‘మెట్రో’కు ఆస్తుల సేకరణ భేష్
హైదరాబాద్ సిటీ: నగరంలో వడివడిగా మెట్రో ప్రాజెక్టు పనులు చేపట్టేందుకు వీలుగా ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మ జీహెచ్ఎంసీ, హెచ్ఎంఆర్, రెవెన్యూ అధికారులను అభినందించారు. నిర్మాణ పరంగా క్లిష్టమైన ప్రధాన రహదారుల్లో 132 ఆస్తుల సేకరణ ప్రక్రియను వేగవంతం చేసి ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ జాం లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో జరిగిన ఉన్నతస్థాయి టాస్క్ఫోర్స్ కమిటీ సమావేశంలో మెట్రో పనుల పురోగతిపై ఆయన సమీక్షించారు.
ఆస్తుల సేకరణ ప్రక్రియపై న్యాయస్థానాల్లో నమోదైన వ్యాజ్యాల పరిష్కారానికి అడ్వకేట్ జనరల్ సహకారం తీసుకోవాలని రెవెన్యూ అధికారులకు సూచించారు. మెట్రో పనుల కోసం కేటాయించిన స్థలాల చుట్టూ రక్షణ కంచె ఏర్పాటు చేయాలని, నిర్మాణ సంస్థ ఎల్అండ్టీ ఆయా ప్రాంతాల్లో నిర్మించ తలపెట్టిన నిర్మాణం పనులను తక్షణం ప్రారంభించాలన్నారు. మెట్రో వయాడక్ట్ సెగ్మెంట్ల కింద చెత్త చెదారం, మట్టి కుప్పలు వేస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, వారి నుంచి జరిమానా వసూలు చేయాలన్నారు.