property damaged
-
గూడు చెదిరింది... గోడు మిగిలింది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: వరద, ఒండ్రు పేరుకుపోయిన ఇళ్లు.. కూలేందుకు సిద్ధంగా ఉన్న మట్టిగోడలు.. నామరూపాల్లేకుండా పోయిన పూరిపాకలు.. మాస్కులు ధరించి సామాన్లు శుభ్రం చేస్తున్న మహిళలు.. పుస్తకాలు ఆరబెట్టుకుంటున్న పిల్లలు.. గోదావరి వరద తాకిడికి గురైన భద్రాచలం, పరిసర మండలాల్లోని లోతట్టు ప్రాంతాల్లో కనిపిస్తున్న దృశ్యాలివి. భద్రాచలం పట్టణంలోని పలు కాలనీవాసులు ఇంకా సహాయక కేంద్రాల్లోనే గడుపుతున్నారు. భద్రాచలం కరకట్ట వద్ద ఉన్న స్లూయిస్ల ద్వారా లీకవుతున్న నీరు శిల్పినగర్, విస్తా కాంప్లెక్స్‌తోపాటు ఆలయ ఉత్తర ద్వారం వైపునకు వస్తోంది. ఇరిగేషన్ శాఖ ఏర్పాటు చేసిన ఐదు మోటార్లకు అదనంగా సింగరేణి నుంచి మోటార్లు తెప్పించారు. ప్రస్తుతం 15 మోటార్లు బిగించి వరదనీటిని తోడి తిరిగి గోదావరిలోకి ఎత్తిపోస్తున్నారు. విద్యుత్ శాఖకు భారీ నష్టం..: ఏడు మండలాల్లో 630కి పైగా విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, పర్ణశాల సబ్‌స్టేషన్ వరద నీటిలో చిక్కుకున్నాయి. రూ.16 కోట్ల మేర నష్టం వాటిల్లినట్టు అంచనా. ఇక 143 గ్రామాల్లో 5,620 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. భద్రాచలం– చర్ల దారిలో వారం రోజులుగా రాకపోకలు ఆగిపోయాయి. మూడు రోజులుగా హెలికాప్టర్ ద్వారానే సహాయ శిబిరాలకు నిత్యావసర వస్తువులు తరలిస్తున్నారు. ఒండ్రు, వ్యర్థాల తొలగింపు పనుల్లో 4,100 మంది పారిశుద్ధ్య సిబ్బంది నిమగ్నమయ్యారు. బాధితులకు తక్షణ ఆర్థిక సాయం అందించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈ చిత్రంలో సామాన్లు మోస్తున్న రాజేశ్‌కు భద్రాచలంలోని సుభాష్‌నగర్ కాలనీలో సొంత డాబా ఇల్లు ఉంది. హఠాత్తుగా వరద కమ్ముకొచ్చేయడంతో అప్పటికప్పుడు ఇంట్లోని సామాన్లన్నీ వదిలేసి కట్టుబట్టలతో సహాయక శిబిరానికి కుటుంబంతో కలసి వెళ్లాడు. ఇల్లు నీటమునిగి విలువైన సామగ్రి తడిచి పాడైపోయింది. వరద తగ్గినా మళ్లీ ముంపు తప్పదనే భయం వెంటాడుతుండటంతో సొంత ఇంటికి కాకుండా మరోచోట అద్దె ఇంటికి వెళ్తున్నాడు. ఇక్కడ తడిసిన బియ్యాన్ని చూపిస్తున్న వ్యక్తి పేరు కౌలూరి లక్ష్మణ్. దినసరి కూలీ. వేసవిలో పనులు బాగా దొరకడంతో తిండికి ఇబ్బంది రావొద్దని ఒకేసారి రెండు క్వింటాళ్ల బియ్యం కొనిపెట్టుకు న్నాడు. తర్వాత రెండ్రోజులకే విరుచుకుపడిన వరదల్లో బియ్యం, ఇతర నిత్యవసరాలు తడిసి ముద్దయ్యాయి. పూరిపాక గోడలు నాని కూలేందుకు సిద్ధంగా ఉన్నాయి. వరదలు తగ్గాక ప్రభుత్వం కొత్త ఇల్లు కట్టించి ఇచ్చే వరకు ఎక్కడ తలదాచుకోవాలో తెలియక శిబిరంలోనే బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నాడు. నేలమట్టమైన ఈ గుడిసె వృద్ధుడైన పుల్లయ్యది. పిల్లలకు పెళ్లి చేశాక ఈ పూరి గుడిసెలోనే ఆ వృద్ధ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇటీవలి వరదలకు గుడిసెతోపాటు మట్టిగోడలు పడిపోవడంతో దిక్కు తోచని స్థితిలో పునరావాస శిబిరంలోనే ఉంటున్నారు. మళ్లీ గుడిసెను ఏర్పాటు చేసుకొనే స్థోమత ఆయనకు లేదు. వరద సహాయక శిబిరాలు కొనసాగినన్ని రోజులు అదే వారిల్లు. కానీ, వరద తగ్గిన తర్వాత ఎక్కడికి వెళ్లాలో తెలియక దిక్కు తోచనిస్థితిలో ఉన్నారీ పండుటాకులు. పునరావాస శిబిరంలోనే ఉంటాం కేసీఆర్ సార్ చెప్పినట్లు ఆగస్టు 1 వరకు జూనియర్ కళాశాల పునరావాస శిబిరంలోనే ఉంటాం. ఇక్కడ అన్ని వసతులున్నాయి. ఇండ్లకు వెళ్లి ఆ చీకట్లో పాములు, క్రిమి కీటకాలతో భయం భయంగా ఉండటం కంటే ఇక్కడ ఉండటమే నయం. – ఎస్కే యాకూబీ, సుభాష్‌నగర్, భద్రాచలం -
