బూర్గంపాడులో ఇంట్లో పేరుకుపోయిన బురదను శుభ్రం చేసుకుంటున్న మహిళ
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: గోదావరి వరద మోసుకొచ్చిన ఒండ్రుమట్టి, బురద ముంపు గ్రామాలను కమ్మేసింది. వరద వెనక్కి తగ్గగానే తమ ఊళ్లు, ఇళ్లను చూసుకుని బాధితులు కన్నీరుమున్నీరవుతున్నారు. ప్రాణాలు తప్ప సమస్తం కోల్పోయామంటూ కన్నీటిపర్యంతమవుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని 11 మండలాల ముంపు ప్రాంతాల ప్రజలను అధికారులు పునరావాస శిబిరాలకు తరలించారు.
ఆ తర్వాత అంచనాలకు మించి వరద రావడంతో ఊళ్లకు ఊళ్లే నీళ్లలో మునిగిపోయాయి. దీంతో ఇళ్లలో ఉన్న సమస్తం మట్టికొట్టుకుపోయాయి. వరద కొద్దిగా నెమ్మదించడంతో క్రమంగా ఇళ్లకు చేరుకుంటున్న జనం తిండితిప్పలు మాని ఇళ్లల్లోంచి బురదను తొలగిస్తున్నారు. వరదలో నాని కుళ్లిన చెట్లు, జంతువులు, చేపల కళేబరాలు, ఇతర వ్యర్థాల కారణంగా ముంపు ప్రాంతాల్లో దుర్గంధం నెలకొంది.
వరద కారణంగా జిల్లాలో మొత్తం 12,277 ఇళ్లు నీట మునగగా సోమవారం సాయంత్రానికి 11,061 ఇళ్లు ముంపు నుంచి బయటపడ్డాయి. 2,330 మంది శానిటేషన్ సిబ్బంది నిర్విరామంగా బురద తొలగింపు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇప్పటికే 4,434 గ్రామాలు బురద నుంచి బయటపడ్డాయి. ఆయా గ్రామాల్లో దోమలు వ్యాప్తిచెందకుండా ఫాగింగ్ చేస్తున్నారు.
వరద కారణంగా ముంపు ప్రాంత ప్రజల్లో తొంభైశాతం మంది వ్యక్తిగత ఆస్తులను నష్టపోయారు. వరద ముంచుకొస్తుండటంతో కట్టుబట్టలు, విలువైన సామగ్రి మాత్రమే తీసుకుని పునరావాస కేంద్రాలకు వెళ్లారు. దీంతో ఇళ్లలో ఉన్న ఇతర సామగ్రి, దుస్తులు, బియ్యం, నిత్యావసరాలు, వంట పాత్రలు.. ఇలా ఒకటేమిటి అన్నీ బురదలో కొట్టుకుపోయాయి.
‘తేలని’నష్టం లెక్క!
వరద తగ్గితే కానీ ఎంత మేరకు పంట నష్టం వాటిల్లిందనేది తెలియని పరిస్థితి. లోతట్టు ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్‌ఫార్మర్లు మునకలోనే ఉన్నాయి. చాలాచోట్ల రోడ్లు పూర్తిగా కొట్టుకుపోయాయి. కాగా ఎగువ నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండటం, స్థానికంగా వర్షాలు జోరుగా కురుస్తుండటంతో గోదావరి నీటిమట్టం తగ్గుదల ఆగింది. సోమవారం మ«ధ్యాహ్నం నుంచి రాత్రి వరకు 56 అడుగుల వద్ధ స్థిరంగా కొనసాగుతోంది. దీంతో పలుచోట్ల వరద సహాయ శిబిరాల్లోనే ప్రజలు తలదాచుకుంటున్నారు.
గ్రూప్స్‌కు ప్రిపేరయ్యేదెలా?
గ్రూప్ నోటిఫికేషన్ వెలువడింది మొదలు బూర్గంపాడుకు చెందిన రాజేష్ పుస్తకాలతో కుస్తీ పడుతున్నాడు. ఎలాగైనా మంచి ఉద్యోగం సాధించి తన కుటుంబానికి ఆసరాగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నాడు. గత వారం గ్రూప్స్ ప్రిపరేషన్స్‌కు సంబంధించి సన్నాహాక పరీక్షకూ హాజరయ్యాడు. ఇంతలోనే వరదలు వచ్చాయి. పైసాపైసా కూడబెట్టిన డబ్బుతో కొనుగోలు చేసిన పుస్తకాలే కాదు.. ఆయన కుటుంబం సమకూర్చుకున్న సామగ్రి ఎందుకూ పనికిరాకుండా పోయాయి. తడిసిన పుస్తకాలతో రాజేష్ కంటతడి పెడుతున్నాడు.
ఈమె పేరు ఇమాంబీ. భద్రాచలం సుభాష్‌నగర్‌కు చెందిన ఈమె నెలనెలా వచ్చే వృద్ధాప్య ఫించను జమచేసుకుంటూ రూ.12 వేలు వెచ్చించి తన గుడిసెపై రేకులు వేయించుకుంది. ఇటీవలి వరదల్లో ఆమె గుడిసె నామరూపాల్లేకుండాపోయింది. కొడుకులున్నా తనకు నిలువ నీడలేదని.. కనిపించిన వారికల్లా తన బాధ చెప్పుకుంటోంది. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాల పునరావాస కేంద్రంలో బతుకీడుస్తోంది. ఇది ఒక్క ఇమాంబీ బాధ మాత్రమే కాదు గోదావరి వరదల్లో చిక్కున్న 12 వేల కుటుంబాల వ్యథ.
Comments
Please login to add a commentAdd a comment