విదేశాల్లో పనిచేసే ఉద్యోగులకు ఆన్లైన్లోనే సీవోసీ
న్యూఢిల్లీ: విదేశాల్లో వ్యవస్థీకృత రంగంలో పనిచేసే భారతీయ ఉద్యోగులు ఇకపై భవిష్య నిధి (పీఎఫ్) ఖాతాకు సంబంధించిన వివరాలను ఆన్లైన్లోనే సమర్పించి సర్టిఫికెట్ ఆఫ్ కవరేజ్(సీవోసీ)ని పొందవచ్చు. పనిచేస్తున్న దేశంలో సామాజిక భద్రతా పథకాలను పొందేందుకు అవసరమైన సీవోసీని 3 రోజుల్లోనే ఆన్లైన్లో తీసుకోవచ్చు.
దరఖాస్తుదారులు తమ పేర్లు, పీఎఫ్ ఖాతాల వివరాలు, సీవోసీ కాలపరిమితి వంటి వివరాలను తప్పులు లేకుండానే ఆన్లైన్లో సమర్పించేందుకు వీలుగా సాఫ్ట్‌వేర్‌ను మెరుగుపర్చినట్లు ఈ మేరకు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్‌వో) ఓ సర్క్యులర్‌లో వెల్లడించింది. ఆన్లైన్లో దరఖాస్తులు నింపిన తర్వాత వాటిని డౌన్లోడ్ చేసుకుని, యాజమాన్యం సంతకంతో రీజినల్ పీఎఫ్ కమిషనర్‌కు ఆన్లైన్లోనే సమర్పించి సీవోసీ పొందవచ్చని తెలిపింది.
కాగా ఈపీఎఫ్‌వో ఆధ్వర్యంలోని సామాజిక భద్రతా పథకాలు ఇతర దేశాల్లోని వ్యవస్థీకృత రంగంలో పనిచేస్తున్న భారతీయులు కూడా పొందేందుకు వీలుగా ఈపీఎఫ్‌వో పలు దేశాలతో ఒప్పందం కుదుర్చుకుంది. ప్రస్తుతం బెల్జియం, జర్మనీ, స్విట్జర్లాండ్, డెన్మార్క్, లక్సెంబర్గ్, ఫ్రాన్స్, దక్షిణ కొరియా, నెదర్లాండ్స్, హంగరీ దేశాల్లోని భారతీయులకు ఈ అవకాశం అందుబాటులో ఉంది. అయితే ఈ ప్రయోజనం పొందాలంటే ఉద్యోగులు అక్కడి అధికారులకు సీవోసీ సమర్పించాల్సి ఉంటుంది.