Protest program
-
హక్కుల కోసం కాక్రోచ్ ఉద్యమం
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన కాక్రోచ్ జనతా పార్టీ ఆదివారం హక్కుల కోసం నగరంలోని ధర్నాచౌక్ వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టింది. పరీక్ష పత్రాల లీకేజీలు, విద్యావ్యవస్థలో నెలకొన్న అవకతవకలు, ప్రభుత్వ పాఠశాలల దయనీయ స్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నీట్ లీకేజీ వ్యవహారంపై కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేసింది. ఈ కార్యక్రమంలో ప్రముఖ పర్యావరణవేత్త, సామాజిక ఉద్యమ నేత సోనమ్ వాంగ్‌చుక్‌తోపాటు పెద్దసంఖ్యలో యువత పాల్గొన్నారు. ఈ సందర్భంగా వాంగ్‌చుక్ మాట్లాడుతూ., నీట్ పరీక్షల లీకేజీ వంటి ఘటనలపై ప్రభుత్వాలు బాధ్యత వహించాలని డిమాండ్ చేస్తూ... కోట్లాది యువత భవిష్యత్తుపై ప్రభావం చూపే అంశాల్లో జవాబుదారీతనం అవసరమన్నారు. ఈ నిరసనను ఇప్పటికీ ఒక విజ్ఞప్తిగా చూస్తున్నామని, సమస్యలు పరిష్కరించకపోతే ఇది పెద్ద ఉద్యమంగా మారుతుందని హెచ్చరించారు. హైదరాబాద్ యువత చూపిన శాంతియుత, శక్తివంతమైన నిరసన దేశానికి ఆదర్శమన్నారు. ‘నేను అనేక నగరాల్లో ఇలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నాను. కానీ హైదరాబాద్‌లో నేను చూసిన శాంతి నిరసన మరెక్కడా చూడలేదు’ అని చెప్పారు. భారత్ గొప్ప దేశంగా మారాలంటే విద్య, పర్యావరణ పరిరక్షణే ప్రధాన అంశాలుగా మారాలని వాంగ్‌చుక్ స్పష్టం చేశారు. ‘విద్య ద్వారా రాబోయే తరాలకు పునాదులు వేయాలి. మీరు చెట్లను, అడవులను, నదులను రక్షిస్తున్నారు. ఇది దేశానికే గర్వకారణం’ అని అన్నారు. ఈ సందర్భంగా ప్రభుత్వ పాఠశాలల పరిస్థితిపై ఆయన తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. మెజారిటీ పిల్లలు అత్యంత దయనీయ పరిస్థితుల్లో చదువుకుంటున్నారన్నారని, ఇలా అయితే, 2047 నాటికి అభివృద్ధి చెందిన భారత్ ఎలా సాకారమవుతుందని ప్రశ్నించారు. శాంతియుత నిరసనలో పాల్గొంటే తమ పిల్లల స్కూల్ అడ్మిషన్‌కు ఇబ్బందులు వస్తాయేమో అని భయపడే పరిస్థితి దేశంలో ఉండటం సిగ్గుచేటన్నారు.యువత భవిష్యత్తుతో ఆడుకోవద్దు: ప్రొ.నాగేశ్వర్ నీట్, సీబీఎస్ఈ సహా అనేక పరీక్షల్లో జరిగిన లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని ప్రొ.నాగేశ్వర్ డిమాండ్ చేశారు. ‘ఒకప్పుడు రైల్వే ప్రమాదం జరిగితే లాల్ బహదూర్ శాస్త్రి రాజీనామా చేశారు. కానీ ఇప్పుడు వేలాది విద్యార్థుల భవిష్యత్తు నాశనమవుతున్నా బాధ్యత తీసుకునే రాజకీయ నాయకులు కనిపించడం లేదు. ఇదే మన రాజకీయ పతనం’’ అని ఆయన వ్యాఖ్యానించారు. ‘’పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు పెరిగితే బంగారం కొనొద్దంటారు. కానీ యువత ఉద్యోగాలు కోల్పోతే ఎవరూ జవాబు చెప్పరు’ అన్నారు. కార్పొరేట్ కంపెనీలకు రూ.వేల కోట్ల రాయితీలు ఇస్తూ, ఉద్యోగాలను తొలగించడం అన్యాయమన్నారు. మహిళలపై నేరాలు జరిగినప్పుడు బాధితులనే ప్రశ్నించే ధోరణి పెరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ‘వ్యవస్థను ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్, చైనా ఏజెంట్, దేశద్రోహి అంటారు. కానీ మేము భారతమాత బిడ్డలం, భగత్ సింగ్ వారసులం’ అంటూ నినాదాలు చేశారు. మాజీ ఐఏఎస్ ఆకునూరి మురళి మాట్లాడుతూ ఇది సోషల్ మీడియాలో ఆగ్రహంతో ఆగిపోవద్దు, ప్రజా ఉద్యమంగా మారాలని పిలుపునిచ్చారు. దేశంలోని సంపద అంతా ఎక్కడికి వెళ్తోంది.? దేశంలో నిరుద్యోగ పరిస్థితి ఎందుకు ఇలా నెలకొందని ప్రశ్నించారు. ‘యువతను కాక్రోచ్లుగా పేర్కొనడం సమంజసం కాదు. దేశంలో ఆరు శాతం మంది యువతకు మాత్రమే నైపుణ్యాలు ఉన్నాయని అధ్యయనాలు చెబుతున్నాయి. విద్యార్థులకు అన్యాయం చేసిన ధర్మేంద్ర ప్రధాన్‌ను జైలుకు పంపాలి’ అని అన్నారు. -
