Protests at dharna chowk
-
నిరసనలపై నిషేధం తగదు
న్యూఢిల్లీ: ఢిల్లీలోని జంతర్‌మంతర్, బోట్‌క్లబ్ వంటి ప్రాంతాల్లో నిరసనలు, బైఠాయింపులపై పూర్తి నిషేధం విధించటం తగదని సుప్రీంకోర్టు పేర్కొంది. ఇందుకు బదులు అక్కడ ప్రజలు స్వేచ్ఛగా నిరసనలు తెలిపేందుకు అవసరమైన మార్గదర్శకాలు రూపొందించి, అమలు చేయాలని ప్రభుత్వాన్ని కోరింది. జంతర్‌మంతర్, ఇండియా గేట్ దగ్గరి బోట్ క్లబ్ వద్ద వివిధ సంస్థలు, రాజకీయ పార్టీలు, ప్రజలు ఆందోళనలు చేపట్టరాదంటూ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్(ఎన్జీటీ) విధించిన నిషేధానికి వ్యతిరేకంగా మజ్దూర్ కిసాన్ శక్తి సంఘటన్ తదితర స్వచ్ఛంద సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై సోమవారం సుప్రీంకోర్టు బెంచ్ విచారణ చేపట్టింది. అత్యవసర పరిస్థితుల్లో శాంతి భద్రతల సమస్య, హింసాయుత పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే విధించే 144వ సెక్షన్ వంటి ఆజ్ఞల్ని అధికారులు అమలు చేస్తున్నారని పిటిషనర్ పేర్కొన్నారు. దీనిపై ఎన్జీటీ తరఫు లాయర్ వాదిస్తూ..‘జంతర్‌మంతర్ రోడ్డులో వివిధ సంఘాలు, సంస్థలు, పార్టీలు చేపట్టే ఆందోళనల కారణంగా ప్రజా జీవనానికి ఆటంకం కలగటంతోపాటు, శబ్దకాలుష్యం, తీవ్ర ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయని తెలిపారు. పూర్తిస్థాయి నిషేధం తగదని, ప్రజల నిరసన హక్కుకు భంగం కలగకుండా మార్గదర్శకాలు రూపొం దించాలని కోర్టు ప్రభుత్వాన్ని కోరింది. -
ధర్నాచౌక్ నీ జాగీరా: ఆర్.కృష్ణయ్య
వైఎస్సార్ మాదిరి ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వాలి హైదరాబాద్: ధర్నాచౌక్ వద్ద ధర్నాలు నిషేధమనడం తగదని.. అదేమైనా నీ జాగీరా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఇదేమైనా సీఎం క్యాంపు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్ దగ్గర ఉందా అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ హక్కుల కోసం ఉద్యమాలు చేయొచ్చని అన్నారు. ఎమ్మెల్సీ స్థానాలను అత్యంత వెనకబడిన వర్గాలకు ఎందుకు కేటాయించలేదని, గవర్నర్ కోటాలోనైనా కేటాయించాలని సీఎంను కోరారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జారీ చేసి జీవో ప్రకారం విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెలకు, బర్రెలకు వేలాది కోట్లు చెల్లించడాన్ని మేము వ్యతిరేకిండం లేదు కానీ, కులాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీసీ సంక్షేమ కార్యాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఇందులో కృష్ణయ్య మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కితేనే వారి స్థితిగతులు మారతాయన్నారు.