. -
'చావురా.. చావు' అంటూ తిట్ల దండకం
జెరూసలెం: పదమూడేళ్ల బాలుడు నెత్తురోడుతూ నేల వాలిపోయాడు. బుల్లెట్ గాయాలతో బాధపడుతున్న అతడి పట్ల కనికరం చూపాల్సింది పోయి.. అక్కడే ఉన్న ఓ వ్యక్తి తిట్లు పురాణం విప్పాడు. 'చావురా.. చావు' అంటూ నెత్తుటి మడుగులో ఉన్న బాలుడిని తిట్టిపోశాడు. ఈ అమానుష వీడియో ఇప్పుడు ఆన్లైన్లో హల్చల్ చేస్తోంది. ఎప్పుడూ ఉప్పు-నిప్పులా ఉండే పాలస్తీనా-ఇజ్రాయెల్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలను రేపుతున్నది. గత కొన్నాళ్లుగా ఇరుదేశాల మధ్య జరుగుతున్న దాడులతో ఈ ప్రాంతంలో అశాంతి నెలకొనగా... తాజా వీడియోతో ఎప్పుడేం జరుగుతుందోనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ఇద్దరు ఇజ్రాయిలీలపై కత్తితో దాడి చేశాడనే ఆరోపణలతో 13 ఏళ్ల పాలస్తీనా బాలుడిపై ఇజ్రాయెల్ సైనికులు గత సోమవారం కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో దారుణంగా గాయపడ్డ బాలుడు అహ్మద్ మనస్రా అని, అతను చనిపోయాడని పాలస్తీనా చెబుతుండగా.. మరోవైపు అతడు బతికే ఉన్నాడని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడని ఫొటోలు చూపించి ఇజ్రాయెల్ వాదిస్తున్నది. బాలుడిపై జరిగిన దారుణ దాడికి సంబంధించిన వీడియోను ఇటు ఇజ్రాయిలీలు, అటు పాలస్తీనా వాసులు పోస్టుచేసి.. తమదైన వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇజ్రాయెల్ సైన్యాల క్రూరత్వానికి, పైశాచికిత్వానికి ఈ వీడియో పరాకాష్ట అని పాలస్తీనా వాసులు పేర్కొంటుండగా.. పాలస్తీనాకు చెందిన పదమూడేళ్ల బాలుడు నుంచి కూడా తమకు ముప్పు పొంచి ఉందనడానికి ఈ ఘటన నిదర్శనమని ఇజ్రాయిలీలు పేర్కొంటున్నారు. ఇటీవల చోటుచేసుకున్న కత్తిపోటు ఘటనలు, హింసాత్మక ఆందోళనలు.. ఈ ప్రాంతంలో మళ్లీ తీవ్రస్థాయి తిరుగుబాటుకు దారితీసి.. మళ్లీ అశాంతి చోటుచేసుకునే అవకాశముందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ఇటు పాలస్తీనా వాసులు, అటు ఇజ్రాయెల్ వాసులు ఆన్లైన్లో దాడులు, కాల్పులకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు పోస్టు చేస్తూ తీవ్రస్థాయి యుద్ధమే జరుపుతున్నారు.