ట్రెండింగ్‌లో ‘చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు’
సాక్షి, తాడేపల్లి: 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' ట్రెండింగ్‌లో నిలిచింది. వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్సీపీ నిరసన వీడియోలు 'ఎక్స్'లో బాగా వైరల్ అవుతున్నాయి. #2yearsforTdpbackstabbing పేరుతో ట్రెండింగ్ అవుతోంది. చంద్రబాబు మోసాలపై జనం స్పందిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ నెటిజన్లు పోస్టులు పెడుతున్నారు.మేనిఫెస్టోను డెస్ట్బిన్లో వేశారు. సూపర్ సిక్స్, సూపర్ సెవన్ అంటూ ఇచ్చిన హామీలన్నీ బుట్టదాఖలు చేశారు. రైతులు, మహిళలు, నిరుద్యోగులు, విద్యార్థులు.. ఇలా అన్ని వర్గాల ప్రజలు రెండేళ్ల చంద్రబాబు పాలనలో అన్ని విధాలుగా దగా పడ్డారు. చంద్రబాబు రెండేళ్ల వెన్నుపోటు పాలనపై శుక్రవారం రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గ కేంద్రాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపునిచ్చారు.ఆయన పిలుపు మేరకు పార్టీ శ్రేణులు నేడు రాష్ట్రవ్యాప్తంగా నియోజకవర్గ స్థాయిలో ర్యాలీలు నిర్వహించాయి. చంద్రబాబు వెన్నుపోట్లను, దగాను, స్కాంలను, మోసాలను గట్టిగా ప్రశ్నిస్తూ నిరసన తెలిపారు. దీంతో పాటు డీఎస్సీ అక్రమాల కారణంగా అన్యాయమైపోయిన వారికి సంఘీభావంగా ఈ నిరసన ర్యాలీలు చేపట్టారు. చంద్రబాబు పాలనలో దగాపడిన అన్ని వర్గాల ప్రజలను కలుపుకొని ఈ ర్యాలీలు నిర్వహించారు. దగా పడిన రైతులు, మహిళలు, పిల్లలు, నిరుద్యోగులందరూ ఈ ర్యాలీల్లో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ సమర శంఖం(ఫోటో గ్యాలరీ) -
వైఎస్సార్సీపీ చలో దుప్పుతూరు.. గ్రామస్తులకు మద్దతుగా నిరసన
సాక్షి, అనకాపల్లి: చలో దుప్పుతూరు కార్యక్రమంలో భాగంగా వైఎస్సార్సీపీ నేతలు గ్రామంలో పర్యటించారు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్, బొడ్డేడ ప్రసాద్, ధర్మశ్రీ, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, మాజీ ఎంపీ సత్యవతి, కంబాల జోగులు.. గ్రామస్తుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మాట్లాడుతూ.. పరిశ్రమలు రావాలనేది వైఎస్ జగన్ విధానమని.. ప్రజలను ఇబ్బంది పెడితే వైఎస్ జగన్ ఉపేక్షించరన్నారు. 750 కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. గ్రామాన్ని తరలించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది’’ అని అమర్నాథ్ పేర్కొన్నారు.ప్రజలు ప్రభుత్వాన్ని నిలదీయాలి. మహిళలు మీద లాఠీఛార్జ్ చేశారు. గతంలో ఎన్నడు ఈ ప్రాంతంలో మహిళలు మీద లాఠీఛార్జ్ జరగలేదు.. ప్రజల డిమాండ్స్ న్యాయ పరమైనవి. పరిహారం ఇచ్చిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలి. ప్రజలకు న్యాయం జరిగే వరకు తట్ట మట్టి ఎత్తడానికి వీల్లేదు. మీ మీద పెట్టిన తప్పుడు కేసులను వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎత్తివేస్తారు. మీకు అండగా ఉంటామని వైఎస్ జగన్ హామీ ఇచ్చారు. ప్రజలకు న్యాయం కోసం అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం’’ అని గుడివాడ అమర్నాథ్ స్పష్టం చేశారు.