కొమ్మినేని శ్రీనివాసరావుతో సూపర్ స్టార్ కృష్ణ
పాదయాత్రలో జనం అద్భుత స్పందన చూస్తుంటే వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈసారి ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కావటం ఖాయమనిపిస్తోందని సూపర్ స్టార్ కృష్ణ పేర్కొన్నారు. జగన్ ఏ ఊరెళ్లినా ఇసుక వేస్తే రాలనంతగా జనం వస్తున్నారని, మే నెల ఎండల్లో కూడా అంతగా కష్టపడుతున్నాడంటే జగన్‌ని నిజంగానే అభినందించాలని ప్రశంసించారు. ఆంధ్రలో మే నెలలో వేసవి ఎండల్లో ఇంతగా నడవడం అంటే మాటలు కాదని, జగన్ శ్రమకు ఫలితం వస్తుందని చెప్పారు. ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి మరీ ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టారు కాబట్టి ఆ హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలంటున్న కృష్ణ అభిప్రాయాలు ఆయన మాటల్లోనే...
350 సినిమాల్లో నటించిన ఏకైక తెలుగు సినిమా హీరో మీరే కదా. ఈ రికార్డు ఎలా సాధించారు?
చిత్రసీమలో అడుగుపెట్టిన తొలి సంవత్సరం మూడే సినిమాలు చేశాను. గూఢచారి సినిమా తర్వాత మూడు షెడ్యూల్స్‌లో పనిచేశాను. ఒక సంవత్సరమైతే 18 సినిమాల్లో హీరోగా నటించాను. అన్నీ విడుదలయ్యాయి. ఒకే రోజు రెండు సినిమాలు నావి విడుదలైన సందర్భాలున్నాయి. బాలకృష్ణ మాత్రమే ఒకసారి బంగారు బుల్లోడు, నిప్పురవ్వ సినిమాలను ఒకే రోజు విడుదల చేశారు. నా సినిమాలు అలా చాలాసార్లు విడుదలయ్యాయి. ఏడేళ్లలోనే వంద సిని మాల్లో నటించాను. తర్వాత కలర్ పిక్చర్ల యుగం రావడంతో వాటిపై కాస్త ఏకాగ్రత పెట్టి తీయాలని పించింది. అప్పటినుంచి సంవత్సరానికి ఏడు సిని మాల్లో మాత్రమే నటించసాగాను. అప్పుడు కూడా కాస్త మొహమాటాలకు పోయి సంవత్సరానికి పది సినిమాల్లో కూడా నటించాను.
సీతారామరాజు చిత్ర విశేషాలు చెప్పండి?
అల్లూరి ఉద్యమం నడిపిన ప్రాంతాల్లోనే సినిమా షూటింగ్ జరిగింది. నేను మేకప్ వేసుకుని షూటింగ్ స్పాట్‌కి రాగానే మన బాబు వచ్చారు, మా బాబు వచ్చారు అంటూ గిరిజనులు దండాలు పెట్టేవారు. నన్ను అచ్చం రామరాజే అనుకున్నారు జనం.
ఎన్టీఆర్‌తో మీకు విభేదాలు ఎలా వచ్చాయి?
సీతారామరాజు సినిమా విషయంలోనే వచ్చాయి. ఆయన ఎంతకాలానికీ సినిమా తీయలేదు. నేను తీయబోతోంటే వద్దన్నారు. కారణం ఏమీ లేదు. ఆ కథ డ్రై సబ్జెక్ట్. తీస్తే ఆడుతుందనే నమ్మకం నాకు లేదు కాబట్టే తీయలేదు. నువ్వూ తీయవద్దు. నేనూ తీయను. ఇప్పటికే దేవుడు చేసిన మనుషులు సినిమా తీసి డబ్బులు వెనకేసుకున్నావు. అల్లూరిపై సినిమా తీస్తే అవి కూడా పోతాయి. నష్టపోతావు. తీయవద్దన్నారు. కావాలంటే కురుక్షేత్రం సినిమా తీయి. దాంట్లో నేను కృష్ణుడిగా వేస్తాను. నువ్వు అర్జునుడిగా వేయి. మళ్లీ ఇద్దరం కలిసి పనిచేద్దాం అన్నారాయన.
మీరు అల్లూరి తీస్తానంటే నేను మానేస్తాను అన్నాను. కానీ అప్పటికే అల్లూరిపై స్క్రిప్టు తయారు చేసిన మా బృందం పూర్తి నమ్మకంతో ఉంది. తప్పకుండా తీద్దాం అని చెబితే నేను కూడా సిద్ధపడ్డాను. అలా అల్లూరి సినిమా మొదలైంది. తాను చెబితే కూడా నేను వినలేదనే కోపంతో ఎన్టీరామారావు దేవుడు చేసిన మనుషులు సినిమా శత దినోత్సవానికి కూడా రాలేదు. అల్లూరి సినిమా కూడా చూడలేదాయన. కానీ ఆ సినిమా ఎలాగైనా సరే తీయాలని ఉండేది తనకు. పదేళ్ల తర్వాత పరుచూరి బ్రదర్స్‌ని పిలిపించి అల్లూరి సినిమా స్క్రిప్ట్ రాయండి నేను నటిస్తాను అన్నారట.
