పైసలిస్తే ఫైలు మార్చేస్తారు!
►ఇష్టారాజ్యంగా ఆస్తుల పేర్లలో మార్పులు
►మున్సిపాలిటీలో రాజ్యమేలుతున్న అవినీతి
ప్రొద్దుటూరు టౌన్ : రూ.లక్షలు విలువ చేసే ఆస్తిని ఎలాంటి రికార్డులు లేకుండానే మరొకరి పేరుతో మార్చేస్తారు. పైసలిస్తే చాలు ఏం చేయడానికైనా వెనుకాడటం లేదు ప్రొద్దుటూరు మున్సిపాలిటీ రెవెన్యూ అధికారులు. కమిషనర్లు మారుతున్నారే తప్ప వ్యవస్థలో మార్పు తీసుకువచ్చే విషయంలో ఎవ్వరూ శ్రద్ధ తీసుకోవడం లేదు. ఫలితంగా రూ.లక్షల ఆస్తుల కోసం ప్రజలు ఘర్షణ పడి ఆస్పత్రుల పాలవుతున్నారు.
అవినీతిని అరికట్టే వారేరీ: మున్సిపాలిటీలో రెవెన్యూ శాఖలో జరగుతున్న అవినీతిని అరికట్టేవారు లేక పోవడంతో వారు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఏ పని చేయాలన్నా కింది స్థాయి సిబ్బంది నుంచి మున్సిపాలిటీ హెడ్ వరకూ మామూళ్లు ఇవ్వనిదే ఫైల్‌పై సంతకం పెట్టక పోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొందరు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. చర్యలు తీసుకుంటాం: ఆస్తి పన్నుల్లో రెవెన్యూ అధికారులు చేస్తున్న అవినీతిపై కమిషనర్ శేషన్న దృష్టికి తీసుకెళ్లగా ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్నారు. డబ్బు డిమాండ్ చేస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు.
ఈయన పేరు గుర్రండోలు జగన్మోహన్. న్యాయవాది. పట్టణంలోని నేతాజీ నగర్లో డోర్ నెంబర్ 26–272–1 ఇంటిలో నివాసం ఉంటున్నారు. ఇతని అవ్వ కడప రంగమ్మ పేరుతో ఉన్న ఆస్తిని రెండు భాగాలు చేసి ఒక భాగం ఆమె కుమార్తె లక్షుమ్మకు కానుగా ఇస్తూ 1987లో రిజిస్టర్ వీలునామా రాశారు. లక్షుమ్మ కుమారుడు జి.జగన్మోహన్కు 2009 జులై 24న కానుకగా ఇస్తూ రిజిస్టర్ చేశారు. అప్పటి నుంచి ఆస్తి పన్నులో జగన్మోహన్ పేరు వచ్చేది. అయితే 2012లో ఇతని ఆస్తిని ఎవ్వరికీ అమ్మక పోయినా అతని మేనమామ అయిన కడప సుబ్బరాయుడు పేరుతో మార్చేశారు. ఈ ఆస్తికి సంబంధించి ఆయన పేరుతో ఎలాంటి రికార్డులు లేకపోయినా పేరు మార్చడంపై జగన్మోహన్ అధికారులను ప్రశ్నించారు. ఇది ఎలా సాధ్యమైందని కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ఇలా ఇప్పటికి నలుగురు కమిషనర్లకు ఫిర్యాదులు ఇస్తూనే ఉన్నారు. అయినా అతని పేరున ఉన్న ఆస్తికి పన్నులో పేరు మారలేదు. ఈయన కడప డీహెచ్ఎఫ్ఎల్ బ్యాంకులో ఇంటిని తనఖా పెట్టి రుణం తీసుకున్నారు. అయితే అధికారులు మార్పు చేస్తామంటూ ముప్పతిప్పలు పెడుతున్నారు.
ఆర్ఓ మునికృష్ణారెడ్డి సమస్యను పరిష్కరిస్తామని చెప్పి రెండు నెలలుగా తిప్పుకుని ఇప్పుడు కడప సుబ్బరాయుడు పేరు మీద రికార్డులు తీసుకురావాలంటూ చెప్పడం చూస్తుంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం అవుతోంది.
ఇతని పేరు ఎస్.మహమ్మద్‌రఫీ. ఎర్రన్న కొట్టాలలో నివాసం ఉంటున్నారు. 7–1147 డోర్ నెంబర్లోని ఇల్లు ఇతని అక్క ఎస్.మాబూచాన్ పేరున ఉంది. అయితే మూడు నెలల క్రితం దువ్వూరు పాలగిరి సత్యప్రకాష్ పేరున మార్పు చేశారు. ఇది ఎలా సాధ్యమైందని ఇతను మున్సిపల్ కార్యాలయం చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నారు. కొన్ని నెలల క్రితం పట్టణంలోని కోనేటికాలువ వీధిలో తిరుమలయ్య పేరుతో ఉన్న ఇంటి ఆస్తి పన్నును అతని తమ్ముడు పేరున మార్పు చేశారు. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి పేరు మార్పు చేయడానికి అధికారులు రూ.లక్షకు పైగా మామూళ్లు తీసుకున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. తిరుమలయ్య కార్యాలయం చుట్టూ తిరిగి రెండు నెలల క్రితం తన పేరున ఆస్తి పన్ను మార్పు చేసుకున్నారు. ఇలా ఒక్కరేమిటి రోజుకు పది మంది ఇలా తమ ఆస్తులను వేరే వారి పేరుతో ఎలా మార్పు చేశారని అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు.