'ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా చూడండి'
హైదరాబాద్ : జిల్లాల్లో ప్రోటోకాల్ సమస్యలు తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మను అసెంబ్లీ స్పీకర్ ఎస్.మధుసూదనాచారి ఆదేశించారు. స్పీకర్, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌తో సీఎస్ సోమవారం భేటీ అయ్యారు. ఏ పార్టీకి చెందిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, ఎంపీల నుంచి ప్రోటోకాల్ పాటించడం లేదంటూ తమకు ఫిర్యాదులు రావొద్దని వీరిద్దరూ సీఎస్‌కు సూచించారని సమాచారం. ఇటీవల మహబూబ్‌నగర్ జిల్లాలో మంత్రి జూపల్లి కృష్ణారావు పాల్గొనాల్సిన ఓ కార్యక్రమం సందర్భంగా ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి గొడవకు దిగారు. వరంగల్ జిల్లాలోనూ ఇదే సమస్య ఉత్పన్నమైంది.
ప్రధానంగా విపక్ష పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ప్రభుత్వ అధికారిక కార్యక్రమాల్లో తమకు ఆహ్వానాలు ఉండడం లేదని తరచూ ఫిర్యాదు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జిల్లా కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వాలని, భవిష్యత్తులో జిల్లాల్లో ఎలాంటి ప్రోటోకాల్ వివాదాలు జరగకుండా చూడాలని వీరు సూచించారని తెలిసింది. దీంతో పాటు సెప్టెంబరు రెండో వారంలో శాసన సభా సమావేశాలు జరగనున్నాయి. సభ్యులు వేసిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం ఇవ్వాల్సి ఉంది. ఆయా ప్రభుత్వ శాఖల నుంచి తయారు చేయించాల్సిన ఈ జవాబులపైనా వీరి భేటీలో చర్చ జరిగినట్లు తెలిసింది.
అసెంబ్లీ సిబ్బందికి కంటి పరీక్షలు :
అసెంబ్లీ సిబ్బందికి సోమవారం కంటి పరీక్షలు నిర్వహించారు. అసెంబ్లీ ప్రాంగణంలోని క్యాంటీన్లో ఈ మేరకు ఉచిత పరీక్ష క్యాంప్ ఏర్పాటు చేశారు. స్పీకర్ ఎస్. మధుసూదనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్‌లు కూడా ఈ క్యాంప్‌లో కంటి పరీక్ష చేయించుకున్నారు.