పరుచూరి గోపాల కృష్ణ ఎన్టీఆర్‌తో మాట్లాడుతూ.. ఇలా చెబుతున్నానని ఏమనుకోవద్దు. ఒకసారి కృష్ణగారితో కలిసి ఆ సినిమా చూడండి. ఆ తర్వాతా తీద్దామంటే తప్పక రాస్తామన్నారట. మేం అప్పటికి పదేళ్లుగా ఒకరి ముఖాలు ఒకరు చూసుకోలేదు. అప్పుడే వాహిని స్టూడియోలో పక్క పక్క ఫ్లోర్లలో ఇద్దరం షూటింగు చేస్తుండేవాళ్లం. ఒకరోజు బయటికి వస్తుండగా బ్రదర్ ఒకసారిలా రండి అని పిలిచారు ఎన్టీఆర్. అల్లూరి సీతారామరాజు సిని మాను నేను చూడాలి. మీరు పక్కన ఉండగానే చూడాలి అన్నారు. అలా ఆ సినిమా చూశారు. ఇంటర్వెల్ సమయానికే ఆయన బాగా ఇంప్రెస్ అయ్యారు. పూర్తి సినిమా చూశాక.. ఎంతో మెచ్చుకున్నారు. ఇంతకంటే ఎవరూ ఈ సినిమాను తీయలేరు అంటూ నన్ను కావలించుకుని అభినందించారు. ఇక మేం ఈ సినిమాను తీయాల్సిన పనిలేదు అని చెప్పారు.
వైఎస్సార్ కుటుంబంతో మీ పరిచయం ఎలా ఉండేది?
ఆయన నాకు చాలా మంచి స్నేహితుడు. ఇద్దరం ఎంపీలుగా ఉన్నప్పటినుంచి పరిచయమైంది. చాలా స్నేహపూరితంగా ఉండేవారు. రాజకీయంగా తొలి అయిదేళ్లు బ్రహ్మాండంగా పనిచేయబట్టే రెండో సారి కూడా రిపీటెడ్‌గా గెల్చి అధికారంలోకి వచ్చారు.
వైఎస్‌ఆర్‌లో మీరు చూసిన విశిష్టత ఏమిటి?
ఆయన మాట తప్పడు. అనుకున్న పని చేస్తాడు. ఎవరికైనా మాట ఇస్తే తప్పడు. ప్రజలకు చేసిన వాగ్దానాలను కూడా వీలైనంతవరకు అమలు చేసేవారు. సక్రమంగానే పరిపాలన సాగించారు. ఆయన చేసిన పనుల్లో నాకు నచ్చినవి ఒకటి కాదు. ఆరోగ్యశ్రీతోపాటు పది పథకాలు పెట్టి విజయవంతంగా అమలు చేశారు.
వైఎస్ జగన్ పాదయాత్ర పట్ల మీ స్పందన ఏమిటి?
జనం బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. ఏ ఊరెళ్లినా ఇసుక వేస్తే రాలనంత జనం వస్తున్నారు. చాలా కష్టపడుతున్నాడు. ఇంత ఎండల్లో నడవడం అంటే మాటలు కాదు. హైదరాబాద్‌లో కొంచెం ఫర్వాలేదు కానీ మే నెలలో ఆంధ్రలో ఎండలు ఎలా ఉంటాయో తెలియంది కాదు. అంత ఎండల్లో కూడా అంతగా కష్టపడుతున్నాడంటే జగన్‌ని నిజంగానే అభినందించాలి. ఇప్పుడున్న ట్రెండ్ చూస్తుంటే జగన్ సీఎం అయ్యేటట్టే కనిపిస్తోంది.
ప్రత్యేక హోదా ఉద్యమంపై మీ అభిప్రాయం ఏమిటి?
ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసే ఉమ్మడి రాష్ట్రాన్ని విడగొట్టారు. ఆ హామీని తప్పకుండా నిలబెట్టుకోవాలి.
చంద్రబాబు, కేసీఆర్ పాలనపై మీ అభిప్రాయం?
చంద్రబాబు అనుభవజ్ఞుడు. ఇక కేసీఆర్ ప్రజలందరికీ న్యాయం చేకూర్చుతున్నాడు. పాలన చాలా బాగుంది. హైదరాబాద్ నగరంలో గతంలో ఒక్క కార్పొరేటర్ సీటు కూడా లేని టీఆర్‌ఎస్ పార్టీ ఇప్పుడు వంద స్థానాల్లో గెలిచిందంటే ఎంత వృద్ధి సాధించిందో అర్థమవుతుంది.
తెలుగు ప్రజలకు మీరిచ్చే సందేశం ఏమిటి?
సందేశాలు రాజకీయ నేతలే ఇవ్వాలి. తమకేం కావాలో ప్రజలకు బాగా తెలుసు.
Comments
Please login to add a commentAdd a comment