వరద కుమ్మేసింది.. బురద కమ్మేసింది!
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద మోసుకొచ్చిన ఒండ్రుమట్టి, బురద ముంపు గ్రామాలను కమ్మేసింది. వరద వెనక్కి తగ్గగానే తమ ఊళ్లు, ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు తప్ప సమస్తం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 మండలాల ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు. ఆ తర్వాత అంచనాలకు మించి వరద రావడంతో ఊళ్లకు ఊళ్లే నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న సమస్తం మట్టికొట్టుకుపోయాయి. వరద కొద్దిగా నెమ్మదించడంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్న జనం తిండితిప్పలు మాని ఇళ్లల్లోంచి బురదను తొలగిస్తున్నారు. వరదలో నాని కుళ్లిన చెట్లు, జంతువులు, చేపల కళేబరాలు, ఇతర వ్యర్థాల కారణంగా ముంపు ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంది. వరద కారణంగా జిల్లాలో మొత్తం 12,277 ఇళ్లు నీట మునగగా సోమవారం సాయంత్రానికి 11,061 ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. 2,330 మంది శానిటేషన్ సిబ్బంది నిర్విరామంగా బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 4,434 గ్రామాలు బురద నుంచి బయటపడ్డాయి. ఆయా గ్రామాల్లో దోమలు వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ చేస్తున్నారు. వరద కారణంగా ముంపు ప్రాంత ప్రజల్లో తొంభైశాతం మంది వ్యక్తిగత ఆస్తులను నష్టపోయారు. వరద ముంచుకొస్తుండటంతో కట్టుబట్టలు, విలువైన సామగ్రి మాత్రమే తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. దీంతో ఇళ్లలో ఉన్న ఇతర సామగ్రి, దుస్తులు, బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు.. ఇలా ఒకటేమిటి అన్నీ బురదలో కొట్టుకుపోయాయి. ‘తేలని’నష్టం లెక్క! వరద తగ్గితే కానీ ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందనేది తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు మునకలోనే ఉన్నాయి. చాలాచోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. కాగా ఎగువ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, స్థానికంగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం తగ్గుదల ఆగింది. సోమవారం మ«ధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 56 అడుగుల వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో పలుచోట్ల వరద సహాయ శిబిరాల్లోనే ప్రజలు తలదాచుకుంటున్నారు. గ్రూప్స్‌కు ప్రిపేరయ్యేదెలా? గ్రూప్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు బూర్గంపాడుకు చెందిన రాజేష్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత వారం గ్రూప్స్ ప్రిపరేషన్స్‌కు సంబంధించి సన్నాహాక పరీక్షకూ హాజరయ్యాడు. ఇంతలోనే వరదలు వచ్చాయి. పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన పుస్తకాలే కాదు.. ఆయన కుటుంబం సమకూర్చుకున్న సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తడిసిన పుస్తకాలతో రాజేష్ కంటతడి పెడుతున్నాడు. ఈమె పేరు ఇమాంబీ. