ధర్నాచౌక్ నీ జాగీరా: ఆర్.కృష్ణయ్య
వైఎస్సార్ మాదిరి ఫీజు రీయింబర్స్‌మెంట్ ఇవ్వాలి
హైదరాబాద్: ధర్నాచౌక్ వద్ద ధర్నాలు నిషేధమనడం తగదని.. అదేమైనా నీ జాగీరా అని ముఖ్యమంత్రి కేసీఆర్‌ను బీసీ సంక్షేమ సంఘం నేత, టీడీపీ ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రశ్నించారు. ఇదేమైనా సీఎం క్యాంపు, అసెంబ్లీ, సచివాలయం, రాజ్‌భవన్ దగ్గర ఉందా అన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా తమ హక్కుల కోసం ఉద్యమాలు చేయొచ్చని అన్నారు. ఎమ్మెల్సీ స్థానాలను అత్యంత వెనకబడిన వర్గాలకు ఎందుకు కేటాయించలేదని, గవర్నర్ కోటాలోనైనా కేటాయించాలని సీఎంను కోరారు.
విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో ప్రభుత్వం తాత్సారం చేస్తుందన్నారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి జారీ చేసి జీవో ప్రకారం విద్యార్థులకు మొత్తం ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లించాలని, ఎలాంటి షరతులు లేకుండా రీయింబర్స్ చేయాలని డిమాండ్ చేశారు. గొర్రెలకు, బర్రెలకు వేలాది కోట్లు చెల్లించడాన్ని మేము వ్యతిరేకిండం లేదు కానీ, కులాల మధ్య చిచ్చుపెట్టడం సరికాదన్నారు. ఓటు బ్యాంకు రాజకీయాలు మానుకోవాలని హితవు పలికారు. కాగా, అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం బీసీ సంక్షేమ కార్యాలయంలో మహిళా దినోత్సవం నిర్వహించారు. ఇందులో కృష్ణయ్య మాట్లాడుతూ... చట్టసభల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు దక్కితేనే వారి స్థితిగతులు మారతాయన్నారు.