అనకాపల్లి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు బొడ్డేడ ప్రసాద్ మాట్లాడుతూ.. ‘‘వైఎస్ జగన్ ఆదేశాలు మేరకు దుప్పుతూరు గ్రామంలో పర్యటించాము. మంచి ప్యాకేజీ ఇస్తామని హామీ ఇచ్చారు. ఇప్పుడున్న గ్రామం కంటే మంచి గ్రామాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 22 ఏళ్లు గడుస్తున్న సమస్య పరిష్కారం కాలేదు. వైఎస్సార్ సీపీ అధికారంలో ఉన్నప్పుడు గోడ నిర్మాణం చేపట్టవద్దని చెప్పారు. వారి సమస్య పరిష్కారం అయిన తర్వాత గోడ నిర్మాణం చేపట్టాలని ఆదేశించారు. మహిళలు అని కూడా చూడకుండా పోలీసులు దాడి చేశారు. అనేక పోలీసులు స్టేషన్లు తిప్పారు’’ అని ఆయన మండిపడ్డారు.ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ.. మహిళలను కూడా అరెస్ట్ చేశారు. ఈడ్చుకుంటూ మహిళలను వ్యాన్లు ఎక్కించారు. ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఏమి చేస్తున్నారు?. మహిళలపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము. ప్రజలకు న్యాయం చేయలేని పాలకులు మనకు అవసరమా’’ అంటూ ఆమె నిలదీశారు.కరణం ధర్మశ్రీ మాట్లాడుతూ.. పోలీసులు వ్యవహరించిన తీరు దుర్మార్గం. పరిహారం చెల్లించే వరకు గోడ నిర్మాణాన్ని ఆపాలి. ప్రజలకు ఆర్అండ్ఆర్ ప్యాకేజీ వెంటనే ఇవ్వాలి. న్యాయం కోసం పోరాటం చేసే ప్రజలపై తప్పుడు కేసులు పెట్టారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వలేదు. వైఎస్ జగన్ సీఎంగా ఉన్న సమయంలో ఎందుకు గోడ కట్టలేక పోయారు?. దొర స్వామి దగ్గర కూటమి నాయకులు డబ్బులు తీసుకుని దగ్గరుండి గోడ కట్టిస్తున్నారంటూ ఆయన ధ్వజమెత్తారు. -
సీఎం గారూ.. అపాయింట్మెంట్ ఎప్పుడిస్తారు?
సాక్షి, హైదరాబాద్: ప్రజా సమస్యలపై చర్చించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలకు ఎప్పుడు అపాయింట్మెంట్ ఇస్తారో తక్షణమే తెలియజేయాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. శనివారం పార్టీ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గన్‌పార్క్‌లోని అమరవీరుల స్థూపం వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ ప్రధాన కార్యదర్శి కె.శివకుమార్ మాట్లాడుతూ, నాలుగు కోట్ల మంది ప్రజలను సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని మండిపడ్డారు. సమస్యలు పరిష్కరించే చిత్తశుద్ధి ఉంటే వెంటనే అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బంగారు తెలంగాణ అంటే అన్ని వర్గాల నేతలు, ప్రజలు, పార్టీలను సమ్మెల దాకా తీసుకెళ్లేలా చేయడమా అని ప్రశ్నించారు. అధికారులతో సమీక్షల మీద సమీక్షలు చేయడమే పరిపాలన కాదని హితవు పలికారు. పార్టీ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి మాట్లాడుతూ... సీఎం కేసీఆర్ అపాయింట్మెంట్ అందేలా చేయాలని, తొలగించిన పారిశుధ్య కార్మికులను విధుల్లోకి తీసుకోవాలని అమరవీరుల స్తూపం వద్ద వినతిపత్రం ఉంచామన్నారు. దివంగత సీఎం వైఎస్సార్ తన పదవీ కాలంలో ప్రజల కోసం ఏకంగా క్యాంప్ ఆఫీసు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. కానీ సీఎం కేసీఆర్ ఎక్కడుంటారో ఎవరికీ అంతుబట్టదన్నారు. లక్షా ఏడు వేల ఉద్యోగాలు ఇస్తానని ప్రకటించిన సీఎం.. పారిశుధ్య కార్మికులను తొలగించడమేంటనీ ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గట్టు శ్రీకాంత్ రెడ్డి, నల్లా సూర్యప్రకాశ్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల అధ్యక్షులు ఆదం విజయ్ కుమార్, జి.సురేష్ రెడ్డి, మైనార్టీ నేతలు ముజ్తబ అహ్మద్, హర్షద్, యువజన-ఐటీ విభాగం అధ్యక్షులు బీష్వ రవీందర్, సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