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన ఈమె నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించను జమచేసుకుంటూ రూ.12 వేలు వెచ్చించి తన గుడిసెపై రేకులు వేయించుకుంది. ఇటీవలి వరదల్లో ఆమె గుడిసె నామరూపాల్లేకుండాపోయింది. కొడుకులున్నా తనకు నిలువ నీడలేదని.. కనిపించిన వారికల్లా తన బాధ చెప్పుకుంటోంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో బతుకీడుస్తోంది. ఇది ఒక్క ఇమాంబీ బాధ మాత్రమే కాదు గోదావరి వరదల్లో చిక్కున్న 12 వేల కుటుంబాల వ్యథ. -
గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లు దగ్ధం
ముంచంగిపుట్టు: బంగారుమెట్ట పంచాయితీ వదనపల్లి గ్రామంలో గురువారం సాయంత్రం గ్యాస్ సిలిండర్ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇంటిలో ఉన్న వారు ప్రమాదాన్ని గ్రహించి వెంటనే పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. బాధితులు అందించిన వివరాలిలా ఉన్నాయి. వదనపల్లిలో కొర్రా సన్యాసిరావు ఇంటిలో సాయంత్రం అతని భార్య బాలబుడి టీ పెట్టడం కోసం గ్యాస్ స్టౌ వెలిగించింది. అప్పటికే గ్యాస్ పైప్ నుంచి గ్యాస్ లీక్ అవుతుంది. ఈ విషయాన్ని గమనించకపోవడంతో స్టౌ వెలిగించిన వెంటనే సిలిండర్ నుంచి మంటలు చెలరేగాయి. దీంతో ఇంట్లో ఉన్న సన్యాసిరావు, అతని భార్య బాలబుడి, మనవరాలు భవానీతో బయటకు పరుగులు పెట్టారు. అప్పటికే ఇంట్లో మంటలు వ్యాప్తి చెంది, గ్యాస్ సిలిండర్ ఒక్కసారిగా పేలి ఇంటిపై కప్పు రేకుల నుంచి బయటకు వచ్చి పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్తులంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇంట్లో కాలుతున్న పలు వస్తువులను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదయ్యాయి.రూ.90వేలు డబ్బులతో పాటు 10 ధాన్యం బస్తాలు. 3 చోడి బస్తాలు, దుస్తులు, రేషన్ కార్డు, గృహోపకరణ వస్తువులు కాలిపోయి నిలువ నీడలేనివారయ్యారు. ఈ ప్రమాదంలో రూ.2 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరిగిందని బాధితులు సన్యాసిరావు, బాలబుడి తెలిపారు. తహసీల్దార్ నర్సమ్మ, ఎంపీటీసీ సభ్యురాలు కొండమ్మ, వైఎస్సార్సీపీ మండల నేత జగన్నాథం, వీఆర్వో రమేష్‌లు గ్రామానికి వెళ్లి బాధితులను పరామర్శించి, దగ్ధమైన ఇంటిని పరిశీలించారు.జరిగిన నష్టంపై వివరాలను సేకరించారు. ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బాధితులకు రేషన్ సరుకులు అందించారు. (చదవండి: ప్లాస్టిక్ నిషేధం తక్షణ అవసరం) -
ఇంట్లో అగ్నిప్రమాదం..రూ.3 లక్షల ఆస్తి నష్టం
అనకాపల్లి: విశాఖ జిల్లా అనకాపల్లిలో గురువారం ఉదయం అగ్ని ప్రమాదం సంభవించింది. పట్టణంలోని పిల్లావారివీధిలో శివప్రసాద్ అనే వ్యక్తి ఇంట్లో జరిగిన అగ్ని ప్రమాదంలో సుమారు రూ.3 లక్షల ఆస్తినష్టం జరిగింది. ప్రమాదానికి షార్ట్ సర్క్యూటే కారణమని తెలుస్తోంది. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదం జరిగినప్పుడు ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదామే తప్పింది.