రూల్స్.. రివర్స్..!
కేయూ, దూరవిద్య కేంద్రం బాగోతం
ఫీజులు చెల్లించకుండానే పీజీ పరీక్షల నిర్వహణ
నకిలీ హాల్ టికెట్లతో ఎంవోయూ సెంటర్ నిర్వాకం
నామినల్ రోల్స్‌లో పేర్లు ఉన్న విద్యార్థుల ప్రశ్నపత్రాలనే మూల్యాంకనం చేయూలి. కానీ.. ఇక్కడ ఇవేమీ పట్టించుకోకుండా ప్రొవిజనల్, మెమోలు సిద్ధం చేస్తున్నారు..!
ఇక.. ఎక్కడైనా అడ్మిషన్, టర్మ్ ఫీజు చెల్లించిన తర్వాతే తరగతులు ప్రారంభమవుతారుు. ఆ తర్వాత నామినల్ రోల్స్‌లో పేర్లు నమోదవుతారుు. ఈ మేరకు సదరు విద్యార్థులు పరీక్షలు రాసేందుకు అర్హులు. కానీ.. ఇక్కడ పరీక్షలు రాసిన తర్వాతే అడ్మిషన్ తీసుకుంటున్నారు..!
కేయూ, దూరవిద్య కేంద్రంలో నిరాటంకంగా సాగుతున్న ఈ తంతు కొందరికి కాసులు కురిపిస్తోంది. దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే నిదర్శనం.. కొనసాగుతున్న అక్రమ బాగోతం ఇది. నకిలీ హాల్‌టికెట్లతో పరీక్షలు రారుుంచిన సదరు ఎంఓయూ స్టడీ సెంటర్‌పై చర్యలు తీసుకోకుండా.. ప్రేమ ఒలకబోయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నారుు. కేయూ దూరవిద్యా కేంద్రం పరిధిలోని రంగారెడ్డి జిల్లా తాండూరుకు చెందిన ఓ డిగ్రీ కాలేజీ ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇటీవల వెలుగులోకి వచ్చిన ఘటనే ఇందుకు నిదర్శనం. ఈ స్టడీ సెంటర్లో 2011-12 అడ్మిషన్లు తీసుకున్న విద్యార్థులు కొందరు ప్రథమ సంవత్సరం పూర్తి చేశాక.. ద్వితీయ సంవత్సరం 2012-2013 అడ్మిషన్లకు సంబంధించి దూరవిద్యా కేంద్రానికి ఎలాంటి టర్మ్, పరీక్ష ఫీజు చెల్లించలేదు. ఈ మేరకు వారికి యూనివర్సిటీ పరీక్షల విభాగం హాల్ టికెట్లు పంపిణీ చేయలేదు. కానీ, సంబంధిత ఎంఓయూ సెంటర్ యూజమాన్యం.. ఫీజు చెల్లించని వారిలో కొందరు విద్యార్థులకు 2013లో నిర్వహించిన పీజీ ఫైనలియర్ పరీక్షలకు అనుమతి ఇచ్చింది.
అదీ.. నకిలీ హాల్‌టికెట్లను సృష్టించి, నామినల్ రోల్స్‌లో పేరు లేని అభ్యర్థులకు అందజేసి పరీక్షలు రాయించారు.ఆయా జవాబుపత్రాలను కేయూ పరీక్షల విభాగానికి పంపారు. నిబంధనల ప్రకారం నామినల్ రోల్స్‌లో పేరు లేని విద్యార్థుల జవాబు పత్రాలను వాల్యుయేషన్ చేయకూడదు. ఇదేమీ పట్టని కేయూ పరీక్షల విభాగం అధికారులు మూల్యాంకన ప్రక్రియ పూర్తి చేసి, ఆ తర్వాత ఫలితాలను నిలిపివేశారు. దీంతో తాండూరు స్టడీసెంటర్ యాజమాన్యం పలు సార్లు కేయూ పరీక్షల విభాగం అధికారుల చుట్టు తిరిగారు. ఫీజులు చెల్లించకుండా విద్యార్థులతో పరీక్షలు రాయించడం నిబంధనలకు విరుద్ధమని, ఫలితాలు ప్రకటించేది లేదని కొద్దిరోజులుగా అధికారులు తిరస్కరిస్తూ వచ్చారు. ఈ క్రమంలో ఏదోలా సదరు ఎంఓయూ సెంటర్ నిర్వాహకులు.. కేయూ పరీక్షల విభాగం అధికారులను మచ్చిక చేసుకుని కొంత ముట్టజెప్పినట్లు తెలిసింది. ఈ క్రమంలో ఎటువంటి ఇబ్బంది రాకుండా.. కొందరు విద్యార్థులు దూరవిద్యా కేంద్రం డెరైక్టర్‌కు లేఖపెట్టుకున్నారు. చివరకు ఒక్కో అభ్యర్థి రూ.7,200 ఫీజు చెల్లిస్తూ నో డ్యూస్ సర్టిఫికెట్ ఇస్తామని ఒప్పందానికి వచ్చారు. దీంతో రెండు రోజులుగా విద్యార్థులు దూరవిద్యా కేంద్రానికి ఫైన్‌తో సహా టర్మ్ ఫీజు చెల్లించి, కేయూలో ప్రొవిజనల్, మెమోలు తీసుకుంటున్నారు. ఇప్పటివరకు 8 మంది అభ్యర్థులు సర్టిపికెట్లను తీసుకున్నారు.
ఇందులో ఏడుగురు ఎంఏ సోషియాలజీ, ఒకరు ఎంఏ పోలిటికల్ సైన్స్ విద్యార్థులు ఉన్నారు. సదు ఎంఓయూ స్టడీ సెంటర్లో ఇలా 50 మంది వరకు విద్యార్థులు ఉన్నట్లు సమాచారం. కానీ.. ఇక్కడ నకిలీ హాల్‌టికెట్లతో పరీక్ష రారుుంచిన ఎంఓయూ సెంటర్‌పై యూనివర్సిటీ అధికారులు చర్యలు తీసుకోకపోవడం.. పరీక్షలు రాసిన తర్వాత దూరవిద్యా కేంద్రం అధికారులు అడ్మిషన్లు తీసుకోవడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఉన్నతాధికారులు సైతం మిన్నకుండి పోవడం పట్ల అనుమానాలు వ్యక్తమవుతున్నారుు.